ఇన్వెన్షన్..తాతకోసం మొదలుపెట్టి..

ఇన్వెన్షన్..తాతకోసం మొదలుపెట్టి..

పార్కిన్​సన్​ బారిన పడిన తాత చెప్పాలనుకున్న ఆఖరి మాటలు అర్థం చేసుకోలేకపోయానన్న బాధ ఒక న్యూరో డివైజ్​ కనుక్కునేలా చేసింది.  ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల వ్యాక్సిన్లు వేస్ట్​ అయిపోతున్నాయనే వార్త ‘వ్యాక్సిన్​ వ్యాన్​’ రూపొందించేలా చేసింది. నా వయసు పిల్లల్లో ఎన్నో కొత్త ఐడియాలు ఉంటాయి. కానీ వాటికి రూపం ఇచ్చేందుకు, మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు సరైన ప్లాట్​ఫాం లేదనే ఉద్దేశంతో ‘కలం’అనే అప్లికేషన్​ తయారుచేసి మరికొందరు స్టూడెంట్స్​ ఇన్వెన్షన్స్​ చేసేందుకు సాయపడుతున్నాడు. పదిహేడేండ్ల వయసులోనే ఇన్ని పనులు చేస్తున్న ఈ అబ్బాయి పేరు ఆదిత్య. ఢిల్లీలోని షహీద్​ రాజ్​పాల్​ దేవ్​ పబ్లిక్​ స్కూల్​ స్టూడెంట్​. తన ఆలోచనల గురించి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు...

బెల్​ కొట్టడం ఆలస్యం స్కూల్​ నుంచి ఇంటికి పరిగెత్తుకుని వెళ్లి, బ్యాగ్​ పక్కన పెట్టి తాతతో టైం స్పెండ్​ చేసేవాడ్ని. అమ్మానాన్న వాళ్ల వర్క్​ నుంచి వచ్చే వరకు తాత, నేను ఒక లోకంగా ఉండేవాళ్లం. అయితే ఇదంతా ఆరేండ్ల క్రితం సంగతి. 2017 మా జీవితాల్లో పెను మార్పు తెచ్చింది. మా తాతకు పార్కిన్​సన్​ డయాగ్నస్​ అయింది. పార్కిన్​సన్​ బారిన పడిన తాత కండిషన్​ రానురాను దారుణంగా తయారైంది.

కండరాలు గట్టిపడడంతో 2020లో మాట్లాడడం కూడా కష్టమైపోయింది. దాంతో ఆయన రోజువారీ యాక్టివిటీ మారిపోయింది. 2021లో తాత మా నుంచి దూరమయ్యారు. స్కూల్​ అయిపోయిన దగ్గర్నించీ తాతే లోకంగా ఉండే నాకు ఆయన్ని కోల్పోవడం చాలా పెద్ద లోటు. ఆయన ఆఖరి రోజుల్లో నాతో మాట్లాడాలనుకున్న విషయాలను నేను అర్థం చేసుకోగలిగి ఉంటే బాగుండేది అనిపించింది. ఆ ఆలోచనలు నన్ను ఒక దగ్గర నిలవనిచ్చేవి కాదు.

ఆ ఆలోచనలకు ఒక రూపం

దాంతో స్కూల్లో ‘అటల్​ టింకరింగ్​ ల్యాబ్’​లో ఎక్కువ టైం గడిపేవాడ్ని. అదే నన్ను పార్కిన్​సన్​ వ్యాధిగ్రస్తుల కోసం స్పెషల్​ న్యూరో డివైజ్​ కనుక్కునేలా చేసింది. తాత చనిపోయిన కొన్ని నెలల పాటు ఇంట్లో నా గది, స్కూల్లో ల్యాబ్​కి పరిమితం అయ్యా. పార్కిన్​సన్​ ఉన్న వాళ్లకు ఏ విధంగా సాయం చేయొచ్చు అనే రీసెర్చ్​ రిపోర్టు తయారయ్యాకే నేను ఆ రొటీన్​ నుంచి బయటకు వచ్చా. ఆ రిపోర్టు తరువాత న్యూరోసైట్​ డివైజ్​ ప్రొటోటైప్​ తయారుచేశా. దానికి ‘ది హాంగ్ కాంగ్​ అకాడమీ’ నుంచి మెచ్చుకోలు వచ్చింది. ఈ డివైజ్​ నాన్​ ఇన్​వేసివ్​ హెడ్​సెట్​. పక్షవాతం బారిన పడిన వాళ్లకు, న్యూరలాజికల్​ పేషెంట్స్​ ఆలోచనలను టెక్స్ట్​, ఇమేజ్​ల రూపంలో మనకు తెలిసేలా చేస్తుంది. 

