యుద్ధ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ప్రపంచంలోని ఏ దేశానికి మినహాయింపు ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల మధ్య జరిగే ప్రతి యుద్ధం దేనికదే విభిన్నంగా ఉంటుంది. ఐరోపాలో యుద్ధం వల్ల గత 110 సంవత్సరాలలో.. కనీసం 10 కోట్ల మంది మరణించారన్న విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. ఐరోపావాసులు తమది అభివృద్ధి చెందిన దేశమని చెప్పుకుంటారు. అలాంటప్పుడు ప్రతిరోజూ 500 మంది చనిపోతున్న అత్యంత రక్తపాతమైన ఉక్రెయిన్ యుద్ధం ఎందుకు ఇంకా కొనసాగుతోందో ఐరోపా వివరించగలదా? అమెరికా, ఇజ్రాయెల్– ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారతదేశం కూడా ఇరాన్ యుద్ధం నుంచి అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. అన్ని యుద్ధాలు అనూహ్యమైనవి. యుద్ధం వల్ల తలెత్తే ఫలితాలను ముందే కచ్చితంగా అంచనా వేయలేం. ఇరాన్ యుద్ధంలో ఎక్కువ రోజులు ప్రతిఘటించలేక కొద్ది రోజుల్లోనే లొంగిపోతుందని అమెరికా ఊహించింది. కానీ, ఇరాన్ అమెరికాను షాక్‌కి గురిచేసేలా ఒక గొప్ప వ్యూహాన్ని అవలంబించింది. దీనికి వారికి భారీస్థాయిలో వైమానిక దళం, నౌకాదళం లేదా పదాతిదళ సైన్యం అవసరం కాలేదు.
ఇరాన్ అత్యంత విలక్షణమైన రీతిలో పోరాడటానికి డ్రోన్‌లు, క్షిపణులను మాత్రమే ఉపయోగించింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో అగ్రదేశాలకు దీటుగా బదులిస్తున్న ఇరాన్ భవిష్యత్తులో యుద్ధాలు జరిగే విధానాన్ని మార్చివేసింది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఇంకా గెలవలేదు. కానీ, ప్రపంచానికి కొత్త యుద్ధ వ్యూహాలను ఇరాన్ పరిచయం చేసింది. దాయాది దేశం పాకిస్తాన్‌తోపాటు చైనా నుంచి కూడా భారతదేశం ప్రమాదాలను ఎదుర్కొంటోంది. చైనా, పాకిస్తాన్ ఇరుదేశాలు భారతదేశానికి నిరంతర శత్రువులుగా వ్యవహరిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఇరాన్ యుద్ధం భారతదేశానికి కచ్చితంగా అనేక పాఠాలను నేర్పుతుంది.
యుద్ధ విధానంలో మార్పు
డ్రోన్లు, క్షిపణులతోపాటు నూతన పద్ధతులను అనుసరించి అగ్రదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తోంది. ఇరాన్ సంప్రదాయ యుద్ధ శైలి నుంచి వైదొలిగి డ్రోన్లు, క్షిపణులు, సైబర్ యుద్ధంపై దృష్టి సారించడం ఒక పెద్ద మార్పు. ఆధునిక యుగంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీతో ఇప్పుడు యుద్ధ క్షేత్రానికి చాలా దూరంలో ఉండి కూడా కంప్యూటర్లను ఉపయోగించి యుద్ధాన్ని నిర్వహించవచ్చు. ఈ సాంకేతిక పరిణామం వల్ల భారీ సైన్యాలు, వైమానిక దళాల అవసరంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా తన అత్యంత అధునాతన విమాన వాహక నౌకలను ఉపయోగించినా ఫలితం లేకుండాపోయింది. ఇరాన్ యుద్ధంలో అగ్రదేశం నిస్సహాయ ప్రేక్షకుడిగా మిగిలిపోయింది. భారతదేశం విషయానికొస్తే నూతన సాంకేతికతల దిశగా ఒక పెను మార్పు రావాల్సి ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన సిందూర్ యుద్ధంలో కూడా భూతల దళాలను ఉపయోగించలేదు. భారతదేశానికి గొప్ప పారిశ్రామిక, సాంకేతిక పునాది ఉంది. కాబట్టి ‘నూతన యుద్ధ విధానానికి’ మారడం భారతదేశానికి సులభం అవుతుంది.
ఎల్పీజీ, క్రూడ్ ఆయిల్ ప్రత్యామ్నాయంలో వైఫల్యం
ఎల్పీజీ, ముడి చమురు కోసం ప్రత్యామ్నాయ వనరులను ఏర్పాటు చేసుకోవడంలో పలు దేశాలు వైఫల్యం చెందినట్టు ఇరాన్ యుద్ధం స్పష్టం చేస్తోంది. పరిమిత సంఖ్యలో ఉన్న ముడి చమురు, ఎల్పీజీ సరఫరాదారులపై చాలా దేశాలు ఆధారపడటం అనే ఒక కీలకమైన బలహీనతను ఇరాన్ యుద్ధం వెలుగులోకి తెచ్చింది. యుద్ధ ప్రభావం కారణంగా హార్మూజ్ జలసంధి మూసివేయడం జరుగుతుందని మనదేశ పెట్రోలియం లేదా విదేశాంగ మంత్రిత్వ శాఖలు కనీసం ఆలోచించకపోవడం ఒక విచిత్రం. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన 28 ఫిబ్రవరి 2026 వరకు ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకపోవడం దిగ్భ్రాంతికరం.
