‘డిలీట్ ​ఫర్​ ఆల్​’ ఫీచర్ 

‘డిలీట్ ​ఫర్​ ఆల్​’ ఫీచర్ 
  • ‘డిలిట్ ​ఫర్​ ఆల్​’ ఫీచర్ 
  • సక్సెస్​ఫుల్​గా టెస్ట్​ చేసిన సంస్థ
  • త్వరలోనే ఆండ్రాయిడ్​ ఫోన్లలో అందుబాటులోకి
  • వెల్లడించిన వాట్సాప్​ బీటా ఇన్ఫో
  • ఫేక్​ న్యూస్​కు చెక్​ పెట్టేందుకు కొత్త ఫీచర్


న్యూయార్క్​: వాట్సాప్​ గ్రూపుల్లో ఈ మధ్య ఫేక్​ న్యూస్​, అసభ్యకరమైన కంటెంట్​, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇబ్బడిముబ్బడిగా వచ్చేస్తున్నాయి. వాటి వల్ల జనాలపై దాడులు జరిగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. వాటిన్నింటికీ చెక్​ పెట్టేందుకు వాట్సాప్​ ఓ కొత్త ఫీచర్​ను తీసుకొస్తోంది. పనికిరాని మెసేజ్​లను గ్రూపులోని ఎవరికీ కనిపించకుండా ‘మొత్తానికే’ డిలీట్​ చేసేలా వాట్సాప్​ గ్రూప్​ అడ్మిన్లకు మరో కొత్త పవర్​​ఇవ్వనుంది. ‘డిలీట్​ ఫర్​ ఎవ్రీవన్​/ఆల్​’ ఫీచర్​ను ఇప్పటికే సక్సెస్​ఫుల్​గా టెస్ట్​ చేసింది. దానికి సంబంధించిన స్క్రీన్​ షాట్​తో వాట్సాప్​ అప్​డేట్లు ఇచ్చే వాట్సాప్​ బీటా ఇన్ఫో ట్విట్టర్​లో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘మీరు గ్రూప్​ అడ్మిన్​ అయితే.. భవిష్యత్​లో మెసేజ్​లను ఎవరికీ కనిపించకుండా డిలీట్​ చేసేయొచ్చు. ఆండ్రాయిడ్​ వాట్సాప్​ బీటాలో ఈ కొత్త ఫీచర్​ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. మొత్తానికి ఓ మంచి మార్పు’’ అంటూ ట్వీట్​ చేసింది. అయితే, దీనిపై వాట్సాప్​ నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.  నిజానికి వాట్సాప్​ గ్రూపుల్లో కొందరు వ్యక్తులు చేసే అబ్జెక్షనబుల్​ పోస్టుల వల్ల  గ్రూప్​ అడ్మిన్లు సమస్యలను ఎదుర్కొంటున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఫేక్​ న్యూస్​ ప్రచారం వంటి వాటిలో వారినే నేరస్తులుగా చేసి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బాంబే హైకోర్టు, మద్రాస్​ హైకోర్టు.. వారిని బాధ్యులుగా చేయలేమంటూ నిరుడు ఇచ్చిన తీర్పుల్లో పేర్కొన్నాయి. సభ్యులను యాడ్​ చేయడం, డిలీట్​ చేయడం వంటివి తప్పితే.. గ్రూపుల్లో వచ్చే మెసేజ్​లను డిలీట్​ చేసే పవర్స్​గానీ అడ్మిన్లకు లేవంటూ పేర్కొన్నాయి. అలాంటప్పుడు వారిని నేరస్థులుగా చేసి చూపించడం సరికాదని చెప్పాయి.