ఎర్రకోట దగ్గర కారు పేలుడు ఇలా జరిగింది.. లైవ్ ఫీడ్ దొరికేసింది..

ఎర్రకోట దగ్గర కారు పేలుడు ఇలా జరిగింది.. లైవ్ ఫీడ్ దొరికేసింది..

న్యూఢిల్లీ: ఢిల్లీ కారు పేలుడు కేసులో మరో సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పోలీసులు ఈ వీడియోను విడుదల చేశారు. కొత్త వీడియో క్లిప్‎లో వివిధ కోణాల్లో కారు బ్లాస్ట్ అయిన ఖచ్చితమైన విజువల్స్, టైమ్ రికార్డ్ అయ్యాయి. ఢిల్లీ పోలీసులు షేర్ చేసిన ఈ ఫుటేజ్‌ ప్రకారం.. సోమవారం (నవంబర్ 10) సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1కి సమీపంలో నేతాజీ సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనాల రద్దీ నెలకొంది. వెహికల్స్ స్లోగా మూవ్ అవుతున్నాయి. కొందరు ప్రయాణికులు రోడ్డు దాటుతున్నారు. ఈ సమయంలో సరిగ్గా 6.50 నిమిషాలకు అగ్ని పర్వతం విస్ఫోటనం చెందినట్లుగా ఓ ఐ20 కారులో భారీ పేలుడు సంభవించింది. 

మంటలు వెంటనే పక్కన ఉన్న ఇతర వాహనాలకు వ్యాపించాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఏం జరుగుతోందో అర్ధంకాక ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ విజువల్స్ సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. కొత్త వీడియోలో బ్లాస్ట్ ఎలా జరిగిందనేది వివిధ కోణాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కారు బ్లాస్ట్ తర్వాత పేలుడు తీవ్రతకు సమీపంలోని సీసీ కెమెరాలు ఆగిపోయాయి. బ్లాస్ట్ సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నారని, వెహికల్ స్లోగా మూవ్ అవుతున్నదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. 

పేలుడు ధాటికి 22 కార్లు, 2 ఈ -రిక్షాలు, ఒక ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి. కొన్ని మీటర్ల దూరం వరకు పార్క్ చేసిన వాహనాల అద్దాలూ ధ్వంసం అయ్యాయి. ఇండ్లు, దుకాణాల తలుపులు, కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ప్రమాదం అనంతరం 20  ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశాయి. ఈ పేలుడులో 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు.

 యావత్ దేశాన్ని కలవరపాటుకు గురి చేసిన ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కు కేసు విచారణను అప్పగించింది. మరోవైపు.. ఢిల్లీ, హర్యానా, యూపీ, జమ్మూ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 10 మందిని ఏజెన్సీలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ దాడి వెనక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.