కొత్తరకం ఛాయ్: 47 రకాల టీలు అమ్ముతున్నాడు..!

 కొత్తరకం ఛాయ్: 47 రకాల టీలు అమ్ముతున్నాడు..!

‘మెరిసేదంతా బంగారం కాదు’ అనే మాట వినే ఉంటారు. కానీ,  ఈ టీ మాత్రం నిజంగా బంగారమే. నిజంగా నిజం. అస్సాంకు చెందిన  రంజిత్ బరౌహ్ అనే ఎంట్రప్రెనూర్ ఈ టీని తయారుచేశాడు. ఈ నెల 21న ‘ఇంటర్నేషనల్ టీ డే’ సందర్భంగా ఈ కొత్త రకం టీని చేశాడట.  ఈ స్పెషల్ టీ పేరు ఏంటో తెలుసా.. ‘స్వర్ణపానం’. మనదేశంలో దొరికే 24 క్యారెట్ల బంగారం టీ ఇదే. 
ఈ టీలో అరుదైన అస్సాం బ్లాక్ టీతో పాటు 24 క్యారెట్ల తినే బంగారు ముక్కలు (గోల్డ్​ఫ్లేక్స్) ఉంటాయి. ఈ గోల్డ్​ఫ్లేక్స్​ని ఫ్రాన్స్ నుంచి తెప్పించాడు రంజిత్. టీతో పాటు బంగారాన్ని బాగా ఇష్టపడే వాళ్లకోసం ఈ కొత్తరకం ఛాయ్​ తీసుకొచ్చాడు. ఈ టీ బాక్స్​లో  తెల్లని  జార్ ఉంటుంది. అందులో 100 గ్రాముల గోల్డ్​ఫ్లేక్స్​తోపాటు గ్లాస్ డిఫ్యూజర్, గాజు కప్పు, కంచుతో చేసిన స్పూన్ ఉంటాయి.  
 

బంగారం ఫుడ్ చూసి...
‘‘అస్సాం టీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ టీకి మరింత పేరు తేవాలని అనుకున్నాం. ఒకసారి దుబాయ్​లో బంగారంతో చేసిన  ఫుడ్​కి ధర ఎక్కువ ఉండడం చూశా. అలాంటప్పుడు బంగారంతో టీ ఎందుకు చేయొద్దు? అనిపించింది. అందుకనే ‘స్వర్ణపానం’ టీ తీసుకొచ్చా. బెల్లం, తేనె, కొకోవా రుచిలో  ఉండే ఈ టీ కొత్త అనుభూతినిస్తుంది. టీ లవర్స్​కి ఈ కొత్త రకం టీ బాగా నచ్చుతుంది. ఈ ఛాయ్​ని మార్కెట్లోకి తీసుకురాకముందే 12 ఆర్డర్లు వచ్చాయి. నల్లని జెట్ బాక్స్​లో ఉన్న ఈ టీ ధర 25 వేల రూపాయలు. త్వరలోనే విదేశాలకు ఈ టీని ఎగుమతి చేస్తాం” అంటున్నాడు రంజిత్. 
 

47 రకాల టీలు
టేస్టీగా టీ పెట్టడంలో రంజిత్ ఎక్స్​పర్ట్. దాదాపు ఇరవై ఏండ్లుగా టీ బిజినెస్​లో ఉన్నాడు. ఆ అనుభవంతో కొన్నాళ్లకు ‘అరోమాటిక్​ టీ’ అనే కంపెనీ పెట్టి ఎంట్రప్రెనూర్​గా మారాడు. కొత్తరకం ఛాయ్​లు తయారుచేయడం అంటే రంజిత్​కు చాలా ఇష్టం. ఇప్పుడు 47 రకాల టీలు అమ్ముతున్నాడు. ఈ మధ్యే  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ పేరుతో ఒక టీ తీసుకొచ్చి వార్తల్లోకి ఎక్కాడు రంజిత్. 
అంతేకాదు పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచనతో మొలకెత్తే టీ ప్యాకెట్లు కూడా తెచ్చాడు.