తల్లి కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయిన కవలలు

తల్లి కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయిన కవలలు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన ఇంకా చాలా ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక గర్భిణులు అనేక అవస్థలు పడుతున్నారు.   మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో నెలలు నిండకముందే పుట్టిన కవలలు తల్లి కళ్ల ముందే కన్నుముశారు. ఈ  హృదయ విదారక ఘటన అక్కడున్న వారందరినీ కలచివేసింది. పాల్ఘర్ జిల్లాలోని మోఖడా తహసీల్‌లో నివాసం ఉంటున్న వందనా బుధర్ గర్భం దాల్చిన ఏడు నెలలకే తన ఇంట్లో కవలలకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే పుట్టిన కవలలు బలహీనంగా ఉన్నారు. ఆసుపత్రికి తరలించేందుకు సరైన రోడ్డు మార‍్గం లేకపోవటంతో వారికి సరైన వైద్యం అందలేదు. దీంతో తల్లి కళ్లముందే ఆ శిశువులు కన్నుమూశారు. 

అటు తీవ్ర రక్తస్రావంతో మహిళ ఆరోగ్య  పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు  బెడ్‌షీట్‌తో డోలీ తయారు చేసుకుని బాలింతను సుమారు 3 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన పైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిత్ర కిషోర్ వాఘ్ స్పందిస్తూ  ఈ సంఘటన తనను తీవ్రంగా బాధించిందని ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ల  దృష్టికి తీసుకెళ్తామన్నారు.