తెలంగాణ, చత్తీస్‌‌గఢ్‌‌ సరిహద్దుల్లో .. ఎన్ఐఏ సోదాలు

తెలంగాణ, చత్తీస్‌‌గఢ్‌‌ సరిహద్దుల్లో ..  ఎన్ఐఏ సోదాలు

భద్రాచలం, వెలుగు: తెలంగాణ, -చత్తీస్‌‌గఢ్ సరిహద్దుల్లో శనివారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌‌ఐఏ) సోదాలు జరిగాయి. వరంగల్ జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవానగరం, ఉంజుపల్లిల్లో రెండు ఎన్‌‌ఐఏ టీంలు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాయి. ఒక్కో టీంలో 8 మంది ఎన్‌‌ఐఏ సభ్యులు ఉన్నారు. కాగా, ఈ ఏడాది జూన్ 6న చర్ల మండలం దేవానగరం వద్ద సీఆర్‌‌‌‌పీఎఫ్ బెటాలియన్ సభ్యులు, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు మావోయిస్టు కొరియర్లు పట్టుబట్టారు. 

చర్ల మండలంలోని దేవానగరానికి చెందిన పూనెం నాగేశ్వరరావు, ఉంజుపల్లికి చెందిన దేవనూరి మల్లికార్జునరావు, చత్తీస్‌‌గఢ్‌‌లోని బీజాపూర్ జిల్లా అంబేద్కర్ పారా గ్రామానికి చెందిన పల్లెపోగుల ఉమాశంకర్‌‌‌‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 జిలిటిన్ స్టిక్స్, 160 మీటర్ల కార్డెక్స్ వైరు, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు 5, ఒక డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. వీరు చత్తీస్‌‌గఢ్‌‌లోని పామేడు ఏరియా కమిటీకి, మావోయిస్టు బెటాలియన్‌‌కు కొరియర్లుగా వ్యవహరిస్తున్నారని విచారణలో తెలింది. చర్ల పోలీసులు కేసు నమోదు చేసి, ఎన్‌‌ఐఏకు బదిలీ చేశారు.

పోలీసుల సమాచారంతో..

పోలీసుల సమాచారంతో ఎన్‌‌ఐఏ కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగింది. పట్టుబడ్డ వారు వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో ఎవరెవరిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు? మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, డ్రోన్లు సరఫరా చేసింది ఎవరు? తదితర వివరాలను సేకరిస్తున్నారు. విజయవాడలో డ్రిల్లింగ్ మిషన్ కూడా కొనుగోలు చేసినట్లుగా చర్ల పోలీసుల విచారణలో తెలింది. దీంతో చర్ల మండలం దేవానగరం, ఉంజుపల్లిలలో ఎన్‌‌ఐఏ టీం ఒకటి సోదాలు చేసింది. అలాగే, చత్తీస్‌‌గఢ్‌‌లోని పామేడుకు వెళ్లి, ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీకి సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు, విప్లవ సాహిత్యం, కీలకమైన సమాచారాన్ని సేకరించారు. అలాగే, వరంగల్ ప్రాంతంలోనూ మరికొందరిపైన కేసులు నమోదు చేసి, వారి ఇండ్లల్లో సోదాలు నిర్వహించారు.