
- మూడు క్రిమినల్ చట్టాలపై అవగాహన
- పీఐబీలో జర్నలిస్టులకు వర్క్ షాప్
- బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు
హైదరాబాద్, వెలుగు : న్యాయవ్యవస్థలో జులై 1నుంచి సమూలమార్పులు జరుగనున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మారుస్తూ బాధితులకు న్యాయం జరిగేలా సమకాలీన, సాంకేతికతకు అనుగుణంగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం క్రిమినల్ చట్టాలు అమలులోకి రానున్నాయి. ఈ దిశగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని కవాడిగూడలోని పీఐబీ కార్యాలయంలో సోమవారం జర్నలిస్టులకు వర్క్‌షాప్ నిర్వహించారు.
వార్తలాప్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ వర్క్‌షాప్‌లో జర్నలిస్టులకు చట్టాలపై అవగాహన కల్పించారు. పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వీసీ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు, సీడీటీఐ డైరెక్టర్ ఎన్.రాజశేఖర్, మాజీ ఐజీ దామోదర్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం నోటిఫై చేసిన చట్టాలు ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు.
కొత్త క్రిమినల్ చట్టాలు శిక్ష కన్నా న్యాయంపై దృష్టి సారిస్తాయని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తాయని ఆయన తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ చట్టాలను రూపొందించారని ఆయన చెప్పారు. మహిళలు, పిల్లల హక్కులపై ఎక్కువ దృష్టి పెట్టారని సీడీటీఐ డైరెక్టర్ ఎన్.రాజశేఖర్ తెలిపారు. బాధితులు తమకు జరిగిన అన్యాయంపై ఘటనా స్థలం నుంచే స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్‌లైన్ లో ఫిర్యాదు చేసేందుకు కొత్త చట్టాలు వీలు కల్పిస్తాయని ఆయన చెప్పారు. అలాగే నేరస్తులను విచారించేందుకు జ్యుడీషియల్ కస్టడీ కాలపరిమితి పెంచనున్నారని ఆయన తెలిపారు.