తగ్గుముఖం పడుతున్న ప్రైవేటు పెట్టుబడులు

తగ్గుముఖం పడుతున్న ప్రైవేటు పెట్టుబడులు
  • 2023 -‌‌‌‌ 24 లో 15 శాతం డౌన్​

న్యూఢిల్లీ: తయారీరంగానికి ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతున్నాయి. 2022-‌‌‌‌-–23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం 54 శాతం నుంచి 33.8 శాతానికి తగ్గి రూ.35.22 లక్షల కోట్లకు పడిపోయాయి. 2023–-‌‌‌‌24లో ప్రైవేట్ రంగం తాజా పెట్టుబడి ప్రణాళికలు 15.3శాతం తగ్గాయి. విదేశీ పెట్టుబడిదారులు కొత్త ఖర్చులను దాదాపు మూడింట ఒక వంతు తగ్గించారు. దేశంలో కొత్త పెట్టుబడుల  విలువను దాదాపు 5 శాతం కుదించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022-‌‌‌‌–23లో లక్ష కోట్లు వచ్చాయి. ప్రైవేట్ రంగ పెట్టుబడి ప్రణాళికలలో తగ్గుదల తయారీ రంగంలో ఎక్కువగా కనిపించింది. ఇక్కడ ప్రతిపాదిత వ్యయాలు 2022-‌‌‌‌–23లో రూ.19.85 లక్షల కోట్ల నుంచి 2023–-‌‌‌‌24లో రూ.11.9 లక్షల కోట్లకు (40శాతం) పడిపోయాయని ఇన్వెస్ట్​మెంట్​ ట్రాకింగ్ సంస్థ ప్రాజెక్ట్స్ టుడే తెలిపింది. 

 నీటిపారుదల,  మైనింగ్​లో పెట్టుబడుల విలువ వరుసగా 48.7శాతం,  19.25శాతం తగ్గాయి. అయితే కరెంట్​,  ఇన్​ఫ్రా రంగాల్లో వరుసగా 96శాతం,  22శాతం పెరిగాయి.  ప్రైవేట్ రంగంలో, దేశీయ పెట్టుబడిదారుల పెట్టుబడి ప్రణాళికలు 2022-‌‌‌‌–-23లో దాదాపు రూ.20.6 లక్షల కోట్ల నుంచి 11.5శాతం తగ్గాయి. అయితే విదేశీ పెట్టుబడిదారుల ప్రతిపాదిత వ్యయం 31.7శాతం లేదా రూ.1.5 లక్షల కోట్లు తగ్గి 2023-–24లో రూ.3.23 లక్షల కోట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉందని ప్రాజెక్ట్స్​ టుడే వెల్లడించింది.  

మహారాష్ట్ర నంబర్​వన్​

 రాష్ట్ర ప్రభుత్వాలు క్యాపెక్స్​ను పెంచాయి. కొత్త పెట్టుబడి ప్రాజెక్టులపై ఖర్చులను 27శాతం పెంచి దాదాపు రూ.7.69 లక్షల కోట్లకు చేర్చాయి. కేంద్రం తాజా ప్రాజెక్టుల విలువ 8.4శాతం పెరిగి రూ.6.09 లక్షల కోట్లకు ఎగిసింది. ఈసారి మహారాష్ట్ర  దాదాపు రూ.8 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులను రాబట్టుకుంది. గత సంవత్సరం ఏపీ రూ. 1.06 లక్షల కోట్లను ఆకర్షించింది. గుజరాత్ తన పెట్టుబడుల వాటాను దాదాపు 12శాతం పెంచుకొని రెండవ స్థానాన్ని నిలుపుకుంది. అయితే కర్ణాటక ర్యాంక్​ మూడు నుంచి నాలుగోస్థానానికి పడిపోయింది. 

ఒడిశా మూడవ స్థానానికి  ఎగబాకింది.  తమిళనాడు ఎనిమిది నుంచి ఐదో స్థానానికి చేరుకుంది.    గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, రవాణా, హైడల్  సోలార్ పవర్ వంటి కీలక రంగాలలో ప్రకటించిన ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని, లేకుంటే నష్టాలు తప్పవని ప్రాజెక్ట్స్​టుడేకు చెందిన హెగ్డే హెచ్చరించారు.