మెదక్ సంక్షిప్త వార్తలు

మెదక్ సంక్షిప్త వార్తలు
  • రెండు నెలలైనా కొలిక్కిరాని గణపతి షుగర్స్ లాకౌట్ వివాదం
  • టైంకు క్రషింగ్​స్టార్ట్​ చేయక ‘ట్రైడెంట్’ తో సమస్య
  • ఆందోళనలో రైతులు, కార్మికులు

సంగారెడ్డి : సంగారెడ్డి మండలం పసల్ వాది గణపతి షుగర్స్ ఫ్యాక్టరీ మూతపడటం, జహీరాబాద్ సమీపంలోని కొత్తూర్(బి) వద్ద ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ టైంకు క్రషింగ్ చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గణపతి షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం లాకౌట్ ప్రకటించి రెండు నెలలైనా ఇంకా ఆ వివాదం ఎటూ తేలలేదు. చెరుకు క్రషింగ్ కు సమయం దగ్గర పడుతుండడంతో ఒకపక్క రైతులు.. మరోపక్క కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీలో ప్రతి సీజన్ కు క్రషింగ్ సమస్య తలెత్తుతోంది. రెండేండ్ల కింద ఈ ఫ్యాక్టరీ మూసేయగా గతేడాది చెరుకు సీజన్ టైంలో మేనేజ్​మెంట్​ మారి అనేక ఇబ్బందుల మధ్య క్రషింగ్ స్టార్ట్ చేసింది. అయితే చెరుకు క్రషింగ్ కు రెండు నెలల ముందు నుంచే ఫ్యాక్టరీలోని బాయిలర్స్ క్లీనింగ్, మిషినరీ రిపేర్లు  చేయాల్సి ఉంది. కానీ ట్రైడెంట్ యాజమాన్యం ఇప్పటి వరకు అలాంటి పనులు స్టార్ట్ చేయకపోవడంతో ఐదు రోజుల కింద స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు ఫ్యాక్టరీ అధికారులతో సమీక్షించారు. ఈసారి అక్టోబర్ లోనే క్రషింగ్ మొదలు పెట్టాలని సూచించారు. క్రషింగ్ పై నమ్మకం కలిగితే  జులై, ఆగస్టు నెలల్లో కూలీలకు, ఇతరత్రా అవసరాలకు గాను రైతులు ముందస్తుగా కొంత మొత్తాన్ని అడ్వాన్సులుగా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే కనీసం ఈసారైనా చెరుకు క్రషింగ్ పై గణపతి, ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు దృష్టిపెట్టి రైతులకు సకాలంలో న్యాయం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్, తెలంగాణ మంజీర రైతు సమాఖ్య కోరుతున్నాయి. ఇదిలా ఉండగా ఈసారి ట్రైడెంట్ ఫ్యాక్టరీ జోన్ పరిధిలో 22 వేల ఎకరాలు, గణపతి షుగర్స్ జోన్ పరిధిలో 10 వేల ఎకరాల్లో చెరుకు పంట వేశారు. ట్రైడెంట్ పరిధిలో సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నులు, గణపతి పరిధిలో 3.5 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు వస్తుందని చెరుకు అభివృద్ధి మండలి అంచనాలు వేసింది. ఆయా చెరకు ఫ్యాక్టరీల యాజమాన్యాలు సకాలంలో స్పందించకుంటే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. 
రూలింగ్​ పార్టీ పట్టించుకోలె
గణపతి షుగర్స్ ఫ్యాక్టరీ మూతపడి బుధవారానికి 71 రోజులు గడిచాయి. గణపతి షుగర్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ గా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కొనసాగుతున్నారు. కార్మికుల వేతన ఒప్పందంపై ఆయన పలుమార్లు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చారు. మరోవైపు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం కార్మికులకు మద్దతు పలికి రైతుల పక్షాన కొట్లాడుతున్నారు. కానీ అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు సమస్యను కొలిక్కి తెచ్చేప్రయత్నం మాత్రం చేయడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికైనా సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

