ఉగ్ర కుట్ర భగ్నం: 9 మంది అల్‌‌ఖైదా టెర్రరిస్టుల అరెస్ట్

ఉగ్ర కుట్ర భగ్నం: 9 మంది అల్‌‌ఖైదా టెర్రరిస్టుల అరెస్ట్

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌‌లోని ముర్షీదాబాద్, కేరళలోని ఎర్నాకులంలో 9 మంది అల్‌‌ఖైదా  టెర్రరిస్టులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) పట్టుకుంది. ఎర్నాకులంతోపాటు ముర్షీదాబాద్‌‌‌‌‌‌లోని పలు చోట్ల శనివారం ఉదయం ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. దీంతో టెర్రరిస్టులను పట్టుకున్నారు. వీరిలో ఆరుగురు బెంగాల్‌‌కు చెందిన వారని, మరో ముగ్గురు ఉగ్రవాదులు కేరళ వాసులుగా ఎన్ఐఏ గుర్తించినట్లు సమాచారం. వీరిని అరెస్టు చేసిన ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో డిజిటల్ డివైజ్‌‌లు, డాక్యుమెంట్లు, జిహాదీ లిటరేచర్, పలు మొత్తంలో ఆయుధాలు, తుపాకీలు, స్వీయంగా ఆయుధాలను తయారు చేసుకోవడానికి పనికొచ్చే ఆర్టికల్స్, లిటరేచర్‌‌ను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది.

అల్ ఖైదా ఆపరేటివ్స్ గురించి సమాచారం అందడంతో దేశంలో పలు చోట్ల ఎన్ఐఏ తన ఆపరేషన్స్‌‌ను ముమ్మరం చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులకు సదరు ఆపరేటివ్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమకు అందిన ఇన్‌‌పుట్స్‌‌‌తో కేసు నమోదు చేసిన ఎన్‌‌ఐఏ విచారణకు ఆదేశించింది. అరెస్టయిన టెర్రరిస్టులను ముర్షిద్ హసన్, ఇయాకుబ్ బిస్వాస్, మోసరఫ్ హుస్సేన్, నజ్ముస్ సకీబ్, అబూ సుఫియాన్, మైనుల్ మోండల్, లూ యీన్ అహ్మద్, అల్ మమూన్ కమల్, అతీతుర్ రెహ్మాన్‌‌గా గుర్తించారు. ఈ టెర్రరిస్టులను సంబంధిత కేరళ, వెస్ట్ బెంగాల్ కోర్టుల్లో ప్రవేశ పెట్టనున్నారు. అప్పటివరకు పోలీసు కస్టడీలో ఉంచనున్నారు. విచారణ కొనసాగునుందని అధికారులు తెలిపారు.