సింగరేణిలో కొత్త గనులు.. త్వరలో ఆర్కేపీ ఓసీపీ ఫేజ్2 కొత్త కోల్మైన్ప్రారంభం: మంత్రి వివేక్ 

సింగరేణిలో కొత్త గనులు.. త్వరలో ఆర్కేపీ ఓసీపీ ఫేజ్2 కొత్త కోల్మైన్ప్రారంభం: మంత్రి వివేక్ 

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో కొత్త గనులను దక్కించుకుని.. ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. తమ ప్రభుత్వం రాగానే కేంద్రం బొగ్గు గనుల కోసం నిర్వహించే వేలంలో సింగరేణి పాల్గొనేలా సీఎం రేవంత్​రెడ్డిని ఒప్పించినట్టు చెప్పారు. బుధవారం మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం మండలాల్లో, చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో మంత్రి పర్యటించారు. 

క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్, మందమర్రి, చెన్నూరు హిందూ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతుల నిమజ్జనాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. త్వరలో రామకృష్ణాపూర్ ఓపెన్​కాస్ట్​ఫేజ్​-2 కొత్త మైన్​ప్రారంభం కానుందని, మైన్​కు అవసరమైన ఫారెస్టీ క్లియరెన్స్ కోసం తాను, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ  ఫారెస్టు ఉన్నతాధికారులతో చర్చించినట్టు చెప్పారు. ఎన్విరాన్​మెంట్, ఫారెస్ట్​ పర్మిషన్ల పక్రియ కేంద్రంలో తుదిదశలో ఉందని, త్వరలోనే కొత్త గనిని ప్రారంభిస్తామన్నారు. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బొగ్గు బ్లాక్​ల వేలం బిల్లుకు మద్దతు పలికిన బీఆర్ఎస్.. సింగరేణి  వేలంలో పాల్గొనకుండా అడ్డుకుందని ఆరోపించారు. దానివల్ల గత పదేండ్లలో సింగరేణికి ఒక్క కొత్త బొగ్గు గని దక్కలేదన్నారు. సింగరేణి స్థలాల్లో కార్మికులు కట్టుకున్న ఇండ్లకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివేక్ తెలిపారు. జీవో 76పై స్టేను ఎత్తివేయించి ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. బొగ్గు గనులు విస్తరించి ఉన్న మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్​ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేసి.. అర్హత కలిగిన కొత్తవారికి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. 

ఎల్​నినో నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలి..

ఎల్​నినో ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాల మీద ఉందని మంత్రి వివేక్​పేర్కొన్నారు. తక్కువ వర్షాల కారణంగా తెలంగాణలో రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండలేదని.. దీని వల్ల వచ్చే వేసవిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు తప్పవన్నారు. రైతులు వరి వేసుకోకుండా ప్రభుత్వానికి సహకరించాలని, వచ్చే వేసవిలో తాగునీటి అవసరాల దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. 

రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి గ్రామాలు సస్యశ్యామలం కావాలని.. పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా ఆనందంగా ఉండాలని గణనాథున్ని  వేడుకున్నట్టు మంత్రి తెలిపారు. చెన్నూరులో గణపతుల నిమజ్జనాకి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి మంత్రి కొద్దిసేపు కోలాటం ఆడారు. రాత్రి రామకృష్ణాపూర్​ హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపాల నిర్వాహకులకు మంత్రి బహుమతులను అందజేశారు. 

మంత్రి వెంట జైపూర్, బెల్లంపల్లి ఏసీపీలు వెంకటేశ్వర్లు, కిరణ్​కుమార్, సింగరేణి గుర్తింపు సంఘం(ఏఐటీయూసీ) స్టేట్​ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య, డీసీసీ ప్రెసిడెంట్​రఘునాథ్​రెడ్డి, సీనియర్​ కాంగ్రెస్​ నేత చెరకు సరోత్తంరెడ్డి, చెన్నూరు మున్సిపల్​ చైర్​పర్సన్​ పెద్దింటి పద్మ, వైస్​చైర్మన్​ వినయ్, క్యాతనపల్లి, మందమర్రి కాంగ్రెస్​ టౌన్​ ప్రెసిడెంట్లు ఓడ్నాల శ్రీనివాస్​, మంద తిరుమల్, మున్సిపల్​కమిషనర్లు మారుతీ ప్రసాద్, మురళీకృష్ణ, తుంగపిండి రాజలింగు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.