ప్రపంచంలో ముడి చమురు, ఎల్పీజీ ఉత్పత్తి సామర్థ్యం తగినస్థాయిలో ఉంది. కానీ, గల్ఫ్ దేశాల వెలుపల నుంచి ఎల్పీజీ, చమురు దిగుమతులలో చిన్నపాటి శాతమైనా దిగుమతి చేసుకునేందుకు కూడా భారతదేశం తగిన ప్రణాళిక చేయలేదు. మరోవైపు జల, అణు, సౌర శక్తిని అభివృద్ధి చేయడంలో కూడా భారతదేశం నామమాత్రపు స్థాయిలోనే ఉంది.
దౌత్య ప్రయోజనాలు
యుద్ధాలను నివారించడంలో దౌత్యం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, డిప్లొమసీలో ఇరాన్, దాని శత్రువులు విఫలమయ్యారని ఇరాన్ యుద్ధం స్పష్టం చేసింది. భారతదేశం మరింత పటిష్టంగా దౌత్య బలాన్ని పెంపొందించుకోవాలి.. శత్రుదేశాల ముప్పును ఎదుర్కొనేందుకు అన్నివేళలా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఎల్లప్పుడూ దౌత్యానికే ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలి. గత 80 సంవత్సరాలుగా అమెరికా, ఐరోపా నాటో ద్వారా నియంత్రణలో ఉన్నాయి. కానీ, ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో నాటో అమెరికాకు మద్దతు ఇవ్వలేదు. అదేవిధంగా ఇరాన్, అరబ్ దేశాలు ఇస్లామిక్ దేశాల సంస్థలో మిత్రదేశాలుగా ఉన్నాయి. అయినప్పటికీ అవి ఒకదానిపై ఒకటి భయంకరమైన యుద్ధం చేస్తున్నాయి. అంటే యుద్ధంలో మిత్రదేశాల మధ్య పొత్తులు, ఒప్పందాలు నిరుపయోగంగా మారుతున్నాయి.
విదేశీ వ్యవహారాలలో రాజకీయాలు మానుకోవాలి
యుద్ధాలు, విదేశీ వ్యవహారాలలో మనదేశ రాజకీయ నాయకులు విభేదిస్తూ రాజకీయాలు చేయడం మానుకోవాలి. కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాలలో ప్రతిపక్షాలతోపాటు అన్ని వర్గాలను నిరంతరం కలుపుకొని వెళ్ళాలి. ఇది కేవలం సంక్షోభ సమయాల్లో మాత్రమే కాదు. భారతదేశంలోని ప్రస్తుత ప్రభుత్వం విదేశీ వ్యవహారాలను తమ రాజకీయాలకు ఆయుధంగా మార్చుకోకూడదు. విదేశీ వ్యవహారాలకు సంబంధించి భారతదేశ రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా నిరంతర సంప్రదింపులు కొనసాగించాలి.
చైనాతో నిరంతర ప్రయత్నాలు
వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా దీర్ఘకాలిక వైరుధ్యాలను నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను ఇరాన్ యుద్ధం తెలియజేస్తోంది. చైనాతో భారతదేశ సరిహద్దు ఉద్రిక్తతలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఈ సమస్యను దౌత్యపరంగా, సామరస్య పూర్వకంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. తన దూకుడు మాటలు, చేతలే మధ్యప్రాచ్యంలో అందరినీ తన శత్రువులుగా మార్చాయని ఇరాన్ గ్రహించడంలో విఫలమైంది.
హార్మూజ్ జలసంధి దిగ్బంధం కావడం వల్ల ఈశాన్య రాష్ట్రాల అవసరాలు, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సముద్ర మార్గాలను సురక్షితం చేయడానికి భారతదేశం ముమ్మర ప్రయత్నాలు చేయాలి. ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గాలను సులభతరం చేయడానికి భారతదేశం మయన్మార్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలి. మయన్మార్ ద్వారా ఈశాన్య భారతదేశానికి రైలు, రహదారి మార్గాలను సృష్టించడానికి ప్రయత్నాలు చేయాలి.
భారత్ నూతన ఆవిష్కరణలు చేయాలి
ఇరాన్ యుద్ధం... ఆధునిక యుద్ధం, దౌత్యానికి సంబంధించిన అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఆయా అంశాలు తెలిపే సరికొత్త పాఠాలను భారతదేశం తప్పక స్వీకరించాలి. యుద్ధంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం నుంచి అంతర్జాతీయ సంబంధాలలో రాజకీయ ఐక్యత ప్రాముఖ్యత వరకు భారతదేశం నూతన ఆవిష్కరణలు చేయాలి. ఇరాన్ యుద్ధ సమయంలో భారతదేశానికి అనేక హెచ్చరిక సంకేతాలు అందాయి.
భారతదేశం తన బలహీనతలను సరిదిద్దుకోవడమే కాకుండా, ఎవరు విఫలమయ్యారో కూడా విచారించాలి. హార్మూజ్ జలసంధి మూసివేతను ముందుగా ఊహించలేకపోవడం భారత ప్రభుత్వం చేసిన ఘోరమైన వైఫల్యం. అవసరమైతే డ్రోన్, క్షిపణి, సైబర్ యుద్ధానికి భారతదేశం సిద్ధంగా ఉందా అనే ఆందోళన కూడా ఉంది. సిందూర్ యుద్ధాన్ని రెండు రోజుల్లో ఆపడం ద్వారా భారతదేశం సరైన పని చేసింది. యుద్ధంలోకి దిగడానికి ముందు భారతదేశం సాధ్యమైన ప్రతి మార్గాన్ని ముందుగానే ప్రయత్నించాలి. ఇరాన్ యుద్ధం నుంచి నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం ఇదే. ఇరాన్ యుద్ధం ముగిసినప్పటికీ దశాబ్దాలపాటు శత్రుత్వం, రక్షణపై భారీ వ్యయం మాత్రం కొనసాగుతుంది.
డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
