సీఎస్​ను మేమే జైలుకు పంపొచ్చా..

సీఎస్​ను మేమే జైలుకు పంపొచ్చా..
  • ఆంధ్రా సర్కార్​ది తప్పే
  • సంగమేశ్వరం పనులపై ఎన్జీటీ ఫైర్​ 
  • ఫొటోలు చూస్తుంటే ప్రాజెక్టు పనులు చాలా వరకు పూర్తయినట్లు కనిపిస్తోంది
  • ఏపీ సీఎస్​ను మేమే జైలుకు పంపొచ్చా.. హైకోర్టు ద్వారానే పంపాలా..?
  • దీనిపై పిటిషనర్ల తరఫు అడ్వకేట్లు సలహా ఇవ్వాలి

హైదరాబాద్‌‌, వెలుగు: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్​ స్కీం విషయంలో ఏపీ ప్రభుత్వం తమ ఆదేశాలను ధిక్కరించిందని నేషనల్ గ్రీన్​ ట్రిబ్యునల్​ (ఎన్జీటీ) చెన్నై బెంచ్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణా బోర్డు ఎక్స్​పర్ట్​ టీం నివేదికలోని ఫొటోలు చూస్తుంటే ఈ విషయం తెలుస్తోందని పేర్కొంది. ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఏపీ సీఎస్​, అధికారులను తాము నేరుగా జైలుకు పంపొచ్చా.. హైకోర్టు ద్వారా పంపాలా.. అనే విషయంలో సలహా ఇవ్వాలని పిటిషనర్ల తరఫు అడ్వకేట్లకు సూచించింది. ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్‌‌ తీర్పును అతిక్రమించి సంగమేశ్వరం లిఫ్ట్‌‌ స్కీం పనులు చేస్తోందని నారాయణపేట జిల్లాకు చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్‌‌ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌‌ను ఎన్జీటీ చెన్నై బెంచ్‌‌ జ్యుడిషియల్‌‌ మెంబర్‌‌ జస్టిస్‌‌ కె.రామకృష్ణన్‌‌, ఎక్స్‌‌పర్ట్‌‌ మెంబర్‌‌ సత్యగోపాల్‌‌ సోమవారం విచారించారు. 

గవినోళ్ల శ్రీనివాస్​ తరఫున అడ్వకేట్‌‌‌‌ శ్రావణ్‌‌‌‌ కుమార్‌‌‌‌, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏఏజీ రామకృష్ణారావు వాదనలు వినిపిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ తీర్పును  ధిక్కరించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కేఆర్‌‌‌‌ఎంబీ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ టీం తన నివేదికలో తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు. ఏపీ సీఎస్‌‌‌‌ తాము పనులు చేయడం లేదని, డీపీఆర్‌‌‌‌ కోసం ప్రిపరేటరీ వర్క్స్‌‌‌‌ మాత్రమే చేస్తున్నామని చెప్తూ ధర్మాసనాన్ని మోసం చేశారని అన్నారు. జస్టిస్‌‌‌‌ రామకృష్ణన్‌‌‌‌ స్పందిస్తూ.. ప్రాజెక్టు ఫొటోలు చూస్తుంటే పనులు చాలా వరకు పూర్తయినట్టుగా తెలుస్తోందని, ఇది ముమ్మాటికీ తమ ఆదేశాలు ఉల్లంఘించడమేనని సీరియస్​ అయ్యారు. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘించినప్పుడు అధికారులను జైలుకు పంపడానికి ట్రిబ్యునల్‌‌‌‌కు ఉన్న అవకాశాలు, న్యాయ పరిమితులు, ఇతర ప్రొసీడింగ్స్‌‌‌‌ను పిటిషనర్ల తరపు అడ్వకేట్లు తెలియజేయాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌‌‌‌ అడ్వకేట్‌‌‌‌ ఆర్‌‌‌‌. వెంకటరమణి జోక్యం చేసుకొని జులై 7నే పనులు ఆపేశామని చెప్పారు. జస్టిస్ రామకృష్ణన్‌‌‌‌ స్పందిస్తూ.. అప్పటికే చాలా ఎక్కువ పని చేసినట్టుగా తెలుస్తుందన్నారు. ఏపీ తరఫు అడ్వకేట్‌‌‌‌ కూడా ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో వివరణ ఇవ్వాలని ఆయన సూచించారు.

ఈ–మెయిల్​ ద్వారా నివేదికనా?
కేఆర్‌‌‌‌ఎంబీకి ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ టీం శనివారమే నివేదిక ఇచ్చినా దానిని ప్రాపర్‌‌‌‌గా ఎన్జీటీకి సబ్మిట్‌‌‌‌ చేయని విషయాన్ని పిటిషనర్ల తరఫు అడ్వకేట్లు గుర్తుచేశారు. ఈ – ఫైలింగ్‌‌‌‌ విధానంలో కాకుండా ఈ-–మెయిల్‌‌‌‌ ద్వారా నివేదిక పంపడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టుపై నివేదిక ఎందుకు ఇవ్వలేదని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖను ప్రశ్నించింది. ‘‘మీ తీరు చూస్తుంటే ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారా అనే అనుమానం కలుగుతోంది..’’ అంటూ జస్టిస్‌‌‌‌ రామకృష్ణన్‌‌‌‌ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఎందుకు నివేదిక ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని సూచిస్తూ ఆ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తామన్నారు. ఈ నెల 27లోగా కేఆర్‌‌‌‌ఎంబీ, కేంద్ర అటవీ శాఖ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. కేఆర్‌‌‌‌ఎంబీ ఇచ్చిన నివేదికలో ఏమైనా అభ్యంతరాలుంటే ఏపీ ప్రభుత్వం తమ దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. ఏపీ అడ్వకేట్‌‌‌‌ జోక్యం చేసుకుంటూ.. కృష్ణా బోర్డు ఇచ్చిన రిపోర్టును తాము చూడలేదని, ఎన్జీటీ తీర్పును తాము ఉల్లంఘించలేదని అన్నారు. ఆ నివేదిక పరిశీలించిన తర్వాత అభ్యంతరాలు తెలియజేస్తామని చెప్పారు.