ఈ న్యూరోసైట్ హెడ్​సెట్​గురించి సైన్స్​ పరిభాషలో చెప్పాలంటే న్యూరో ఇమేజింగ్​. బ్రెయిన్​ హెల్త్​ను అంచనా వేసే మెడికల్​ ఇమేజింగ్​ సిస్టమ్​ అన్నమాట. మైక్రోకంట్రోలర్స్​, సెన్సర్స్​, ఎలక్ట్రోడ్స్​ ద్వారా  మెదడులోని ఆలోచనలు తెలుసుకోవచ్చు. పేషెంట్​ మెదడు నుంచి సమాచారాన్ని సేకరించి యాప్​కి అందిస్తుంది. ఆ యాప్​ కుటుంబసభ్యుల దగ్గర ఉంటే చాలు పేషెంట్​ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్లకు ఏం కావాలి అనే విషయాలు తెలుస్తాయి.

రియల్​ టైం ప్రాసెసింగ్ మాడ్యూల్​ ద్వారా పేషెంట్ల ఆలోచనలు టెక్స్ట్​గా మారతాయి. ఈ డివైజ్​లో ఉన్న మరో మంచి ఫీచర్​ ‘లో లెవల్ న్యూరో ఇమేజింగ్​’తో కూడా హై టెక్నలాజికల్​ అసిస్టెన్స్​ ఇవ్వగలగడం. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ ఇంటిగ్రేషన్​ వల్ల ఇది సాధ్యమైంది. అంతర్జాతీయ వేదికల మీదకు ఈ హెడ్​సెట్​ పరిచయం కాకముందే మా  స్కూల్​ వాళ్లు నా ఇన్వెన్షన్​ను గుర్తించారు.

ఒక దాన్నుంచి మరోటి...

నేను ఏ ప్రాజెక్ట్​ చేయడం మొదలుపెట్టినా అది ఏదో ఒకరకంగా ఉపయోగపడేలా ఉండాలి అనుకుంటా. అలా తయారైందే నా రెండో ప్రాజెక్ట్​ ‘వ్యాక్సివ్యాన్​’ . దీన్ని 2021లో తయారుచేశా. కొవిడ్​ 19 సెకండ్​ వేవ్​ టైంలో వ్యాక్సిన్​ వేస్టేజి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని లెక్కలు విడుదలచేసింది. అవి చూసి షాక్​ అయిన నేను ఆ వేస్టేజ్​ని తగ్గించేందుకు నా వంతు ప్రయత్నంగా ‘వ్యాక్సివ్యాన్’​ తయారుచేశా. ఆ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 50శాతం వ్యాక్సిన్​లు వేస్ట్​ అవుతున్నాయి.

అందుకు కారణం ఉష్ణోగ్రతల్లో ఉన్న తేడా. మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్లకు కూడా వ్యాక్సిన్​ చేరేవరకు టెంపరేచర్స్​ కంట్రోల్​లో ఉండాలి. లేకపోతే వ్యాక్సిన్​ వాళ్లను చేరేలోపే వృథా అయిపోతుంది. ఆ సమస్యకు పరిష్కారం కోసం స్కూల్​లో ఉన్న అటల్​ ల్యాబ్​​ వాడా. కొన్ని నెలల పాటు గంటల తరబడి ల్యాబ్​లోనే ఉండి ‘థర్మోఎలక్ట్రిక్​ డివైజ్’ తయారుచేశా.  అదే వ్యాక్సి వ్యాన్​. ఇందులో రిఫ్రిజిరేషన్​ కంట్రోల్​ ఉంటుంది.

