తండ్రి, తాతల వారసత్వంతో పాలిటిక్స్ లోకి

తండ్రి, తాతల వారసత్వంతో పాలిటిక్స్ లోకి
  • నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు కొందరి యత్నం
  • క్రియాశీల రాజకీయాల్లో మరికొందరు
  • ఉమ్మడి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన కుటుంబాల నుంచి  కొత్త తరం తెరపైకి     

కరీంనగర్, వెలుగు :  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక వెలుగు వెలిగిన కుటుంబాల నుంచి మూడో తరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమ తండ్రి, తాతల వారసత్వంతో  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారు కొందరైతే.. ఇదే ఎన్నికల రణక్షేత్రంలో రాజకీయ పాఠాలు నేర్చుకునేందుకు మరికొందరు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన తొలితరం ఉద్ధండులు కన్నుమూయగా.. వారి వారసుల్లో కొందరు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు.  ఇప్పుడు ఉన్న మరో తరం కూడా తాము క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడే తమ వారసులను తెరపై తీసుకురావాలని భావిస్తున్నారు. అందుకే తమ స్థానంలో వారసులను బరిలోకి దింపడం, లేదంటే పార్టీ వ్యవహారాలు అప్పగించడం లాంటివి చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఉద్ధండులెందరో..  

ఉమ్మడి కరీంనగర్  రాజకీయాల్లో తొలితరం నేతలు తమ ప్రతిభతో దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్రవేశారు. అలాంటి వారిలో అగ్రగణ్యుడు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు. ఉమ్మడి జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన ఆయన.. సీఎంగా,  ప్రధానిగా పనిచేశారు. ఆయన తర్వాత జాతీయ స్థాయిలో  పెద్దపల్లి ఎంపీగా, కేంద్ర మంత్రిగా గడ్డం వెంకటస్వామి(కాకా) పనిచేశారు. వొడితెల రాజేశ్వర్  రావు, కమ్యూనిస్టు యోధులుగా పేరుగాంచిన బద్దం ఎల్లారెడ్డి, చెన్నమనేని రాజేశ్వర్  రావు ఎంపీలుగా వ్యవహరించారు. మంథని నుంచి గెలిచి దుద్దిళ్ల శ్రీపాదరావు స్పీకర్ గా పనిచేయగా, ఎం.సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్), జువ్వాడి చొక్కారావు, జువ్వాడి రత్నాకర్  రావు, ముద్దసాని దామోదర్  రెడ్డి లాంటి నేతలు మంత్రులుగా పనిచేశారు. వీరంతా ఉమ్మడి కరీంనగర్  రాజకీయాల్లో తమదైన ముద్రవేసి కాలం చేశారు. అలాగే మహారాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్  రావు, మాజీ ఎంపీ గొట్టెభూపతి యాక్టివ్  పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు.  తొలితరం నేత గడ్డం వెంకటస్వామి (కాకా) వారసుడిగా రెండో తరం నేతగా డాక్టర్  వివేక్  వెంకట స్వామి 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఆయన యాక్టివ్ గా ఉన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోరులోకి నవతరం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల రణరంగంలోకి అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు కొందరు, పార్టీ కోసం పని  చేసేందుకు మరికొందరు యువకులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. వీళ్లలో ఇప్పటికే రాజకీయ నేపథ్యం, ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలకు చెందినవారే ఉన్నారు. వారిలో ఈసారి కోరుట్ల నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొడుకు డాక్టర్  కల్వకుంట్ల సంజయ్  బీఆర్ఎస్  తరపున తండ్రి స్థానంలో పోటీ చేయబోతున్నారు. అలాగే మహారాష్ట్ర మాజీ గవర్నర్  చెన్నమనేని విద్యాసాగర్ రావు కొడుకు డాక్టర్  వికాస్ రావు కూడా బీజేపీలో చేరి వేములవాడ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసిన కొమిరెడ్డి రాములు, జ్యోతి దంపతుల కుమారుడు కొమిరెడ్డి కరమ్ చంద్  ఈసారి కోరుట్ల నుంచి కాంగ్రెస్  తరపున పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ సురభి భూం రావు కుమారుడు సురభి నవీన్.. కోరుట్ల  బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మా వెంకన్న కుమారుడు బొమ్మా శ్రీరాం చక్రవర్తి ఈసారి బీజేపీ హుస్నాబాద్ టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కరీంనగర్  నుంచి మాజీ మంత్రి ఎం.సత్యనారాయణ రావు మనవడు మేనేని రోహిత్  రావు కూడా ఈసారి కరీంనగర్  నుంచి పోటీచేయాలని పట్టుదలతో ఉన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నుంచి మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి కొడుకు సునీల్  రెడ్డి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు.

యాక్టివ్ పాలిటిక్స్ లోకి ..యూత్ లీడర్ల కూడా

రాష్ట్ర బీసీ సంక్షేమ, సివిల్  సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్  కుమారుడు  గంగుల హరిహరణ్  కరీంనగర్  యూత్ పాలిటిక్స్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వందలాది మంది యూత్  లీడర్లు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. తన తండ్రి గెలుపు కోసం పనిచేయడంతోపాటు రాజకీయాలు, ప్రజాసేవలో అనుభవం కోసం వచ్చే ఎన్నికలను వేదికగా చేసుకోవాలని హరిహరణ్  భావిస్తున్నారు. అలాగే రామగుండం నుంచి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కొడుకు సోమారపు అరుణ్  కూడా తండ్రితో పాటు పాలిటిక్స్ లో యాక్టివ్  అయ్యారు. రాజ్యసభ మాజీ సభ్యుడు వొడితెల రాజేశ్వర్ రావు  మనవడు ప్రణవ్  కూడా తన తాత విగ్రహావిష్కరణతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.