రైసిన్ తయారీ దర్యాప్తులో NIA దృష్టి.. ATS నుంచి కీలక సమాచార సేకరణ

రైసిన్ తయారీ దర్యాప్తులో NIA దృష్టి.. ATS నుంచి కీలక సమాచార సేకరణ
  • హైదరాబాద్​ వాసి డాక్టర్ అహ్మద్ సయ్యద్‌ లింకులపై ఆరా
  • హర్యానా, యూపీలో పట్టుబడిన డాక్టర్లతో సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు 
  • 2 నెలల కిందనే ఇంట్లో మెషీన్ ఏర్పాటు.. ఆముదం తయారు చేస్తున్నట్టు కుటుంబ సభ్యులను నమ్మించిన సయ్యద్ 

హైదరాబాద్‌‌, వెలుగు: గుజరాత్ ఏటీఎస్ పోలీసులు భగ్నం చేసిన రైసిన్ తయారీ కుట్ర కేసులో దర్యాప్తు చేప ట్టేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిద్ధమైనట్టు 
తెలుస్తున్నది. ఈ కేసులో ఉగ్రమూలాలను వెలికితీసేందుకు ఎన్‌‌ఐఏ రంగంలోకి దిగుతున్నది. గుజరాత్‌‌ ఏటీఎస్‌‌కు చిక్కిన హైదరాబాద్ వాసి డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఉత్తర్‌‌‌‌ప్రదేశ్‌‌కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహైల్ సలీమ్‌‌ సహా మరికొంత మందిపై కేసు నమోదుకు సిద్ధమవుతున్నది. 

ఈ మేరకు గుజరాత్‌‌ ఏటీఎస్ అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన సయ్యద్‌‌.. హైదరాబాద్‌‌ వాసి కావడంతో రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్‌‌ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. గుజరాత్‌‌ ఏటీఎస్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సయ్యద్‌‌తో సంబంధాలు ఉన్నోళ్ల వివరాలు సేకరిస్తున్నారు. 

ఢిల్లీ బ్లాస్ట్ కేసుకు లింక్ ఉందా?  

ఢిల్లీ ఎర్రకోట వద్ద బ్లాస్టింగ్ జరగకముందే జమ్మూకాశ్మీర్ పోలీసులు హర్యానా, ఉత్తరప్రదేశ్‌‌లో 8 మంది టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. వీరిలో జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని కుల్గాంకు చెందిన డాక్టర్‌‌‌‌ ఆదిల్, పుల్వామాకు చెందిన డాక్టర్‌‌‌‌ ముజమ్మిల్ అహ్మద్, ఉత్తరప్రదేశ్‌‌లోని లక్నోకు చెందిన డాక్టర్‌‌‌‌ షాహీన్ ఉన్నారు. హర్యానా ఫరీదాబాద్‌‌లోని ముజమ్మిల్ అహ్మద్ ఇంట్లో తనిఖీలు చేసిన కాశ్మీర్ పోలీసులు.. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

అక్కడ జమ్మూకాశ్మీర్ పోలీసులకు పట్టుబడిన ముగ్గురూ డాక్టర్లు కావడం, మరోవైపు గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసిన వారిలో హైదరాబాద్‌‌కు చెందిన మొహియుద్దీన్‌‌ సయ్యద్‌‌ కూడా డాక్టర్ కావడంతో... వీళ్ల నలుగురి మధ్య ఏవైనా లింకులు ఉన్నాయా? అని దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలో రైసిన్‌‌ తయారీ కేసుపై ఎన్‌‌ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ కేసులో ఏటీఎస్ స్వాధీనం చేసుకున్న ముడి పదార్థాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేసింది. 

పలుమార్లు గుజరాత్ టూర్.. 

హైదరాబాద్ రాజేంద్రనగర్‌‌‌‌ ‌‌ఫోర్త్‌‌ వ్యూ కాలనీలోని తన నివాసంలో రెండు నెలల కిందనే సయ్యద్ మిషన్‌‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఆముదం నూనె బిజినెస్ చేస్తున్నట్టు తన సోదరుడు ఒమర్‌‌‌‌ ఫారూఖీ సహా కుటుంబసభ్యులకు చెప్పాడు. ఈ క్రమంలో బిజినెస్‌‌ డీల్‌‌ ఉందని చెప్పి పలుమార్లు గుజరాత్‌‌ వెళ్లాడు. ఆముదం, ప్యూర్ ఆయిల్‌‌కు చాలా డిమాండ్ ఉన్నదని.. ఎక్కువ లాభాలు వస్తాయని కుటుంబ సభ్యులను నమ్మించాడు. సయ్యద్ టెలిగ్రామ్‌‌, సిగ్నల్‌‌ యాప్‌‌ సహా పలు సోషల్ మీడియా యాప్స్‌‌తో సంభాషణలు జరిపేవాడు.

ఎన్‌‌క్రిప్టెడ్‌‌ మేసేజ్‌‌లు, డాక్యుమెంట్లను షేర్ చేసేవాడు. ఇందులో భాగంగానే 15 రోజుల కింద గుజరాత్‌‌ వెళ్లాడు. అప్పటికే సయ్యద్‌‌పై నిఘా పెట్టిన గుజరాత్‌‌ ఏటీఎస్‌‌.. గాంధీనగర్‌‌‌‌లోని కలోల్‌‌ వద్ద అతడిని అరెస్ట్ చేసింది. డెడ్‌‌డ్రాప్ విధానంలో ఆయుధాలు సేకరిస్తున్నట్టు గుర్తించింది. సయ్యద్‌‌ను అరెస్ట్‌‌ చేసిన విషయం హైదరాబాద్‌‌లోని తన సోదరుడు ఒమర్ ఫారూఖీకి గుజరాత్ పోలీసులు ఫోన్ చేసి చెప్పారు. అయితే ఆ ఫోన్‌‌ కాల్‌‌ డిజిటల్ అరెస్ట్ నేరగాళ్ల కాల్‌‌గా అతను భావించాడు. సయ్యద్ మాట్లాడిన తరువాత నిజమేనని నమ్మినట్టు ఒమర్ పోలీసులకు తెలిపాడు. సోషల్‌‌ మీడియాలో సునీల్‌‌ అనే వ్యక్తి తన తమ్ముడిని ట్రాప్‌‌ చేశాడని చెప్పాడు.

సయ్యద్ ఇంట్లో తనిఖీలు.. 

రాజేంద్రనగర్‌‌‌‌లోని సయ్యద్ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ స్థాయి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం సయ్యద్ ఇంటికి వచ్చింది. రాత్రి 2 గంటల నుంచి 3:30 గంటల వరకు తనిఖీలు చేసింది. ఈ సోదాల్లో మూడు రకాల లిక్విడ్‌‌, కంప్యూటర్, బుక్స్, ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇదే తరహాలో యూపీకి చెందిన నిందితుల ఇళ్లలోను సోదాలు నిర్వహించారు. సయ్యద్ సోదరుడు ఒమర్ ఫారూఖీకి నోటీసులు ఇచ్చి వెళ్లారు. సెర్చ్ రిపోర్ట్, సీజ్ చేసిన ఆధారాలకు  సంబంధించి స్టేట్‌‌మెంట్ తీసుకున్నారు.