
- వాటిలో 5.84 లక్షల ఎకరాలకు 12 ప్రాధాన్య ప్రాజెక్టుల ద్వారా నీళ్లు
- 2024–25 ఆర్థిక సంవత్సరంలో సర్కార్ నీటి పారుదల లక్ష్యం
- రూ.7,406 కోట్లతో 12 ప్రాజెక్టుల నిర్మాణం
- గోదావరి బేసిన్లో 6, కృష్ణా బేసిన్లో 6 ప్రాజెక్టుల పూర్తికి నిర్ణయం
- ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ
- అలసత్వం ప్రదర్శించొద్దని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: 2024–25 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 6.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 5.84 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు 12 ప్రాధాన్య ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వనుంది. ఐదేండ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టు ప్రాధాన్య ప్రాజెక్టులకు నిధులను కేటాయించింది.
ఆ నిధులతో ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేయాల్సిందిగా ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టుల పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని.. రైతులు, పంటలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన సూచించారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి సమీక్షించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఆదివారం జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్షించారు. బడ్జెట్ కేటాయింపులు.. ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుంది? ఎన్ని నిధులు పెండింగ్‌లో ఉన్నాయి? ప్రాజెక్టుల పనుల ఎక్కడిదాకా వచ్చాయి? వంటి విషయాలపై అధికారులతో చర్చించారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌ను సమర్థవంతంగా నిర్వహించాల్సిందిగా ఆదేశించారు.
రోజూ కాలువలను పరిశీలించాలని, అందుకు తగట్టు చర్యలను తీసుకోవాలని సూచించారు. చెరువులు, కాలువలు, రిపేర్లు, వరద నివారణ తదితర పనులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చారు. క్షేత్ర స్థాయిలో పనులు, లక్ష్యాలకు తగ్గట్టు పనులు చేయాల్సిందేనని, మంచి ఫెర్ఫార్మెన్స్ చూపించిన అధికారులకు మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు.
కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలకు తగ్గట్టు పనులను పూర్తి చేయాలని, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే విజ్ఞప్తులనూ పరిష్కరించాలన్నారు. ప్రతిపైసాను జాగ్రత్తగా ఖర్చు చేయాలని, ప్రాజెక్టులకు కేటాయించిన డబ్బును దుర్వినియోగపరచొద్దని ఆదేశించారు.
12 ప్రాజెక్టులకు రూ. 7,406 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యంలో భాగంగా 12 ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే రూ.7,406 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. నిధుల్లో ప్రాజెక్టుల నిర్మాణ పనులకు రూ.5,529.23 కోట్లు, ఇతర ఖర్చులకు రూ.1,877.20 కోట్లు కావాల్సి వస్తుందని అంచనా వేస్తున్నది. మొత్తంగా గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు రూ.3,039.71 కోట్లు, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు రూ.4,366.72 కోట్లు ఖర్చవుతాయని అంచానా వేస్తున్నారు. ఆ 12 ప్రాజెక్టుల ద్వారా 5.85 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో ఇప్పటికే ప్రారంభించి పనులు చివరి దశలో ఉన్న ఆ 12 ప్రాజెక్టులను కేటగిరీ బీ కింద చేర్చారు.
ఆయా ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. గోదావరి బేసిన్‌లోని ఆరు ప్రాజెక్టుల ద్వారా 3.32 లక్షల ఎకరాలు, కృష్ణా బేసిన్లో ఆరు ప్రాజెక్టుల ద్వారా 2.52 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించేందుకు టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రాజెక్టుల వారీగా ఇప్పటికే నిధులనూ బడ్జెట్లో కేటాయించింది. కాగా, కొడంగల్– నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌నూ ప్రాధాన్య ప్రాజెక్టుగా సర్కారు తీసుకుంది.
ఆ ప్రాజెక్టునూ ఈ ఏడాదే మొదలుపెట్టేందుకు సమాయత్తమవుతున్నది. ఆ ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్లు కావాల్సి వస్తుందని సర్కారు ప్రతిపాదించింది. అయితే, బడ్జెట్లో మాత్రం కొడంగల్ లిఫ్ట్ స్కీమ్‌కు నిధులను కేటాయించలేదు. మరోవైపు కేటగిరీ సీ కింద చేర్చిన పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను పూర్తి చేసేందుకు మరో రూ. 6,130.53 కోట్లు అవసరమవుతాయని సర్కారు అంటున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా 2026 మార్చి 31 నాటికి కొత్త ఆయకట్టుకు నీళ్లివ్వాలని భావిస్తున్నది.