రేపటిలోగా జీతాలు చెల్లిస్తం .. ఎన్‌‌హెచ్‌‌ఎం డైరెక్టర్ కర్ణన్ హామీ

రేపటిలోగా జీతాలు చెల్లిస్తం ..  ఎన్‌‌హెచ్‌‌ఎం డైరెక్టర్ కర్ణన్ హామీ

హైదరాబాద్, వెలుగు :  వైద్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌‌హెచ్‌‌ఎం) కింద పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఈ నెల 20వ తేదీలోపు జీతాలు చెల్లిస్తామని ఎన్‌‌హెచ్‌‌ఎం డైరెక్టర్ కర్ణన్ వెల్లడించారు. ఎన్‌‌హెచ్‌‌ఎంలో పనిచేస్తున్న దాదాపు 17వేల మంది ఉద్యోగులకు పెండింగ్‌‌లో ఉన్న మూడు నెలల వేతనాల్ని చెల్లించాలని, లేకుంటే ఈ నెల 22వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఏఐటీయూసీ నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో యూనియన్ ప్రతినిధులతో ఎన్‌‌హెచ్‌‌ఎం డైరెక్టర్ కర్ణన్, తెలంగాణ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సోమవారం చర్చలు జరిపారు. 

అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ మాట్లాడుతూ.. చర్చలు ఆశాజనకంగా జరిగాయని తెలిపారు. పెండింగ్‌‌ జీతాలను 20వ తేదీ వరకు చెల్లిస్తామని ఎన్‌‌హెచ్‌‌ఎం డైరెక్టర్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. హామీని అమలు చేయకపోతే సమ్మె యథావిధిగా ఉంటుందని స్పష్టం చేశారు. బడ్జెట్‌‌తో సంబంధం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించనందువల్ల అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  అలాగే, తెలంగాణ రాష్ట్రంలోని నేషనల్ హెల్త్ మిషన్లకు రావాల్సిన 380 కోట్ల రూపాయలను  కేంద్రం  వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్‌‌హెచ్‌‌ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్ కన్నా, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు తోట రామాంజనేయులు,  తదితరులు పాల్గొన్నారు.