పెళ్ళైన 14 రోజులకే నవ వధువు సూసైడ్

V6 Velugu Posted on Jun 10, 2021

  • కళ్యాణలక్ష్మి, అదనపు కట్నం కోసం భర్త వేధింపులు
  • వేధింపులు భరించలేక ఉరేసుకున్నకొత్త పెళ్లి కూతురు
  • రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీదేడులో ఘటన

పెళ్లై నిండా 15 రోజులు కాలేదు. పెళ్లింట్లో ఇంకా ఆ వాతావరణం పోనేలేదు. ఇలోగా ఊహించని దారుణం జరిగింది. ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీదేడు గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. 

ఇబ్రహీంపట్నానికి బినమోని ఐలయ్య, స్వరూప దంపతుల రెండవ కుమార్తె గౌతమి(21)కి.. మంచాల మండలం చీదేడు గ్రామానికి చెందిన పంతం సురేష్‌తో మే 22న వివాహం జరిగింది.  రెండు రోజుల తర్వాత గౌతమిని ఆమె తల్లిదండ్రులు అత్తారింటికి సాగనంపారు. అక్కడికి వెళ్లినప్పటినుంచి గౌతమికి భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. పెళ్లికి సంబంధించిన కల్యాణలక్ష్మి డబ్బులతో అదనపు కట్నం తీసుకురావాలని సురేష్ ఒత్తిడి చేశాడు. అంతేకాకుండా.. ఇంటి నిర్మాణం కోసం మరో రెండు లక్షలు ఇవ్వాలని సురేష్ డిమాండ్ చేస్తున్నట్లు గౌతమి తన తల్లిదండ్రులకు తెలిపింది. దాంతో గౌతమి తల్లిదండ్రులు సురేష్ డిమాండ్లకు ఒప్పుకున్నారు. అయినప్పటికీ సురేష్ వేధింపులు ఆపకపోవడంతో.. గౌతమి బుధవారం రాత్రి అత్తారింట్లోనే చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అదనపు కట్నం కోసం చేసిన వేధింపులతోనే తమ కుమార్తె మరణించిందని గౌతమి తల్లిదండ్రలు.. సురేష్, అతని తల్లిదండ్రులపై మంచాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కూతురిని కోల్పోయిన ఆ తల్లిదండ్రులు.. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

Tagged Extra dowry, Rangareddy district, suicide, KalyanaLakshmi, newly marriage bride, manchala, new bride suicide

Latest Videos

Subscribe Now

More News