లాకౌట్ ఎత్తేయాలే.. 
రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే లాకౌట్ ఎత్తేయాలే. రెండు నెలలుగా ఫ్యాక్టరీ మూతపడడంతో చెరుకు రైతులు ఆందోళన చెందుతున్నరు. ఫ్యాక్టరీలో క్రషింగ్ స్టార్ట్ అవుతుందా లేదా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నరు. ఫ్యాక్టరీ ఇప్పుడు తెరిస్తేనే కూలీలకు అడ్వాన్సులు ఇవ్వడం, ఇతర అవసరాలను రైతులు ఇప్పటినుంచే సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. కార్మికశాఖ జోక్యం చేసుకుని వెంటనే ఫ్యాక్టరీని తెరిపించాలె. - పృథ్వీరాజ్, మంజీర రైతు సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు

‘తొలి మెట్టు’తో స్టూడెంట్లకు మేలు
పాపన్న పేట, వెలుగు : తొలి మెట్టు కార్యక్రమంతో విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాలు సాధించవచ్చని డీఈవో రమేశ్​అన్నారు. బుధవారం కొత్తపల్లిలో జరుగుతున్న తొలి మెట్టు శిక్షణా కార్యక్రమాన్ని ఆయన పరిశీ లించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో రెండేండ్లు విద్యార్థులు చదువులు కోల్పోయారన్నారు. దీంతో కనీస సామర్థ్యాలు సాధించలేకపోయారని, వాటిని సాధించడానికి తొలి మెట్టు శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. టీచర్లు ఈ శిక్షణా కార్య్రమాన్ని సద్వినియోగం చేసుకొని, విద్యార్థులకు మేలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో నీలకంఠం, కాంప్లెక్స్ హెచ్ఎం ప్రతాప్ రెడ్డి ఉన్నారు.
 

13వ జాతీయ లోక్​ అదాలత్​ 
కంది : ఎక్కువ కేసులు లోక్​ అదాలత్​లోనే పరిష్కారమయ్యేలా చూడాలని పోలీస్​ ఆఫీసర్లకు జిల్లా జడ్జీలు సూచించారు. ఈనెల 13న నిర్వహించే జాతీయ లోకాదాలత్​లో వీలైనన్నీ కేసులను పరిష్కరించాలన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలోని సమావేశ మందిరంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆశాలత ఆధ్వర్యంలో ఆఫీసర్లతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న క్రిమినల్ కాంపౌండ్ కేసులు, 138 ఎన్ ఐ కేసులు, ఎక్సైజ్ కేసులు ఎక్కువగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అబ్దుల్ జలీల్, ఎక్సైజ్ కోర్టు జడ్జి హనుమంతరావు, స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి నిర్మల, పోలీస్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురికి గాయాలు 

రామచంద్రాపురం :  గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. సీఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపిన ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ రోడ్డు నంబర్ 17లో నివసిస్తున్న సుబ్రహ్మణ్యం స్థానికంగా మొబైల్ షాప్ నడిపిస్తున్నాడు. కాగా తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో మంగళవారం రాత్రి సిలిండర్ ఆపేయడం మర్చిపోయి పడుకున్నారు. పొద్దున నిద్రలేచిన సుబ్రహ్మణ్యం భార్య ప్రశాంతి పాలు వేడి చేసేందుకు స్టవ్ వెలిగించింది. అప్పటికే గది నిండా గ్యాస్ వ్యాపించి ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం, ప్రశాంతితోపాటు కూతురు దివ్యశ్రీ, కొడుకు శమరిహరన్, ప్రశాంతి తండ్రి సాంబశివరావుకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు వెంటనే ప్రయివేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అనంతరం హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఫాయిదా లేని మీటింగ్ ఎందుకు?
మండల సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీల ఆగ్రహం

మెదక్ :  ఫాయిదా లేని మీటింగ్ కు పనులు వదులుకుని ఎందుకు రావాలని ఎంపీటీసీలు, సర్పంచులు ఎంపీడీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌడిపల్లి మండల పరిషత్​జనరల్​బాడీ మీటింగ్​ఎంపీపీ రాజు నాయక్ అధ్యక్షతన బుధవారం జరిగింది.  అన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో,  ప్రతి మీటింగ్ ఇలాగే నామ్​కేవాస్తేగా నిర్వహించడంపై సభ్యులు మండిపడ్డారు. అధికారులు రాకుంటే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. గ్రామాల్లో కరెంట్​ సరఫరాకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయని, రైతులే పొలాల వద్ద సొంతగా రిపేర్లు చేసుకుంటున్నారని తిమ్మాపూర్, నాగసాన్పల్లి సర్పంచులు, పద్మ కిష్టయ్య,  ఎల్లం తెలిపారు. ట్రాన్స్​కో ఏఈ ఎప్పుడు మీటింగ్​కు రావడం లేదని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఫలితం ఉండటం లేదన్నారు. అతడిపై కలెక్టర్​కు ఫిర్యాదు చేయాలని డిమాండ్​ చేశారు. సమావేశంలో జడ్పీటీసీ కవిత పాల్గొన్నారు.

ఆర్బాటాల కోసమే ‘గౌరవెల్లి’ ట్రయల్​ రన్​
కోహెడ : గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా వచ్చే ఎన్నిక కోహెడ(హుస్నాబాద్​), వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా వచ్చే ఎన్నికల్లో ప్రచార ఆర్బాటాల కోసమే ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ప్రాజెక్టు ​ట్రయల్ రన్​ చేశారని సీపీఐ రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, జిల్లా కార్యదర్శి మంద పవన్​ ఆరోపించారు. బుధవారం అక్కన్నపేటలో సీపీఐ మండల మహాసభలో వారు మాట్లాడారు. రైతులు, నిర్వాసితుల పట్ల ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే సిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. ధరణి పోర్టల్​తో పేద, మధ్య తరగతి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గడిపె మల్లేశ్, భాస్కర్​నాయక్, సత్యనారయణ పాల్గొన్నారు. ల్లో ప్రచార ఆర్బాటాల కోసమే ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ ప్రాజెక్టు ​ట్రయల్ రన్​ చేశారని సీపీఐ రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, జిల్లా కార్యదర్శి మంద పవన్​ ఆరోపించారు. బుధవారం అక్కన్నపేటలో సీపీఐ మండల మహాసభలో వారు మాట్లాడారు. రైతులు, నిర్వాసితుల పట్ల ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే సిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. ధరణి పోర్టల్​తో పేద, మధ్య తరగతి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గడిపె మల్లేశ్, భాస్కర్​నాయక్, సత్యనారయణ పాల్గొన్నారు.

యాసంగి ధాన్యాన్ని ఎఫ్​సీఐకి త్వరగా పంపాలి
మెదక్ : జిల్లా వ్యాప్తంగా యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని  త్వరగా ఎఫ్​సీఐ గిడ్డంగులకు పంపించాలని మెదక్​అడిషనల్ కలెక్టర్​ రమేశ్​అన్నారు. బుధవారం ఆయన నర్సాపూర్​మండలంలోని రెడ్డిపల్లిలో శ్రీవెంకటేశ్వర రైస్​ మిల్లును పరిశీలించారు. జిల్లాలోని అన్ని రైస్​మిల్లల నుంచి రోజూ ఒక లారీ చొప్పున ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్​వో  శ్రీనివాస్​, డీఎమ్​గోపాల్, నర్సాపూర్​ ఆర్డీవో వెంకట ఉపేందర్​రెడ్డి  ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మెదక్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మెదక్​ జిల్లా మాసాయిపేట మండలం రామాంతపూర్​ వద్ద నేషనల్​ హైవే మీద బుధవారం జరిగింది. రామాంతపూర్​ వద్ద రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అతడు అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రకాశ్​గౌడ్ తెలిపారు.

ఎన్ఈపీ బిల్లును రద్దు చేయాలి
ఎన్ఈపీ బిల్లును పార్లమెంట్ ఆమోదం పొందకుండా రద్దు చేయాలని  విద్యా పరిరక్షణ కమిటీ మెదక్, సిద్దిపేట జిల్లాల నాయకులు ఆయా కలెక్టరేట్లలో అడిషనల్​ కలెక్గర్లకు వినతి ప్రతాలు అందజేశారు. సిద్దిపేటలో కమిటీ జిల్లా అధ్యక్షుడు పొనమల్ల రాములు  మాట్లాడుతూ జాతీయ ఉద్యమ ఆకాంక్షలకు, రాజ్యాంగానికి, ఫెడరల్ సూత్రాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020ని ప్రజలందరూ తిరస్కరించారని పిలుపునిచ్చారు.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

అల్లీపూర్ సొసైటీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి  
సిద్దిపేట : చిన్నకోడూర్ మండలంలోని  అల్లిపూర్ సొసైటీ లో అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సిద్దిపేటలో ప్రెస్​మీట్​ ఏర్పాటు చేసి మాట్లాడారు. అల్లీపూర్ సొసైటీలో వడ్ల కొనుగోళ్లు, మందు బస్తాల అమ్మకాలలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు.  రైతులకు రుణాలు మంజూరులో కమీషన్లు తీసుకొని, వారికి నచ్చినవారికే  రుణాలు ఇచ్చారన్నారు. అల్లీపూర్ సొసైటీ అక్రమాలపై మరోసారి కలెక్టర్ కు, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్  నేతలు  మీసం మహేందర్,  సందబోయిన పర్శరాం, ఉడుత ప్రశాంత్, ఉడుత అజయ్ పాల్గొన్నారు. 
కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలి 

రామచంద్రాపురం : పటాన్​చెరు ఇండస్ట్రీయల్​ ఏరియాలో చాలా మంది నిరుపేద కార్మికులు ఉన్నారని, వారికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దని మంత్రులు హరీశ్​రావు, మల్లారెడ్డి డాక్టర్లకు సూచించారు. రామచంద్రాపురం ఈఎస్​ఐలో చేపట్టిన ఆధునీకరణ పనులను బుధవారం ఆస్పత్రి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఆర్సీపురం ఈఎస్ఐని  రూ. 20 కోట్ల 70 లక్షలతో ఆధునీకరించామని, ఇకపై కార్మికులకు అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే దొరుకుతాయని తెలిపారు. త్వరలో పటాన్​చెరులో రూ. 200 కోట్లతో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్​ను నిర్మించబోతున్నట్లు చెప్పారు. అనంతరం అక్కడి స్టాఫ్​తో మంత్రి హరీశ్​ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈఎస్​ఐలో డాక్టర్లు లేకపోవడంపై అసహనం  వ్యక్తం చేశారు. ఈఎస్ఐకి వచ్చే ప్రతి కార్మికుడికీ వైద్య సేవలు అందించాలని, ఎవైనా కంప్లైంట్స్ వస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. త్వరలోనే పటాన్​చెరులో 30 పడకల ఈఎస్ఐ హాస్పిటల్, డిస్పెన్సరీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి, నారాయణ్ ఖేడ్​ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మాజీ ప్రోటెం స్పీకర్ వి. భూపాల్ రెడ్డి, కలెక్టర్ శరత్, టీఆర్​ఎస్​కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, కార్యదర్శి యాదగిరి యాదవ్, కార్పొరేటర్లు సింధూ ఆదర్శ్​ రెడ్డి, కుమార్​ యాదవ్​, పుష్పనాగేశ్​ పాల్గొన్నారు. 

డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల ప్రారంభం.. 
గజ్వేల్ : గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామంలో డబుల్ ​బెడ్ ​రూమ్ ఇండ్ల ప్రారంభంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు  కట్టివ్వడంలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.60 వేలు ఇస్తే అవి బేస్మెంట్ కట్టేందుకు కూడా సరిపోయేవి కావని విమర్శించారు.  నాగిరెడ్డిపల్లి గ్రామాభివృద్ధి కోసం రూ.8.30 కోట్ల పనులు చేశామని తెలిపారు. 

భూసమస్యలన్నీ పరిష్కరిస్తాం.. 
ధరణి పోర్టల్​లో రైతుల భూ సమ్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ములుగు గ్రామంలో ఇటీవల నిర్వహించిన భూ సమస్యల పైలట్ ​ప్రోగ్రాంలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి బుధవారం రైతులకు సర్టిఫికెట్​లు అందజేశారు. 118  దరఖాస్తులలో 101 ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేసినట్లు మంత్రి తెలిపారు. ఇందుకు కృషి చేసిన అధికారులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్​డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్​రెడ్డి, ములుగు సర్పంచ్ అంజిరెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్ రెడ్డి  పాల్గొన్నారు.

గేదెను ఢీకొని ఆగిన రైలు 
మెదక్ : నిజామాబాద్ నుంచి కాచిగూడ వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలు మెదక్​ జిల్లా చిన్న శంకరం పేట మండలం సంకాపూర్ వద్ద ఓ గేదెను బుధవారం ఢీకొట్టింది. రైలు ఇంజన్ కింద అది ఇరుక్కుపోవడంతో 45 నిమిషాలు రైలును అక్కడే ఆపాల్సి వచ్చింది. 

అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య
కోహెడ : అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్​ గ్రామంలో జరిగింది. ఎస్సై వివేక్​ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన అకునూరి అశోక్​(45) కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆరు నెలల కింద అతడి కొడుకు రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో  ట్రీట్​మెంట్​ కోసం రూ.4 లక్షలు అప్పులు చేశాడు. అశోక్​కు కూడా కొద్ది రోజుల నుంచి ఆరోగ్యం బాగుండటం లేదు. ఈ క్రమంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంతో బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
పాపన్నపేట : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా​పాపన్నపేట మండలం ఏడుపాయలలోని వనదుర్గ ప్రాజెక్ట్​ వద్ద బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం..  మెదక్​ మండలం కొంటూరు గ్రామానికి చెందిన మురాడి శ్రీనివాస్​ (40) చేపలు పట్టడం కోసం ఏడుపాయలకు వచ్చాడు. వనదుర్గా ప్రాజెక్టు వద్ద నదిలోకి వల వేస్తున్న క్రమంలో అతడు కూడా నీటిలో పడిపోయాడు. దీంతో అతడికి ఈత వచ్చినా వలలో చిక్కుకుపోవడంతో మునిగిపోయాడు. అనంతరం డెడ్​బాడీ ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.  మృతుడికి భార్య భూలక్ష్మి, కూతురు అనూష ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విజయ్​ నారాయణ్​ తెలిపారు.

ప్రభుత్వ స్కూళ్లలో సమస్యలు పరిష్కరించాలి
ఎంఈవో ఆఫీస్​ను ముట్టడించిన పీడీఎస్ యూ నాయకులు 
సిద్దిపేట రూరల్ : ప్రభుత్వ స్కూళ్లలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు విద్యనాథ్ డిమాండ్​ చేశారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా స్టూడెంట్స్ కు పాఠ్య పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు ఇవ్వలేదని తెలిపారు.  విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బుధవారం సిద్దిపేట ఏంఈవో ఆఫీస్ ను పీడీఎస్ యూ లీడర్లు ముట్టడించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి మహేశ్​తో కలసి ఆయన మాట్లాడారు. సిద్దిపేటలో విచ్చలవిడిగా విద్య వ్యాపారం జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం పట్టణ అధ్యక్షుడు సందీప్, ఉపాధ్యక్షుడు ప్రణయ్, ఇంజనీరింగ్ కమిటీ విద్యార్థి నాయకులు సాయి కార్తీక్, వంశీ పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన ఉండాలి
సిద్దిపేట రూరల్ : ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన ఉండాలని సిద్దిపేట సీపీ ఎన్. శ్వేత అన్నారు. బుధవారం రాజగోపాల్ పేట పాలిటెక్నిక్ కాలేజీ స్టూడెంట్స్ కు ఆమె మహిళల రక్షణ చట్టాలు, ర్యాగింగ్, ఈవ్​టీజింగ్, పోక్సో,  షీ టీమ్స్, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ పై అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టపడి చదవాల్సిన వయస్సులో చెడు అలవాట్లకు బానిసలు కావద్దన్నారు. శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని సూచించారు. షీటీమ్ కంప్లైంట్ క్యూఆర్ కోడ్ గురించి తెలియజేస్తూ ఆన్​లైన్ ద్వారా ఎక్కడి నుంచి అయిన ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్​100, షిటీమ్  వాట్సప్ నంబర్ 7901640473 ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్​పెక్టర్​ సైదా, రూరల్ సీఐ జానకీరామ్ రెడ్డి, పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్  సూర్యనారాయణ, రాజగోపాలపేట ఎస్సై మహిపాల్ రెడ్డి  పాల్గొన్నారు.