కొత్త పార్లమెంట్లో సమావేశాలు..ఎంపీలకు స్పెషల్ గిఫ్ట్స్

కొత్త పార్లమెంట్లో సమావేశాలు..ఎంపీలకు స్పెషల్ గిఫ్ట్స్

కొత్త పార్లమెంట్‌ భవనంలో  సమావేశాలకు సర్వం సిద్దం అయింది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు  కొత్త పార్లమెంట్ భవనంలోనే జరగనున్నాయి. ఈ ప్రత్యేక సందర్భానికి గుర్తుగా ఎంపీలకు మోదీ ప్రభుత్వం ప్రత్యేక బహుమతులను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ బహుమతుల బ్యాగులకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

బ్యాగుల్లో ఏమున్నాయంటే..

ఎంపీలకు అందించే ప్రత్యేక బ్యాగుల్లో  రాజ్యాంగం, కొత్త, పాత పార్లమెంట్ భవనాల చిత్రాలతో కూడిన స్టాంపులు, స్మారక నాణెం, కొత్త పార్లమెంట్‌కు సంబంధించిన బుక్‌లెట్‌ ఉంటుందని తెలుస్తోంది. ప్రతి బ్యాగుపై సంబంధిత ఎంపీ పేరు కూడా ముద్రించి ఉంటుందని సమాచారం. ప్రధాని మోదీ కూడా పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్‌కు రాజ్యాంగ ప్రతిని తన వెంట తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ వెంట ఎంపీలు నడవనున్నారు. 

ఐదు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్‌ 18 నుంచి మొదలయ్యాయి.  తొలి రోజు సమావేశాలు పార్లమెంట్ పాత భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు పాత పార్లమెంట్‌లో చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మోడీ 75 ఏళ్ల స్వతంత్ర భారత ప్రయాణ విశిష్టతను వివరించారు.

ALSO READ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

కొత్త పార్లమెంట్ భవనంలో మొదలయ్యే సమావేశాల్లో తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం.  ఈ బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించి చట్టంగా మారితే.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కనుంది.  లోక్‌సభ, రాష్ట్రాల్లోని శాసనసభల్లోని మొత్తం సీట్లలో 33 శాతం లేదా మూడింట ఒక వంతు మహిళలకు కేటాయించాలని ఈ బిల్లు తెలియజేస్తుంది.