రాహుల్​ వీడియోపై వివాదం.. రెండు రాష్ట్రాల పోలీసుల వార్​​

రాహుల్​ వీడియోపై వివాదం..  రెండు రాష్ట్రాల పోలీసుల వార్​​

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ వ్యాఖ్యల వీడియోను..  వాటితో ఏ మాత్రం సంబంధం లేని నేరపూరిత ఘటనకు జోడించి ప్రసారం చేసిన అంశం చిలికిచిలికి గాలివానలా మారుతోంది.  ప్రముఖ నేషనల్​ చానల్​ లో ప్రసారమైన ఈ వార్తా కథనాన్ని చదివిన న్యూస్​ యాంకర్​ రోహిత్​ రంజన్​ ను అరెస్టు చేసేందుకు  ఛత్తీస్​ గఢ్​ పోలీసులు యూపీలోని రంజన్​ ఇంటికి  చేరుకున్నారు.  దీంతో రోహిత్ రంజన్ వెంటనే యూపీ పోలీసులకు ఎస్​ఓఎస్​ పంపారు. దీంతో అక్కడికి చేరుకున్న నోయిడా (ఉత్తరప్రదేశ్​) పోలీసులు..  రోహిత్​ రంజన్​ ను అరెస్టు చేయకుండా ఛత్తీస్​ గఢ్​ పోలీసులను అడ్డుకున్నారు.

ఛత్తీస్​ గఢ్​ పోలీసులు యూపీకి ఎందుకొచ్చారు ? 

పలువురు దుండగుల చేతిలో రాజస్థాన్​ లోని ఉదయ్​ పూర్​లో కన్హయ్య లాల్​ జూన్​ 28న దారుణ హత్య కు గురైన సంగతి తెలిసిందే.  దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ప్రసారం చేసిన ఆ మీడియా సంస్థ..  దానితో ఏ మాత్రం సంబంధం లేని  వీడియో బైట్స్​ (రాహుల్​ గాంధీ వ్యాఖ్యలు)ను  చివర్లో జోడించింది.  ‘‘కొంతమంది పిల్లలు ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. వాళ్లు పిల్లలు.. వాళ్లను క్షమించండి” అని  రాహుల్​ గాంధీ చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. కన్హయ్య లాల్​ ను హత్య చేసిన వారిని ఉద్దేశించి.. రాహుల్​ గాంధీ ఇలా మాట్లాడారు అనేలా  కథనాన్ని ప్రసారం చేశారు.  అదే విధమైన స్క్రిప్ట్​ ను యాంకర్​ ​ రోహిత్​ రంజన్  చదివారు.  దీనిపై దుమారం రేగడంతో కొన్ని గంటల్లోనే సదరు మీడియా సంస్థ ఆ తప్పుడు వార్తను తొలగించి, క్షమాపణలు ప్రకటించింది. మానవ తప్పిదం వల్ల జరిగిన తప్పును అంగీకరిస్తున్నట్లు వెల్లడించింది. అయినా కాంగ్రెస్​ పాలిత ఛత్తీస్​ గఢ్​, రాజస్థాన్​ రాష్ట్రాల్లో పలువురు కాంగ్రెస్​ నేతలు ​రోహిత్​ రంజన్ పై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈక్రమంలోనే ఛత్తీస్​ గఢ్​ పోలీసులు యాంకర్​ ను అరెస్టు చేసేందుకు యూపీలోని ఆయన నివాసానికి వచ్చారు. వాస్తవానికి ‘‘కొంతమంది పిల్లలు ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. వాళ్లు పిల్లలు.. వాళ్లను క్షమించండి” అని రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలు కేరళలోని వయనాడ్​ ఘటనతో ముడిపడినవి.  వయనాడ్​ లోని రాహుల్​ గాంధీ కార్యాలయంపై ఇటీవల ఓ విద్యార్థి సంఘం నాయకులు దాడి చేశారు.  వాళ్లను ఉద్దేశించి రాహుల్ ఆ వ్యాఖ్యలు చేశారు.