రిటైర్డ్ ఎంపీడీఓ హత్య కేసులో తవ్వే కొద్దీ నిజాలు

రిటైర్డ్ ఎంపీడీఓ హత్య కేసులో తవ్వే కొద్దీ నిజాలు
  • నల్లా రామకృష్ణయ్య, సుభద్రను ఒకేలా చంపించిన జనగామ జెడ్పీ వైస్ చైర్​పర్సన్​ భర్త
  • సుభద్రను హత్య చేశామని ఒప్పుకున్న నిందితుడు..  
  • టెక్నికల్ ఎవిడెన్స్ కోసం సుభద్ర మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టమ్‌‌‌‌‌‌‌‌

జనగామ/బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లాలో ఇటీవల జరిగిన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య హత్య కేసు విచారణలో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామకృష్ణయ్యను చంపించిన జనగామ జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త అంజయ్య.. తనకు చెల్లెలి వరుస అయ్యే సుభద్రను ఆస్తి కోసం హత్య చేయించాడు. ఈ నేపథ్యంలో గురువారం సుభద్ర మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ ఖాజా మొయినొద్దీన్ ఆధ్వర్యంలోని ఫోరెన్సిక్ బృందం.. బచ్చన్నపేట మండలం సదాశివపేటలో ఖననం చేసిన చోటు నుంచి పలు శరీర భాగాలను సేకరించింది. ఫోరెన్సిక్ టెస్టుల కోసం పంపింది. ఈ రిపోర్ట్ రెండు వారాల్లో రానుంది.

తొలి పోస్టుమార్టంపై దుమారం

భర్త మల్లేశం చనిపోవడంతో కొన్నేండ్ల కిందట తన తల్లిగారి ఊరు బచ్చన్నపేట మండలం సదాశివ పేటకు గంగరబోయిన సుభద్ర (34) వచ్చింది. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్ 20న పొలం పనులకు వెళ్లిన సుభద్ర.. మధ్యాహ్నం దాకా ఇంటికి రాకపోవడంతో తల్లి చంద్రమ్మ పొలం వద్దకు వెళ్లింది. సుభద్ర పడిపోయి ఉండటం చూసి.. స్థానికుల సాయంతో వెంటనే జనగామ జిల్లా హాస్పిటల్​కు తీసుకెళ్లింది. తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్తుండగా భువనగిరి ప్రాంతంలో మృతి చెందింది. సుభద్ర గొంతు చుట్టూ కమిలిపోయి ఉండడం, శరీర భాగాలపై గాయాలు కనిపించాయి. అయినా పట్టించుకోకుండా పొలం వద్ద ఖననం చేశారు. ఈ క్రమంలోనే బంధువులు వరంగల్ సీపీని ఆశ్రయించగా.. గతేడాది నవంబర్ 25న తొలి సారి పోస్టుమార్టం చేశారు. సుభద్ర మృతి చెందిన 34 రోజుల తర్వాత నిర్వహించిన పోస్టుమార్టంపైనా విమర్శలున్నాయి. గాయాలైన చోట కాకుండా.. పొట్ట భాగంలో శాంపిల్స్‌‌‌‌‌‌‌‌ను సేకరించారు. పోస్టుమార్టం చేసిన రాహుల్, ప్రదీప్ అనే డాక్టర్లు ‘కార్డియాక్ అరెస్ట్‌‌‌‌‌‌‌‌’ వల్ల చనిపోయినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.

 అయితే రామకృష్ణయ్య మెడకు టవల్ బిగించి చంపినట్లుగానే ఆస్తి కోసం సుభద్రను సుపారీ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌తో హత్య చేయించినట్లు అంజయ్య ఒప్పుకున్నాడు. దీంతో టెక్నికల్ ఎవిడెన్స్‌‌‌‌‌‌‌‌ల కోసం వరంగల్ సీపీ రంగనాథ్ ఆదేశాల మేరకు సుభద్ర మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు.

వాళ్లిద్దరు ఎక్కడ?

నల్లా రామకృష్ణయ్య గత నెల 15న హత్యకు గురయ్యాడు. 18న జనగామ శివారు చంపక్ హిల్స్‌‌‌‌‌‌‌‌లోని ఓ క్రషర్​ కుంటలో మృతదేహం లభ్యమైంది. ఈ రెండు కేసుల్లోని నిందితుల సంఖ్య 10కి చేరింది. తొలుత రామకృష్ణయ్య హత్య లో ఐదుగురు నిందితులు పాల్గొన్నారని సీపీ రంగనాథ్ చెప్పారు.​ ప్రధాన నిందితుడు జనగామ జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త అంజయ్య, డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా, దండుగుల తిరుపతి, దండుగుల రాజు పాత్ర ఉందని తెలిపారు. వీరిలో దండుగుల తిరుపతి, రాజు పరారీలో ఉన్నారని చెప్పారు. మరో ముగ్గురు నిందితులు పస్తం జలందర్, గట్టు మల్లేశ్‌‌‌‌‌‌‌‌, పస్తం ఉప్పలయ్య హస్తం ఉందంటూ గత నెల 30న అరెస్టు చేశారు. 

ఈనెల 3న పస్తం ధర్మయ్య, పస్తం జగన్నాథంలను కూడా అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. కానీ దండుగుల తిరుపతి, రాజులను నేటి వరకు పోలీసులు అరెస్ట్ చూపించ లేదు. వీరు పరారీలో ఉన్నారని పైకి చెబుతున్నా..  పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. సుపారీ హత్యల్లో వీరిది కీలక పాత్ర కావడంతో ఇంకా ఎక్కడెక్కడ హత్యలు చేశారనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తున్నది.