
పీడీఎస్ యూ జిల్లా మహాసభలో వక్తలు
సిద్దిపేట రూరల్, వెలుగు : దేశంలో ప్రజల మధ్య అంతరాలు పెంచి పోషించే విధంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాలని చూస్తోందని, వెంటనే నూతన జాతీయ విద్యావిధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం పీడీఎస్‌యూ జిల్లా 3వ మహాసభ సందర్భంగా పట్టణంలోని సీతారామాంజనేయ టాకీస్ నుంచి విపంచి కళా నిలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ నిర్వహించిన సభలో నర్సింహారెడ్డి మాట్లాడారు. దేశంలో ఆర్థిక అసమానతలు లేని విద్య అందరికీ సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ పిట్ల సరిత, టీపీటీఫ్ రాష్ట్ర సీనియర్ నాయకుడు జి.తిరుపతి రెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నాయని మండిపడ్డారు. పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జూపాక శ్రీనివాస్, మహేశ్ మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు ప్రైవేటు యూనివర్సిటీలను నెలకోల్పుతుందన్నారు. తక్షణమే విద్యార్థి వ్యతిరేక విధానాలను మానుకొని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు విద్యనాథ్, సహాయ కార్యదర్శి మహేశ్, కోశాధికారి సందీప్, పట్టణ అధ్యక్షుడు ప్రణయ్ కుమార్, కార్యదర్శి హిమంత్ కృష్ణ, సందీప్, వెంకట్, ప్రదీప్, వివిధ మండలాల విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు.
గీతంలో ఉత్సాహంగా ‘హాలోవీన్ డే’
రామచంద్రాపురం, వెలుగు : పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీలో మంగళవారం హాలోవీన్ డే సెలబ్రేషన్స్ ఉత్సాహంగా కొనసాగాయి. పాశ్చత్య దేశాల్లో ఆల్ సెయింట్స్‌డే సందర్భంగా ప్రతిఏటా నిర్వహించే హాలోవీన్ డే లో భాగంగా గీతం విద్యార్థలు విభిన్న వేషధారణలతో అలరించారు. భయానక ఉత్సవంగా జరిపే ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ డిఫరెంట్ గెటప్స్ వేసి ఉత్సాహంగా ఆడిపాడారు. గీతం బ్యాండ్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గీతం స్టూడెంట్ లైఫ్ సీనియర్ మేనేజర్సమీన్ ఖాన్ హాలోవీన్ డే ప్రోగ్రాంను సమీక్షించారు.
10వేల మందిని వీహెచ్‌పీలో చేర్చేలా ప్రణాళిక
మెదక్ టౌన్, వెలుగు : విశ్వహిందూ పరిషత్‌లో మెదక్ జిల్లా వ్యాప్తంగా సభ్యులుగా పదివేల మందిని చేర్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ఆ సంఘం జిల్లా ప్రెసిడెంట్ పబ్బ సత్యనారాయణ అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హితచింతక్ పాంప్లేంట్ విడుదల చేసి మాట్లాడారు. పదివేల మందిని వీహెచ్‌పీ కార్యకర్తలుగా చేర్చబోతున్న సందర్భంగా నవంబరు 6 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రతి హిందూవు పాల్గొని రూ.20 చెల్లించి వీహెచ్‌పీ సభ్యత్వం స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో విభాగ్ సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం, విభాగ ప్రచార ప్రముఖ్ అప్పాల సునీల్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్కాజి సత్యనారాయణ, జిల్లా కోశాధికారి ముత్యాలు, జిల్లా కార్యదర్శి నీల శ్యామ్, జిల్లా ప్రచార ప్రముఖ్ ఎర్రం ప్రశాంత్, పట్టణ అధ్యక్షుడు అరవింద్, రాహుల్, సిద్ధిరాములు పాల్గొన్నారు.
మోటర్లు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
సిద్దిపేట రూరల్, వెలుగు: వ్యవసాయ పొలాల వద్ద మోటర్లను దొంగలిస్తున్న ముఠాను త్రీటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ భాను ప్రకాశ్తెలిపిన ప్రకారం... మంగళవారం సీఐ తన సిబ్బందితో కలిసి పొన్నాల గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రశాంత్ నగర్ కు చెందిన వల్లపు నవీన్, వడ్డెర కాలనీ టెలికాం నగర్ కు చెందిన శివరాత్రి రాజు వ్యవసాయ మోటర్ ను బైక్ పై తీసుకొని అనుమానాస్పదంగా వెళ్తున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఏడాది నుంచి తాము వ్యవసాయ మోటార్లు, కేబుల్ వైర్లు దొంగలిస్తున్నామని ఒప్పుకున్నారు. వారి నుంచి ఎనిమిది మోటర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో పాటు మరో ముగ్గురు ఉన్నారని, వారు పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు.
ఇంటి పన్నులు తగ్గించాలి
రామాయంపేట, వెలుగు : రామాయంపేట మున్సిపల్ లో ఇంటి పన్నులు తగ్గించాలని మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ కు మంగళవారం బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ అధ్వర్యంలో పార్టీ నాయకులు ఆయనను కలిసి గతంలో కంటే మూడింతలు ఎక్కువగా పన్నులు వేస్తున్నారని తెలిపారు. ఈ విధంగా వేస్తే సామాన్య ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు. పెంచిన పన్నులు వారంలోగా తగ్గించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యత
సిద్దిపేట రూరల్, వెలుగు : సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ హెల్త్ చెకప్ లు చేయించినట్లు అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్.మహేందర్ తెలిపారు. మంగళవారం 325 జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ డాక్టర్లతో ఫ్రీ టెస్టులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు సహకారంతో జిల్లాలోని పోలీస్ అధికారులకు, సిబ్బందికి రెండేండ్లపాటు వారి ఆరోగ్య పరిరక్షణ కోసం పైలట్ ప్రాజెక్టుగా జిల్లాను ఎంపిక చేసి అందరికీ హెల్త్ చెకప్ లు చేయించి ట్రీట్మెంట్ అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీ. శ్రీనివాస్ మాట్లాడుతూ బీపీ షుగర్, హార్ట్ ఎటాక్ గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గౌతం, అడిషనల్ డీసీపీ ఏఆర్ రామచంద్రరావు, ఏసీపీ దేవారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గురుస్వామి, దుబ్బాక సీఐ కృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
జోడో యాత్రను సక్సెస్ చేయాలి
మునిపల్లి, వెలుగు : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను సక్సెస్ చేసేందుకు ప్రతీ కార్యకర్త ముందుండాలని మాజీ డిప్యూటీ దామోదర రాజనర్సింహా పిలుపునిచ్చారు. 3న అందోల్ నియోజకవర్గంలో యాత్ర కొనసాగనున్న నేపథ్యంలో మంగళవారం మండలంలోని బుదేరా చౌరస్తాలో ని ఫంక్షన్ హాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం చేపట్టేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని భరోసానిచ్చారు. రాహుల్ చేపడుతున్న భారత్ జోడో యాత్ర ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ప్రాంతానికి కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామాల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సతీశ్, మాజీ ఎంపీపీలు రాంరెడ్డి, రాజేశ్వర్ రావు, మాజీ జడ్పీటీసీ అసద్ పటేల్, ఎంపీటీసీలు పాండు, విజయ సుధాకర్‌రెడ్డి, సర్పంచులు గౌరమ్మ, కంసమ్మ కృష్ణ, నాయకులు మనోహర్, రహీం. నరేందర్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.