కొత్త రిసార్టులు పుట్టుకొస్తున్నయ్..సమ్మర్ కావడంతో భారీ డిమాండ్

కొత్త రిసార్టులు పుట్టుకొస్తున్నయ్..సమ్మర్ కావడంతో భారీ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: వేసవిలో సేద తీరేందుకు జనం రిసార్టులకు వెళుతుండటంతో వాటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. భారీ డిమాండ్ కారణంగా కొత్త రిసార్టులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే శివారు ప్రాంతాల్లో 60 వరకు రిసార్టులు ఉండగా.. వాటికి విపరీతమైన బుకింగ్స్​ వస్తుండటంతో కొత్తగా మరో 15 పెద్ద రిసార్టులు ఏర్పడ్డాయి. పాత వాటిలా కాకుండా జనాలను మరింత ఆకట్టుకునేలా గేమింగ్ జోన్స్​లో కొత్త ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. పిల్లల కోసం వాటర్ పార్కులను సరికొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. మొయినాబాద్, శామీర్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లోనే ఎక్కువగా రిసార్టులు ఉన్నాయి.

డే అండ్​ నైట్​కు భారీగా వసూలు

సేద తీరేందుకు ఎక్కడికి వెళ్లాలో తెలియక నగర వాసులు రిసార్టుల బాటపడుతున్నారు. ఇది ఓ ట్రెండ్ లా కొనసాగుతోంది. అందులోనూ సమ్మర్ హాలిడేస్ కావడంతో ఫ్యామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేసేందుకు అక్కడికి వెళ్తున్నారు. ఒక్కో రిసార్టు ఒక్కో విధంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు  డే ఔటింగ్ అయితే రూ.1000 నుంచి రూ.1500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. డే అండ్ నైట్ స్టే చేసేందుకు భారీగా వసూలు చేస్తున్నారు. రూ.5 వేల నుంచి రూ.12 వేలకి పైగా తీసుకుంటున్నారు. వీటితో పాటు ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ కొనసాగుతన్నప్పటికీ కరోనా తర్వాత రిసార్టులకు వెళ్తున్నవారి సంఖ్య ఎక్కువైంది.

లోకల్​ పోలీసులను మ్యానేజ్​ చేస్తూ..

శివారు ప్రాంతాల్లో ఏళ్లుగా రిసార్టులు కొనసాగుతున్నాయి. అయితే ముందు కేవలం డే ఔటింగ్ పేరుతో గేమింగ్ జోన్స్ తో పాటు డైనింగ్ హాల్, మీగింట్ హాల్స్ మాత్రమే ఏర్పాటు చేసేవారు. కానీ ట్రెండ్ మారుతున్న కొద్దీ రిసార్టులను స్టార్ హోటల్స్​తరహాలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం శివార్లలో ఉన్నవాటిల్లో ఒక్కో దాంట్లో 500 నుంచి 1500 మంది స్టే చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న సగం రిసార్టులకు అనుమతులు లేవని తెలుస్తోంది. డిమాండ్ ఉండటంతో కనీస అనుమతులు కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తున్నారు. పట్టించుకునేవారు లేకపోవడంతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. లోకల్ పోలీసులను మ్యానేజ్ చేసి మెయింటెన్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.