వ్యాక్సి వ్యాన్’తో తక్కువ ఖర్చుతో వ్యాక్సిన్​ ట్రాన్స్​పోర్ట్​ చేయొచ్చు. స్టోర్​ చేయడానికి ఇబ్బంది ఉండదు. వ్యాక్సి వ్యాన్​లో ఉన్న సైకిల్ పెడలింగ్​తో ఐస్​ ప్యాక్స్​కి అవసరమైన ఎలక్ట్రిసిటీ బయటి నుంచి అందుతుంది. అదెలాగంటే... సైకిల్​ పెడల్స్​ తొక్కినప్పుడు ఎలక్ట్రోమ్యాగ్నెటిజమ్​ ద్వారా కరెంట్​ పుడుతుంది. ఆ కరెంట్​ స్టోర్​ అయ్యి వ్యాక్సిన్స్​ ఫ్రీజ్​ అయ్యేందుకు ఉపయోగపడే 2–8 డిగ్రీల సెల్సియస్​ టెంపరేచర్​ను జనరేట్ చేస్తుంది.

ఆర్థికసాయం అందింది

వ్యాక్సివ్యాన్​ ప్రాజెక్ట్​కు ఆర్థికసాయం కూడా అందింది. ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ రోడ్స్​ ట్రస్ట్​, షిమిడిట్​​ ఫ్యూచర్స్​కు ఫైనలైజ్​ అయింది. గూగుల్​ మాజీ సీఈఓ ఎరిక్ షిమిడిట్​ పదివేల డాలర్లను ప్రొటోటైప్​ గ్రాంట్​ స్కాలర్​షిప్​గా ఇచ్చారు. భారత ప్రభుత్వ సైన్స్​ అండ్​ టెక్నాలజీ విభాగం ఇన్​స్పైర్​–మనాక్​లో ప్రొటోటైప్​ డెవలప్​మెంట్​కు ఎంపిక చేసింది. ఈ ప్రోగ్రామ్​ పది నుంచి పదిహేనేండ్ల స్కూల్​ పిల్లల్లో  ఇన్నొవేటివ్​ ఆలోచనలను వెలికి తీసేందుకు ప్లాట్​ఫాం. ఇప్పుడు ఇంటర్నేషనల్​ సైన్స్​ అండ్​ ఇంజినీరింగ్ ఫెయిర్​ 2022కి అప్లయ్​ చేయాలి అనుకున్నా.  ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్​ ప్రి –కాలేజ్​ సైన్స్​ కాంపిటీషన్​ ఇది. అయితే దీనికంటే ముందు ఇండియాలో ‘ఐరిస్​ నేషనల్​ కాంపిటీషన్’​లో మొదట పార్టిసిపేట్​ చేయాలి.

గవర్నమెంట్ స్కూల్​ పిల్లల కోసం...

కానీ సమాజానికి ఉపయోగపడేలా ఇంకా ఏదైనా చేయాలి అనిపించేది. అదే నన్ను 2023 మొదట్లో ‘కలం’ ఏర్పాటుకు దారితీసింది. దీనిద్వారా స్టూడెంట్స్​కు ఫండింగ్​, స్కాలర్​షిప్​​, గ్రాంట్స్​ వంటివి ఇస్తున్నాం. సైన్స్​లో జ్ఞానాన్ని పెంపొందించేందుకు డాక్టర్​ ఎపిజె అబ్దుల్​ కలామ్​ గారు తన జీవితం అంతా ధారపోసారు. లక్షల మంది స్టూడెంట్స్​కు ఆయన రోల్​మోడల్. అలాగే ఇంగ్లిష్​లో ‘పెన్’​ అంటే అర్ధం ‘కలం’. కలం అనేది మన స్టోరీని నలుగురికి చెప్పే శక్తిని ఇస్తుంది.

మన డెస్టినీని రాసుకునే అవకాశాన్ని ఇస్తుంది. అన్ని ఆవిష్కరణలు స్కూల్​ స్థాయిలో జరగాలని ఇది మొదలుపెట్టా. కలం ఆలోచనలు రూపుదిద్దుకుంది మాత్రం మూడు నెలలపాటు లేవలేని పరిస్థితిలో నేను బెడ్​ మీద ఉన్నప్పుడు. పన్నెండో తరగతి బోర్డ్​ ఎగ్జామ్స్​ టైంలో నాకు యాక్సిడెంట్​ అయింది. అప్పుడు ఇంటర్నెట్​ స్క్రోల్​ చేయడం తప్ప వేరే పని చేసే పరిస్థితి లేదు. అలాగని నేను మానసికంగా కుంగిపోలేదు. అప్పుడు కలం గురించి బ్రెయిన్​ వర్క్​ చేశా. ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్స్​కు కలం లాంచ్​ప్యాడ్​ కావాలనుకున్నా. అక్కడే ఎందుకంటే గవర్నమెంట్​ స్కూల్స్​లో చదివే పిల్లలకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ ఆ ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ల కోసం కలం ఒక ప్లాట్​ఫాం.

