సంగమేశ్వరంపై తేల్చిచెప్పిన ఎన్‌‌‌‌‌‌‌‌జీటీ బెంచ్‌‌‌‌‌‌‌‌

సంగమేశ్వరంపై తేల్చిచెప్పిన ఎన్‌‌‌‌‌‌‌‌జీటీ బెంచ్‌‌‌‌‌‌‌‌
  • పర్యావరణ అనుమతులు లేకుండా సంగమేశ్వరం పనులు చేయొద్దు
  • ఏపీకి తేల్చిచెప్పిన ఎన్‌‌‌‌‌‌‌‌జీటీ చెన్నై బెంచ్‌‌‌‌‌‌‌‌


హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇచ్చే వరకు సంగమేశ్వరం(రాయలసీమ లిఫ్ట్​స్కీం)వద్ద ఎలాంటి పనులు చేయొద్దని ఏపీకి ఎన్‌‌‌‌‌‌‌‌జీటీ చెన్నై బెంచ్‌‌‌‌‌‌‌‌ తేల్చిచెప్పింది. డీపీఆర్‌‌‌‌‌‌‌‌ తయారీ కోసమూ పనులు చేయడానికి అవకాశమే లేదంది. ఇప్పటి వరకు చేపట్టిన పనులు, వాటితో పర్యావరణానికి కలిగిన నష్టం, ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చు, ఇతర సాంకేతిక అంశాలను స్టడీ చేయడానికి నలుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. గ్రీన్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలను అతిక్రమించి ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పనులు చేస్తోందని నారాయణపేట జిల్లాకు చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌పై ఎన్‌‌‌‌‌‌‌‌జీటీ చెన్నై బెంచ్‌‌‌‌‌‌‌‌ జ్యుడీషియల్‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె. రామకృష్ణన్‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌ సత్యగోపాల్‌‌‌‌‌‌‌‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. జియాలజికల్‌‌‌‌‌‌‌‌ సర్వే ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా, సీడబ్ల్యూసీ, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖలకు చెందిన నలుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ స్టడీ చేసి నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని ​ఆదేశించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదికలో ఏపీ ఉల్లంఘనలకు పాల్పడితే అందుకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ కేసు విచారణ సమయంలో ఉల్లంఘనలు నిజమని తేలితే ఏపీ సీఎస్‌‌‌‌‌‌‌‌ను జైలుకు పంపుతామని హెచ్చరించిన ఎన్‌‌‌‌‌‌‌‌జీటీ, ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పష్టతనిచ్చింది. ఏపీ సీఎస్‌‌‌‌‌‌‌‌పై కోర్టు ధిక్కరణ చర్యలు అవసరం లేదని తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ చెప్తున్న విషయాలన్నీ అబద్ధమేనని గతంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. డీపీఆర్‌‌‌‌‌‌‌‌ కోసం ఇంత స్థాయిలో పనులు చేయాల్సిన అవసరం లేదని ఎన్‌‌‌‌‌‌‌‌జీటీ అభిప్రాయపడింది. అన్ని అనుమతులు వచ్చే వరకు ప్రతిపాదిత స్థలంలో ఎలాంటి పనులు చేపట్టడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.