విద్యార్థి ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో .. తెలంగాణ ప్రజా పార్టీ ఆవిర్భావం

విద్యార్థి ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో .. తెలంగాణ ప్రజా పార్టీ ఆవిర్భావం

ఓయూ, వెలుగు: రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సోమవారం తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో కంచర్ల బద్రి అధ్యక్షతన ‘తెలంగాణ ప్రజా పార్టీ’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. సోమవారం ఓయూలో వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్లు గాలి వినోద్ కుమార్, ప్రభంజన్ యాదవ్, రాయదాస రాయ్, రామకృష్ణ, డాక్టర్ నలిగంటి శరత్ చమార్, ఎన్.వి.రావు తదితరులు పాల్గొని మాట్లాడారు. 

తెలంగాణలో సమాజానికి సేవ చేయాలనుకునే నాయకులకు రాజకీయ అవకాశాలు రావటం లేదు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు ఏ ఒక్క రాజకీయ పార్టీ పాలనాపరమైన అవకాశాలు కల్పించలేదు. డబ్బున్న వారికే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తున్నారు. డబ్బు రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసి.. గెలిచాక రెట్టింపుగా సంపాదిస్తున్నారు. 

ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం పోయి, రాజరికం తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు లేని రాజకీయాల వైపు.. నూతన నాయకత్వాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది.’’ అని వారు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల నుంచి లోక్​సభ ఎన్నికల వరకు అన్నింటిలో తెలంగాణ ప్రజా పార్టీ నుంచి పోటీ చేద్దామని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న పార్టీలకు భిన్నంగా ప్రజల మద్దతు కోరుదామన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి కార్య కార్యవర్గాన్ని, పార్టీ విధి విధానాలను, కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కంచర్ల బద్రి, కార్యవర్గ సభ్యులుగా పుట్టా రంజిత్,  ఉపేందర్, చీరాల వంశీ తదితరులను  ఎన్నుకున్నారు.