
న్యూఢిల్లీ: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(సవరణ) బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. సభలోని మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటేశారు. టెర్రరిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు హోంమంత్రి లోక్‌సభలో వెల్లడించారు. ఈ సంస్థను రాజకీయంగా వాడుకునే ఉద్దేశమేమీ మోడీ సర్కారుకు లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం లోక్‌సభలో ఈ బిల్లు పాస్అయిన విషయం తెలిసిందే. అంతకుముందు బిల్లుపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు సందేహాలు వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఎన్ఐఏ పరిధిని విదేశాలకూ విస్తరించడం అర్థంలేని చర్యని విమర్శించారు. విదేశాలలో దాక్కున్న నిందితులను అరెస్టు చేయాలంటే అంతర్జాతీయ చట్టాలను విధిగా పాటించాల్సిందేనని గుర్తుచేస్తూ.. ఎన్ఐఏ పరిధిని విస్తరించినంత మాత్రాన ఈ నిబంధనల్లో మార్పురాదని అన్నారు. ఎన్ఐఏ కు అపరిమిత పవర్స్ కట్టబెట్టడంపై కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యుల సందేహాలను అమిత్‌షా కొట్టిపారేశారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తే ప్రజల్లోకి తప్పుడు సందేశం వెలుతుందన్నారు.
హోంశాఖలో 1083 మంది అధికారులకు ఉద్వాసన: నిత్యానంద్రాయ్
అవినీతి ఆరోపణలు, విధులపై నిర్లక్ష్యం.. వంటి కారణాలతో ఐదేళ్లలో హోంశాఖలో 1083 మంది అధికారుల్ని విధుల నుంచి తొలగించామని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. రాజ్యసభలో బుధవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
విదేశాల నుంచి 27 మందిని రప్పించాం
2016 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన 27 మందిని విదేశాల నుంచి దేశానికి తిరిగి రప్పించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇంటర్‌పోల్ నోటీసులు జారీ అయిన111 మందిని అరెస్టు చేశామని లోక్‌సభలో బుధవారం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. పోక్సో యాక్ట్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆ తరహా కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
మూడేళ్లలో 86 మందిపై అవినీతి కేసులు: జితేందర్‌సింగ్
సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మూడేళ్లలో 86 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారులపై 61 అవినీతి కేసులు పెట్టిందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ బుధవారం లోక్‌సభలో చెప్పారు.
ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగానే ఉన్నారు
సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసుల్లో ఎస్సీ, ఎస్టీలు, వారికి అమలవుతున్న రిజర్వేషన్ కన్నా ఎక్కువగానే ఉన్నారని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ చెప్పారు. ఓబీసీలు మాత్రం తక్కువగా ఉన్నారన్నారు. 2016 జనవరి 1 నాటికి 78 మినిస్ట్రీలు, వాటికి చెందిన డిపార్ట్‌మెంట్లు ఇచ్చిన లెక్కల ప్రకారం ఎస్సీలు 17.49శాతం, ఎస్టీలు 8.47 శాతం, ఓబీసీలు 21.57 శాతం ఉన్నారని బుధవారం లోక్‌సభలో చెప్పారు.
అక్రమ వలసదారులను పంపిస్తాం: షా
దేశంలో ఎక్కడైనా సరే అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించి డిపోర్ట్చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. రాజ్యసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు. నేషనల్ సిటిజన్ రిజిస్టర్(ఎన్ఆర్సీ) కేవలం అస్సాం రాష్ట్రానికి మాత్రమే పరిమితమా.. లేక దేశమంతటికీ వర్తింపజేస్తారా అంటూ ఎస్పీ సభ్యుడు జావేద్అలీఖాన్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ అక్రమంగా నివసించే వారందరినీ దేశం బయటికి సాగనంపుతామని షా చెప్పారు. ఎన్ఆర్సీలో చోటుచేసుకున్న కొన్ని పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. కొంత ఆలస్యమైతే కావొచ్చు కానీ ఎన్ఆర్ సీని ఇంప్లిమెంట్ చేయడం మాత్రం పక్కా అని స్పష్టంచేశారు. అర్హులైన ఏ ఒక్కరి పేరూ మిస్కావొద్దనేదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. ఈ నెలాఖరుతో ముగియనున్న ఎన్ఆర్సీ గడువును పెంచాలంటూ 25 లక్షల మంది దరఖాస్తుదారులు ప్రెసిడెంట్‌కు విజ్ఞప్తి చేశారని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు.
రోహింగ్యా ముస్లింలు దేశంలో ఎంతమంది ఉన్నారనే దానిపై సర్కారు వద్ద కచ్చితమైన సంఖ్య లేదన్నారు. రోహింగ్యా వలసదారులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారని, కొంతమంది తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయారని రాయ్వివరించారు. త్వరలో వారి వివరాలన్నీ సేకరిస్తామని చెప్పారు.