సికింద్రాబాద్ – మేడ్చల్​కు కొత్తగా 20 ఎంఎంటీఎస్​ సర్వీసులు

సికింద్రాబాద్ – మేడ్చల్​కు కొత్తగా 20 ఎంఎంటీఎస్​ సర్వీసులు

సికింద్రాబాద్, వెలుగు: గ్రేటర్​ పరిధిలో కొత్తగా మరో  40 ఎంఎంటీఎస్​ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు 48 కి.మీ. నడుస్తున్న రైళ్లను 90 కి.మీ. విస్తరించినట్లయింది. కొత్తవాటితో కలిపి ఎంఎంటీఎస్​సర్వీసుల సంఖ్య 106కు చేరింది. కొత్తగా సికింద్రాబాద్ – మేడ్చల్ మధ్య 20 సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. మల్కాజిగిరి, దయానంద్ నగర్, సఫిల్ గూడ, రామకృష్ణాపురం, అమ్ముగూడ, అల్వాల్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, గౌడవెల్లి స్టేషన్ల పరిధిలోని ప్యాసింజర్లు ఈ సేవలు పొందుతున్నారు.

ఇప్పటికే లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్ నుమా వరకు ఉన్న 20 ఎంఎంటీఎస్ సర్వీసులను ఉందానగర్ వరకు పొడిగించారు. ఉందానగర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గర కావడంతో అక్కడికి వెళ్లే ప్యాసింజర్ల కోసం ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా మిగిలిన ప్రాంతాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.