త్వరలో విద్యుత్ సంస్థలకు కొత్త డైరెక్టర్లు!..16 మంది నియామకానికి పూర్తయిన కసరత్తు 

త్వరలో విద్యుత్ సంస్థలకు కొత్త డైరెక్టర్లు!..16 మంది నియామకానికి పూర్తయిన కసరత్తు 
  • ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున సర్కార్‌‌‌‌కు షార్ట్ లిస్ట్  
  • ఈ పోస్టుల భర్తీకి ఏడాది కింద నోటిఫికేషన్
  • వివిధ కారణాలతో ఆలస్యమైన ప్రక్రియ 

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 డైరెక్టర్ పోస్టుల భర్తీకి చేపట్టిన కసరత్తు తుది దశకు చేరింది. వీటి కోసం అప్లయ్ చేసుకున్న అధికారులకు ఎక్స్‌‌పర్ట్ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించగా, ఆయా అధికారుల వ్యవహార శైలిపై ఇంటెలిజెన్స్‌‌ ఎంక్వైరీ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున షార్ట్‌‌ లిస్ట్ చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది. త్వరలోనే నియామక ఉత్తర్వులు జారీ కానున్నట్టు సమాచారం. కాగా, రెండు డిస్కంలలో 8, జెన్కోలో 5, ట్రాన్స్‌‌కోలో 3 డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. 

పోయినేడాది నోటిఫికేషన్.. 

గత బీఆర్‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ఏండ్ల తరబడి కొనసాగిన డైరెక్టర్లను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించారు. మొత్తం 22 మందిని తొలగిస్తూ  2024 జనవరి 27న ఉత్తర్వులు ఇచ్చారు. కొన్ని సంస్థల్లో అనవసరంగా ఉన్న డైరెక్టర్ పోస్టులను తొలగించి, వాటి సంఖ్యను 16కు కుదించారు. అనంతరం అదే ఏడాది ఫిబ్రవరిలో 16 డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేసిన అధికారులతో పాటు డిస్కంలలో సీఈ స్థాయి అధికారుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. 16 పోస్టులకు గాను  91 మంది నుంచి 152 దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది.

ఈ పోస్టులకు చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, ప్రస్తుతమున్న తాత్కాలిక డైరెక్టర్లు సైతం పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో విద్యుత్​సంస్థల్లో అధికారులకు ఉన్న అనుభవం, విషయ నైపుణ్యంతో పాటు వారి పనితీరు ఆధారంగా కొంతమందిని షార్ట్‌‌ లిస్ట్ చేసి ఇంధ‌‌న శాఖ ఆధ్వర్యంలో ఎనర్జీ సెక్రటరీ, డిస్కంల సీఎండీలు, ప్రభుత్వం నియమించిన ఎక్స్‌‌పర్ట్​తో కూడిన సెలక్షన్ క‌‌మిటీ ఇంట‌‌ర్వ్యూలు నిర్వహించింది. నిబద్ధత కలిగిన అధికారులను ఎంపిక చేసే క్రమంలో షార్ట్​లిస్టు చేసిన అధికారుల వ్యవహర శైలిపై ఇంటెలిజెన్స్‌‌తో ఎంక్వైరీ చేయించారు. అనంతరం ఒక్కో డైరెక్టర్​పోస్టుకు ముగ్గురు చొప్పున షార్ట్ లిస్టు ప్రభుత్వానికి సిఫార‌‌సు చేశారు. 

అందుకే జాప్యం! 

ఈ పోస్టుల భర్తీకి ఏడాది కిందనే నోటిఫికేషన్ ఇచ్చినా లాబీయింగ్, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎంపిక ప్రక్రియలో జాప్యం జరిగినట్టు తెలుస్తున్నది. డైరెక్టర్లుగా నియమితులు కావాలంటే 62 ఏండ్ల కంటే తక్కువ వయసు, సంబంధిత సబ్జెక్ట్‌‌లో డిగ్రీతో పాటు 15 ఏళ్ల అనుభవం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో 25 ఏండ్ల వృత్తిపరమైన అనుభవం కలిగి ఉండాలి.

ఈ నేపథ్యంలో రైల్వే శాఖ‌‌, నేష‌‌న‌‌ల్ థ‌‌ర్మల్ ప‌‌వ‌‌ర్ కార్పొరేష‌‌న్‌‌, సింగ‌‌రేణితో పాటు దేశంలోని ప‌‌లు విద్యుత్ సంస్థల్లో ప‌‌ని చేసిన సీనియ‌‌ర్ అధికారులు, రిటైర్డు ఇంజ‌‌నీర్లు పోటీ పడ్డారు. కాగా, కొత్త డైరెక్టర్లను రెండేండ్ల కాలానికి నియమిస్తారు. అవసరమైతే మరో రెండేండ్ల వరకు పొడిగించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలు, ఎంక్వైరీలు పూర్తయిన నేపథ్యంలో పోస్టులకు దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది.