
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపిక కాక పుట్టిస్తున్నది. టికెట్ఎవరికి దక్కుతుంది, ఎవరెవరిని పక్కన పెడ్తారనే ఉత్కంఠ మూడు పార్టీల్లోనూ నెలకొంది. అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే 119 మంది అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. వచ్చే వారమే ఫస్ట్లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో టికెట్ దక్కుతుందో, లేదోనని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్నెలకొంది. మొత్తంగా 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక కాంగ్రెస్‌లో ఉదయ్పూర్డిక్లరేషన్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 34 టికెట్లు ఇవ్వాల్సి ఉంది. అదే జరిగితే జనరల్ సీట్లలో టికెట్ఆశిస్తున్న మిగతా నేతలు ఏం చేస్తారోనని ఆ పార్టీ ఆందోళనలో ఉన్నది. మరోవైపు లోక్ సభకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఆ పార్టీ హైకమాండ్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ షురూ చేసింది.
కాంగ్రెస్‌కు టికెట్ల ఈక్వేషన్స్ తలనొప్పులు తెచ్చి పెట్టేలా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తుండగా.. బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లంటూ ఏమీ లేకపోవడంతో జనరల్ కేటగిరీలోనే పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున బీసీలకు సీట్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ తేల్చి చెప్పడంతో.. 34 మందికి టికెట్లు కేటాయించేందుకు పార్టీ కసరత్తు చేస్తున్నది. గతంలో కేవలం 25 మంది బీసీలకే టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ సంఖ్యను 34కు పెంచడంతో కొత్త ట్రెండ్‌కు తెరదీశారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే, చాలా స్థానాల్లో పార్టీకి బలమైన బీసీ లీడర్లు లేరని పలువురు నేతలు అంటున్నారు. అలాంటి స్థానాల్లో బలమైన ఇతర వర్గాల అభ్యర్థులను కాదని, వేరే వారికి టికెట్లిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.
మిగతా నేతలు అడ్జస్ట్ అవుతారా?
రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 31 స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్అయ్యాయి. అందులో 19 ఎస్సీలకు, 12 ఎస్టీలకు కేటాయించారు. రాహుల్ చెప్పినట్టు బీసీలకు 34 స్థానాలు ఇస్తే మిగిలేది 54 సీట్లు. అందులో హైదరాబాద్‌లోని 8 స్థానాల్లో ఎంఐఎం బలంగా ఉంది. ఆ సీట్లలో కాంగ్రెస్‌సహా ఇతర పార్టీలు గెలవడం అసాధ్యమని పార్టీ నేతలు అంటున్నారు. అవి పోను ఉండేవి 46 సీట్లు. ఆ కొన్ని సీట్లలోనే ఇతర వర్గాల నేతలు అడ్జస్ట్అవుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల బీసీలకు సీట్లిస్తే తమకు నష్టం జరుగుతుందన్న భావనలో పార్టీలోని కొందరు సీనియర్‌నేతలు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. అంగబలం, అర్థబలం లేని నాయకులకు సీట్లిస్తే.. పార్టీ నష్టపోతుందని ఓ సీనియర్ నేత పార్టీ పెద్దల దగ్గర వాపోయినట్టు సమాచారం. ఈ క్రమంలోనే తమ సీట్లు పోతాయనుకుంటున్న నేతలు.. సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించాలంటూ పెద్దల ముందు తమ డిమాండ్‌ను వినిపిస్తున్నట్టు తెలిసింది.
టికెట్లు ఇయ్యాల్సిందేనంటున్న బీసీ నేతలు..
కాంగ్రెస్‌లో బీసీ వాదన ఇటీవలి కాలంలో బలంగా వినిపిస్తున్నది. పార్టీలోని ఆ సామాజికవర్గం నేతలు తమకు సగం స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బలమైన అభ్యర్థులు లేరనే కారణంతో టికెట్ నిరాకరించరాదని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ నేత తేల్చి చెప్పారు. బీసీలకు వీలైనన్ని ఎక్కువ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అర్థబలం, అంగబలం లేకుంటే పార్టీ పెద్దలే అండగా నిలవాలని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో కేవలం ఒకే ఒక్క జనరల్స్థానం ఉంది. అక్కడ రాహుల్ చెప్పినట్టు రెండో సీటు ఇవ్వడం కష్టం కాబట్టి.. వేరే ఏదైనా నియోజకవర్గ పరిధిలో ఇవ్వాలన్న డిమాండ్ కూడా బీసీల నేతల నుంచి వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే శనివారం బీసీ సీనియర్ నేతలు గాంధీభవన్‌లో సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. బీసీలకు ఎక్కువ సీట్లు సాధించేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలని ఆ నేతలు డిసైడ్ అయినట్టు సమాచారం. మరోవైపు జనరల్ సీట్లలో ఎస్సీ, ఎస్టీలకూ చాన్స్ఇవ్వాలన్న డిమాండ్వ్యక్తమవుతుండడంతో పార్టీ పెద్దలు టికెట్ల కేటాయింపుపై మల్లగుల్లాలు పడుతున్నారు.
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ లీడర్లకు టికెట్లు..
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని సర్వేల్లో తేలిన 29 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మారుస్తారని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఆయా స్థానాల్లో క్యాండిడేట్లను కూడా ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలిసింది. వీరిలో ఒకరిద్దరు ఎంపీలు, కొందరు ఎమ్మెల్సీలు, మరికొందరు ఇతర పార్టీల నేతలతో పాటు పార్టీలోని ఆశావహులు ఉన్నట్టు సమాచారం. జనగామలో ముత్తిరెడ్డిని తప్పించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చాన్స్ ఇస్తారని, స్వయంగా కేసీఆరే ఆయనను జనగామకు వెళ్లి పని చేసుకోవాలని సూచించారని ప్రచారం జరుగుతోంది. ఇక స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజయ్యకు బదులుగా కడియం శ్రీహరికి చాన్స్ ఇవ్వొచ్చని తెలిసింది. ఇప్పటికే 25 మంది అభ్యర్థులకు పోటీపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన 12 మందికి టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. కొత్తగూడెంలో వనమాపై ఉన్న డైలమా సైతం తొలగిపోయిందని, ఆయనే ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, 29 మంది సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వరని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో తమ పరిస్థితి ఏంటని పలువురు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.
హుస్నాబాద్‌లో మొదటి సభ
బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ వచ్చే వారంలో ప్రకటించే చాన్స్ ఉంది. కేసీఆర్తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో జాబితా విడుదల చేస్తారని సమాచారం. శుక్రవారమే ఈ జాబితా ప్రకటించే అవకాశం ఉందని తొలుత చెప్పినప్పటికీ, వచ్చే సోమవారం లేదా మరో రోజు ప్రకటిస్తారని తెలిసింది. ఫస్ట్ లిస్టులో దుబ్బాక, కంటోన్మెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 60 మందికి పైగానే తొలి జాబితాలో ఉంటారని, కేసీఆర్ లక్కీ నంబర్ ‘ఆరు’ అంకె వచ్చేలా అభ్యర్థుల సంఖ్య ఉంటుందని సమాచారం. క్యాండిడేట్లను ప్రకటించినంక వారంలోపే కేసీఆర్ఎన్నికల శంఖం పూరిస్తారని, గత ఎన్నికల సెంటిమెంట్‌ను అనుసరించి మొదటి ప్రచార సభ హుస్నాబాద్ నియోజకవర్గంలోనే సెప్టెంబర్ మొదటి వారంలోనే ఉంటుందని తెలిసింది.
30 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్..
తెలంగాణతో పాటే చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఆ రెండు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఫస్ట్ లిస్టును బీజేపీ హైకమాండ్గురువారం విడుదల చేసింది. దీంతో తెలంగాణ బీజేపీలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణమైనా రాష్ట్రానికి చెందిన మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. వారితో పాటు మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో సొంత పార్టీ లీడర్ల నుంచి పెద్దగా పోటీ లేదని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గాలతోనే మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కనీసం 20 నుంచి 30 మందితో కూడిన ఫస్ట్ లిస్టును హైకమాండ్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
సర్వేల ఆధారంగా టికెట్లు
బీజేపీ మొదటి జాబితాలో ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వంటి ప్రముఖుల పేర్లు ఉండనున్నాయి. వీరితో పాటు టికెట్ కోసం పోటీ లేదని భావించే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు కూడా ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీజేపీ హైకమాండ్‌తోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంతంగా తమ టీమ్‌లతో సర్వే చేయించారు. ఆ నివేదికలతో పాటు పార్టీ రాష్ట్ర శాఖ తరఫున సమర్పించిన జాబితాను పోల్చుకుని క్యాండిడేట్లను ఫైనల్ చేయనున్నట్టు తెలిసింది. మిగతా నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల ఎంపికపై పార్టీ హైకమాండ్ భారీ కసరత్తే చేస్తున్నది. ఈ ప్రక్రియ మొత్తం ఢిల్లీ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఎవరికి చాన్స్ వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.