కలం తీరుస్తోంది

ఇందులో నా ఫ్రెండ్స్​ సాయం చాలా ఉంది. ఒక ఫ్రెండ్​ ‘లా’ చదువుతున్నాడు. అతను కంపెనీ రిజిస్ట్రేషన్​తో పాటు చట్టపరమైన అంశాల్లో సాయం చేస్తున్నాడు. ఇంకో ఫ్రెండ్​ ఆగ్రాలో అగ్రికల్చరల్​ సైన్స్​ చదువుతున్నాడు. మా యాప్​కి సంబంధించి ప్రతీ చిన్న అంశాన్ని తను చూసుకుంటాడు. స్టూడెంట్స్​కి సాయం చేసేందుకు స్టూడెంట్స్​ తయారుచేసిన యాప్​ ఇది. కలం ద్వారా ఢిల్లీ కేంద్రీయ విద్యాలయ స్కూల్లో వర్క్​షాప్స్​ ఏర్పాటుచేస్తున్నాం.

అక్కడి స్టూడెంట్స్​కు ఐడియాలు ఉన్నాయి. కానీ వాటికి ప్రాక్టికల్ రూపం ఇచ్చేందుకు సరైన వనరులు లేవు. అలాగే మా స్కూల్​ పక్కన ఉన్న పబ్లిక్​ స్కూల్​లో 20 మంది పిల్లలకు సెషన్స్​ ఏర్పాటుచేసి ‘ఇన్నొవేషన్’​ అనే టాపిక్​ మీద మాట్లాడాం. ఈ సెషన్​లో వాళ్ల ఐడియాలను ప్రోత్సహించాం. అక్కడ తొమ్మిది మంది స్టూడెంట్స్​కు సాయం చేశాం. మా స్కూల్​లో చదివే పదకొండో క్లాస్​ స్టూడెంట్​ వీర్​జ్యోత్ సింగ్​కి కలం ప్రాజెక్ట్​ వరం అయ్యింది.

వీర్​జ్యోత్​ ఇమేజ్​ ను టెక్స్ట్​గా ట్రాన్స్​లేట్​ చేసే రియల్​ టైం అప్లికేషన్​ తయారుచేస్తున్నాడు. అతనికి కలం నుంచి గైడెన్స్​ ఇచ్చాం. కలం ప్లాట్​ఫాం నేను అనుకున్న రిజల్ట్స్​ ఇవ్వడం మొదలుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఫండింగ్ సపోర్టు కూడా ఇవ్వగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఫండింగ్ మామూలుగా అయితే ఐఐటీ స్టూడెంట్స్​ ఐడియాలకు ​ దొరుకుతుంది. అదే మామూలు స్టూడెంట్స్​కు ఐడియాలు ఉన్నా ఫండింగ్​ దొరకటం కష్టం అవుతుంది.

ఆ లోటును ‘కలం’ ద్వారా తీరుస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇంకా ఎన్నో ఇన్వెన్షన్లు రావాలి. ఇంకా బాగా ఎదగాలి” అంటున్న ఆదిత్యను చూస్తుంటే సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆలోచనలు ఉండాలే కానీ ఆచరణలో పెట్టడం ఏమంత కష్టం కాదనిపిస్తుంది కదా!

రకరకాల న్యూరలాజికల్ కండిషన్స్​ ఉన్న వాళ్లకు ఇది ఉపయోగపడుతుంది. స్ట్రోక్​ వచ్చిన పేషెంట్​ న్యూరో సైట్​ డివైజ్​ను, రోబోటిక్ చేతిని కంట్రోల్​ చేసేందుకు వాడొచ్చు. అలాగే సెరిబ్రల్ పాల్సీ ఉన్న పిల్లలు వీడియో గేమ్స్​ ఆడేందుకు ఉపయోగపడుతుంది ఇది” అని ఆదిత్య స్కూల్​ కంప్యూటర్​​ సైన్స్​ డిపార్ట్​మెంట్ హెడ్​ వినీత గర్గ్​ చెప్పారు.