కృష్ణా నీళ్లను మళ్లించేందుకు కొత్త ప్రాజెక్టులు కడుతం

కృష్ణా నీళ్లను మళ్లించేందుకు కొత్త ప్రాజెక్టులు కడుతం
 • కృష్ణా నీళ్లను మళ్లించేందుకు కొత్త ప్రాజెక్టులు కడుతం
 • పెద్ద మారురు బ్యారేజీతో 70 టీఎంసీలు తరలిస్తం
 • కల్వకుర్తి రిజర్వాయర్లు చేపడ్తాం
 • రాష్ట్రానికి అనాయ్యంపై ప్రధానికి వినతీపత్రం ఇస్తాం
 • రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయం

హైదరాబాద్‌, వెలుగు: ఏపీ ప్రభుత్వం విభజన చట్టాన్ని, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను ఉల్లంఘించి అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, ఏపీ తీరును ఖండిస్తున్నామని రాష్ట్ర కేబినెట్ పేర్కొన్నది. కృష్ణా నదిలో రాష్ట్రానికి హక్కుగా లభించే నీళ్లను మళ్లించేందుకు కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని కేబినెట్ సమావేశంలో మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు అయినా తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కేటాయింపులో కేంద్రం నిర్లక్ష్యం చూపుతోందన్నారు. నీళ్ల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై త్వరలోనే ప్రధానిని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు.  

ఏపీ తీరును ఖండించిన కేబినెట్‌
ఏపీ ప్రభుత్వం అక్రమంగా సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌ స్కీం, ఆర్డీఎస్‌ కుడి కాలువ నిర్మాణాన్ని కేబినెట్‌ వ్యతిరేకించింది. ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను, సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, ఎన్‌జీటీ ఆదేశాలను అతిక్రమించి ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు చేపడుతోందని కేబినెట్‌ అభిప్రాయపడింది. ఏపీ వైఖరిని కేబినెట్‌ తీవ్రంగా ఖండించింది.

రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నయ్‌
రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు అయినా కృష్ణా నీళ్లలో న్యాయంగా రాష్ట్రానికి దక్కాల్సిన వాటాపై కేంద్రం వైఖరి సరిగా లేదని మంత్రివర్గంలో అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి న్యాయమైన నీటి వాటా కోసం ఇంటర్‌స్టేట్‌ వాటర్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్‌ -1956లోని సెక్షన్‌ 3 ప్రకారం ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలన్నారు. సుప్రీంకోర్టులోని కేసును విత్‌డ్రా చేసుకుంటేనే ట్రిబ్యునల్‌ వేస్తామన్న కేంద్ర జలశక్తి శాఖమంత్రి హామీతో పిటిషన్‌ విరమించుకుంటామని సుప్రీం కోర్టుకు విన్నవించామని తెలిపారు. కేసు విత్‌డ్రా చేసుకోవడంతో కేంద్రం సమస్యను పరిష్కరిస్తుందని అనుకున్నామని, కానీ కేంద్రం నిర్లక్ష్యంతో రాష్ట్ర రైతులకు నష్టం కలిగే పరిస్థితి వచ్చిందన్నారు. 

ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ప్రచారం
ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులతో రాష్ట్రంలోని పాలమూరు, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల సాగునీటితో పాటు హైదరాబాద్‌ తాగునీటికి తీవ్ర అన్యాయం జరుగనుందని మంత్రులు తెలిపారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపేలా ప్రజల ముందు, పార్లమెంటులో, కోర్టుల్లో ఎత్తి చూపాలని నిర్ణయించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులతో కృష్ణా బేసిన్‌కు వాటిల్లే  నష్టంపై పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు. 

హైడల్‌ పవర్‌ వాడకం పెంచుదాం  
జల విద్యుత్‌ కేంద్రాలతో పూర్తి సామర్థ్యం మేరకు కరెంట్‌ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రానికి హక్కుగా ఉన్న హైడల్‌ పవర్‌ స్టేషన్‌లను పూర్తి స్థాయిలో వాడుకోవాలని, వేరే ఎత్తిపోతల పథకాలకు కరెంట్‌ ఖర్చును తగ్గించాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా, గోదావరులపై 2,375 మెగావాట్ల హైడల్‌ పవర్‌ స్టేషన్‌లు ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో ఆపరేట్‌ చేయాలని, కాళేశ్వరం, దేవాదుల, ఏఎమ్మార్పీ, ఇతర లిఫ్ట్‌ స్కీంలకు నిరంతరం కరెంట్‌ ఇవ్వాలlని విద్యుత్‌ శాఖను ఆదేశించారు.

‘కృష్ణా’ నీళ్ల మళ్లింపు ఇలా.. 

 • జూరాలకు దిగువన గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య అలంపూర్‌ వద్ద పెద్దమారురు (జోగులాంబ) బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచి పైపులైన్‌ వేసి ఏటా 60 నుంచి 70 టీఎంసీల నీటిని పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్‌ స్కీంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్‌కు ఎత్తిపోసి పాలమూరు, కల్వకుర్తి ఆయకట్టుకు నీళ్లివ్వాలని నిర్ణయించారు.
 • కల్వకుర్తి లిఫ్ట్‌ స్కీంలో రిజర్వాయర్ల కెపాసిటీని 20 టీఎంసీలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
 • సుంకేసుల బరాజ్‌ ఆధారంగా మరో లిఫ్ట్‌ స్కీం చేపట్టి నడిగడ్డ ప్రాంతంలోని మరో లక్ష ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.
 • పులిచింతల ఎడమ కాలువ నిర్మాణం చేపట్టి నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని రెండు లక్షల ఎకరాకు సాగునీరు అందించనున్నారు.
 • కృష్ణా ఉప నది భీమా మన రాష్ట్రంలోకి ప్రవేశించే కుసుమర్తి వద్ద వరద కాలువ నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
 • నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి లిఫ్ట్‌ స్కీంను చేపట్టి సాగర్‌ పరిధిలోని రెండు లక్షల ఎకరాల అప్‌ల్యాండ్‌ భూములకు నీళ్లివ్వాలని నిర్ణయించారు. 
 • ఈ ప్రాజెక్టులకు అవసరమైన సర్వేలు నిర్వహించి డీపీఆర్‌ల తయారీ ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించారు.