
- ఎఫ్ఐఆర్ నమోదైన మూడేండ్లలో కేసులు పరిష్కారం: అమిత్ షా
- ఇక ఆధునిక నేర న్యాయవ్యవస్థ మన సొంతమని కామెంట్
- నేరాలు 90% తగ్గుతాయని కేంద్ర హోంమంత్రి ఆశాభావం
న్యూఢిల్లీ: కొత్త చట్టాలు అమల్లోకి రావడంతో ఎఫ్ఐఆర్ నమోదైన మూడేండ్లలోనే బాధితులకు న్యాయం అందుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అన్ని కేసుల్లోనూ సత్వర న్యాయం జరుగుతుందన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త చట్టాలతో భవిష్యత్తులో నేరాలు కూడా 90% తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ) చట్టాలు అమల్లోకి వచ్చాయని, దీంతో ప్రపంచంలోనే ఆధునిక నేర న్యాయ వ్యవస్థ భారత్ సొంతమైనట్లు అయిందన్నారు.
కొత్త చట్టాలు ఆధునిక నేర న్యాయ వ్యవస్థను తెచ్చాయి. ఈ చట్టాల ద్వారా జీరో ఎఫ్ఐఆర్, ఆన్ లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు జారీచేయడం, క్రైం సీన్లలో తప్పనిసరి వీడియోగ్రఫీ చేయడం వంటివి చేయడానికి వీలవుతుంది. బాధితులకు త్వరగా న్యాయం చేయడానికే కొత్త చట్టాలు ప్రాధాన్యం ఇస్తాయి. ఈ–ఎఫ్ఐఆర్, జీరో ఎఫ్ఐఆర్, డిజిటల్ ఎవిడెన్స్ ద్వారా నేరాలను సులభంగా రిపోర్టు చేయవచ్చు. కొత్త చట్టాలు టైం లిమిట్ విధించడంతో న్యాయప్రక్రియ వేగవంతమవుతుంది” అని షా పేర్కొన్నారు. పిల్లలు, మహిళలపై జరిగే నేరాలకు అధ్యాయం చేర్చినందు వల్ల ఎంక్వైరీ రిపోర్టును ఏడు రోజుల్లోనే ఫైల్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
చిన్నారుల అమ్మకం, కొనుగోలు వంటి చర్యలను తీవ్రమైన నేరాలుగా చేశామని, మైనర్ పై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన వారికి మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. కొత్త చట్టాల ప్రకారం విచారణ పూర్తయిన 45 రోజుల్లోనే తీర్పు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. విచారణ ప్రారంభమైన రోజు నుంచి 60 రోజుల్లోనే అభియోగాలు ఫ్రేం చేయాల్సి ఉంటుందని వివరించారు. ఆర్గనైజ్డ్ క్రైం, టెర్రరిజం, మూకదాడుల గురించి కొత్త చట్టాల్లో నిర్వచించామని, రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చామని వెల్లడించారు.