మెగా ఇన్‌‌ఫ్రా ప్రాజెక్టుల కోసం కొత్త జాతీయ బ్యాంక్​

మెగా ఇన్‌‌ఫ్రా ప్రాజెక్టుల కోసం కొత్త జాతీయ బ్యాంక్​
  • రూ. 20 వేల కోట్లు ఇస్తున్నాం
  • సంస్థలో 100% వాటా ప్రభుత్వం చేతిలోనే
  • భవిష్యత్​లో 26 శాతానికి తగ్గుతుంది
  • కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడి

న్యూఢిల్లీ:రోడ్లు, కరెంటు వంటి పెద్ద పెద్ద ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ ప్రాజెక్టులకు అవసరమైన డబ్బును సమకూర్చడానికి  డెవలప్‌‌మెంట్‌‌ ఫైనాన్స్‌‌ ఇన్‌‌స్టిట్యూషన్‌‌ (డీఎఫ్‌‌ఐ) ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలోని మెగా ఇన్​ఫ్రా ప్రాజెక్టులకు డబ్బులు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో నేషనల్​ బ్యాంక్​ ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్లోనే నిర్మలా సీతారామన్​ ఒక ప్రకటన చేశారు. ఈ నేషనల్​ బ్యాంక్​ ప్రపోజల్‌‌కు కేబినెట్‌‌ గ్రీన్‌‌సిగ్నల్‌‌ ఇచ్చిందన్నారు. ఈ సంస్థకు మూలధనం అందించడానికి రూ.20 వేల కోట్లు ఇస్తామని బడ్జెట్‌‌లో ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలోనూ ఇన్‌‌ఫ్రా ప్రాజెక్టుల కోసం ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఫండ్స్‌‌ ఏర్పాటు చేసినప్పటికీ, ఏ ఒక్క బ్యాంకూ ముందుకు రాలేదని చెప్పారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని, ఎక్కువ రిస్క్‌‌ ఉండటం వల్ల అవి భయపడ్డాయని అన్నారు. ‘‘డీఎఫ్‌‌ఐ ఏర్పాటు కోసం రూపొందించిన బిల్లుకు కేబినెట్‌‌ ఓకే చెప్పింది. దీనివల్ల లాంగ్‌‌టర్మ్‌‌ ఫండ్స్‌‌ అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త సంస్థలో 50 శాతం మంది నాన్‌‌–అఫీషియల్‌‌ డైరెక్టర్లు ఉంటారు. పదేళ్లపాటు డీఎఫ్‌‌ఐకి పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి’’ అని ఆమె వివరించారు. డీఎఫ్‌‌ఐ కోసం కొన్ని సెక్యూరిటీలను కూడా జారీ చేయాలని కేంద్రం భావిస్తోందని, దీనివల్ల నిధుల సేకరణ ఖర్చు తగ్గుతుందని అన్నారు. ‘‘సెక్యూరిటీల జారీ వల్ల డీఎఫ్‌‌ఐ చాలా చోట్ల నుంచి  క్యాపిటల్‌‌ను, ఫండ్స్‌‌ను సమకూర్చుకుంటుంది. మనదేశ బాండ్‌‌ మార్కెట్‌‌కు లాభం కలుగుతుంది. డీఎఫ్‌‌ఐ 100 శాతం ప్రభుత్వ యాజమాన్యంతోనే మొదలవుతుంది. తరువాత వాటాను 26 శాతానికి తగ్గిస్తాం’’ అని ఆమె వివరించారు. 2020–2025 మధ్య నేషనల్‌‌ ఇన్‌‌ఫ్రా పైప్‌‌లైన్‌‌ (ఎన్‌‌ఐపీ) కింద రూ.111 లక్షల కోట్ల విలువైన ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. 
ప్రైవేటు బ్యాంకుల్లోనూ గవర్నమెంట్‌‌ ట్రాన్సాక్షన్లు
ఇక నుంచి మరిన్ని ప్రైవేటు బ్యాంకుల్లోనూ గవర్నమెంటుకు సంబంధించిన లావాదేవీలు నిర్వహించడానికి ఆర్‌‌బీఐ గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారం అనుమతులు ఇస్తామని మంత్రి నిర్మల పార్లమెంటులో ప్రకటించారు. పీఎస్‌‌యూ బ్యాంకులతోపాటు ప్రైవేటు బ్యాంకులకూ సమాన అవకాశాలు కల్పించాలని ఆర్‌‌బీఐకి తాము సూచించామని వెల్లడించారు. ఇప్పుడున్న ఆర్‌‌బీఐ రూల్స్‌‌ ప్రకారం కొన్ని బ్యాంకులు గవర్నమెంటు ట్రాన్సాక్షన్లు నిర్వహించడానికి గతంలోనూ పర్మిషన్లు ఇచ్చామన్నారు. కొత్త బ్యాంకులకు, ప్రైవేటు బ్యాంకులకు ఇవే రూల్స్‌‌ వర్తిస్తాయని అన్నారు. ప్రైవేటు బ్యాంకులకు ఇలాంటి పర్మిషన్లు ఇవ్వడం వల్ల జనం మరింత సులువుగా గవర్నమెంటు సేవలు పొందుతారని ఆమె చెప్పారు.   ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌‌ ఠాకూర్‌‌ మాట్లాడుతూ 2000లో ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ల శాతం 12.63 శాతం ఉండగా, ఇప్పుడు 30.35 శాతానికి పెరిగాయని అన్నారు. అడ్వాన్సులు కూడా 12.56 శాతం నుంచి 30.35 శాతానికి పెరిగాయన్నారు.

అన్ని బ్యాంకులను ప్రైవేటైజ్ చేయం

ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తారన్న ప్రచారం అబద్దమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రైవేటైజ్ చేసిన బ్యాంకుల ఉద్యోగుల ప్రయోజనాలను పూర్తిగా కాపాడుతామని, ప్రైవెటైజేషన్ పూర్తయిన తర్వాత కూడా ఆ బ్యాంకులు ఎప్పటిలాగే పనిచేయస్తాయని అన్నారు. ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు, ప్రమోషన్లకు ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ పాలసీ ప్రకారం మేం నాలుగు ముఖ్యమైన సెక్టార్లను గుర్తించాం.. అందులో ఫైనాన్షియల్ సెక్టార్ కూడా ఒకటి. బ్యాంకింగ్ సెక్టార్ లో ప్రభుత్వం కూడా ఉంటుందని మంత్రి అన్నారు. బ్యాంకులలో మోసాలను అడ్డుకోవడానికి ఆర్‌‌బీఐ గట్టి చర్యలు తీసుకుంటోందని మంత్రి నిర్మల చెప్పారు. ఇక నుంచి బ్యాంకుల్లో రెగ్యులేటరీపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉండదని అన్నారు. ఆర్‌‌బీఐ మరింత సమర్థంగా పనిచేసేందుకు దానితో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. బ్యాంకులపై ఆర్‌‌బీఐకి ఇక ముందు మరింత కంట్రోల్‌‌ ఉంటుందని అన్నారు. బ్యాంకుల్లో ఇటీవలు పలు స్కామ్‌‌లు బయటపడ్డాయని, ఇటువంటి బారిన జనం పడకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ నరేశ్‌‌ గుజ్రాల్‌‌ ప్రశ్నించగా, ఆమె పైవిధంగా జవాబు ఇచ్చారు. రెగ్యులేటరీ మెకానిజం మరింత సమర్థంగా పనిచేసేలా చేస్తామని, ఇందుకోసం ఆర్‌‌బీఐలోని ఖాళీలను భర్తీ చేస్తున్నామని చెప్పారు.