టెర్రరిస్టులు, గ్యాంగ్​స్టర్లు టార్గెట్​గా ఎన్‌‌ఐఏ రైడ్స్

టెర్రరిస్టులు, గ్యాంగ్​స్టర్లు టార్గెట్​గా ఎన్‌‌ఐఏ రైడ్స్
  • 5 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో తనిఖీలు
  • పలువురు అనుమానితుల అరెస్ట్‌‌
  • ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం

న్యూఢిల్లీ: దేశంలోని 53 ప్రాంతాల్లో నేషనల్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌ ఏజెన్సీ(ఎన్‌‌ఐఏ) ఒకేసారి సోదాలు జరిపింది. బుధవారం జరిపిన ఈ తనిఖీల్లో గ్యాంగ్‌‌స్టర్లు, టెర్రరిస్టులతో సంబంధం ఉన్నవారు, డ్రగ్స్‌‌ స్మగ్లర్లను అదుపులోకి తీసుకుంది. మొత్తం 5 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో పిస్టోల్స్‌‌, పేలుడు పదార్థాలు, భారీ మొత్తంలో డిజిటల్‌‌ డివైజెస్‌‌ స్వాధీనం చేసుకున్నామని ఏజెన్సీ అధికారి ఒకరు వెల్లడించారు. పంజాబ్‌‌, హర్యానా, రాజస్థాన్‌‌, ఉత్తరాఖండ్‌‌, ఉత్తరప్రదేశ్‌‌, ఢిల్లీ, చండీగఢ్‌‌లోని 53 ప్రాంతాల్లో జరిపామని తెలిపారు. టెర్రరిస్టులు, గ్యాంగ్‌‌స్టర్లు, స్మగ్లర్ల మధ్య బంధాన్ని తెంచే లక్ష్యంతో ఈ దాడులు జరిపామన్నారు.

పాకిస్తాన్‌‌, దుబాయ్‌‌, కెనడా, పోర్చుగల్‌‌ తదితర దేశాల్లో ఉంటూ ఇక్కడి డ్రగ్స్‌‌ సప్లయర్స్‌‌, టెర్రర్‌‌‌‌ సంస్థలతో కలిసి పనిచేస్తున్న వారు, వెపెన్‌‌ సప్లయర్స్‌‌, ఫైనాన్షియర్లు, లాజిస్టిక్స్‌‌ ప్రొవైడర్లతో టచ్‌‌లో ఉన్నారని, అలాంటి వారిపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. గ్యాంగ్‌‌స్టర్లు‌‌ లారెన్స్‌‌ బిష్ణోయ్‌‌, కెనడాకు చెందిన అర్ష్‌‌దీప్‌‌ డల్లాతో పాటు సుఖ దునేకే, హ్యారీ మౌర్‌‌‌‌, రేందర్‌‌‌‌ అలియాస్‌‌ లాలీ, కాలా జాతేరి, దీపక్‌‌ టీలకు చెందిన గ్యాంగులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో భారత్‌‌లోని ఖలిస్తానీ అనుకూల సంస్థలు, వ్యక్తులకు ఇతర దేశాల్లో ఉన్న ఖలిస్తానీ, గ్యాంగ్‌‌స్టర్ల నుంచి ఫండ్స్‌‌ వస్తున్నాయని గుర్తించామన్నారు. దీనికి సంబంధించి, ఇప్పటికే పలువురిని అరెస్ట్‌‌ చేశామని తెలిపారు.