- సిట్ ఎదుట నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి వెల్లడి
- బ్యాంకు అకౌంట్లను పరిశీలించిన అధికారులు
- ప్రమోట్ చేసిన యాప్స్‌తో చేసుకున్న అగ్రిమెంట్లపై ఆరా
- ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్‌రాజ్‌ను ప్రశ్నించిన సిట్
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా బెట్టింగ్ జరుగుతున్నదన్న విషయం తెలియకనే ప్రమోట్ చేసినట్లు సినీ నటి నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అమృతా చౌదరి వెల్లడించారు. స్కిల్డ్ బేస్డ్ గేమింగ్ యాప్స్ అనే భావనతోనే ప్రచారానికి ఒప్పుకున్నామని తెలిపారు. ఈ మేరకు సీఐడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులకు వారు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు దర్యాప్తులో భాగంగా నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి శుక్రవారం సీఐడీ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
మధ్యాహ్నం 2 గంటలకు లక్డీకపూల్‌లోని సీఐడీ ఆఫీసుకు వచ్చిన వీరిని.. సిట్ టీమ్‌లోని ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధుశర్మ, సీఐడీ ఎస్పీ వెంకటలక్ష్మితో కూడిన అధికారుల బృందం ప్రశ్నించింది. శ్రీముఖిని సుమారు గంటన్నర పాటు ప్రశ్నించగా.. నిధిఅగర్వాల్, అమృత చౌదరిని మూడు గంటల పాటు అధికారులు విచారించి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేశారు. అవసరమైతే మరోసారి విచారణకు అందుబాటులో ఉండాలని సూచించారు.
బ్యాంకు అకౌంట్ల పరిశీలన
సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. జీత్ విన్ అనే బెట్టింగ్ సైట్‌ను నిధి అగర్వాల్ ప్రమోట్ చేయగా.. ఎమ్88 అనే యాప్‌ను శ్రీముఖి.. యోలో 247, ఫెయిర్‌ప్లే యాప్‌లను అమృత చౌదరి ప్రమోట్ చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ ముగ్గురూ ప్రమోట్ చేసిన యాప్స్‌తో చేసుకున్న అగ్రిమెంట్లు సహా ఆయా సంస్థలతో ఆర్థిక లావాదేవీలు జరిగిన బ్యాంక్ అకౌంట్లను పరిశీలించారు. అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత వీరు తీసుకున్న రెమ్యూనరేషన్ సహా యాప్స్ అకౌంట్ల నుంచి వీరి అకౌంట్లలో డిపాజిట్ అయిన లావాదేవీల వివరాలు సేకరించారు.
యువత ఆత్మహత్యలకు దారితీసిన బెట్టింగ్, గేమింగ్ యాప్స్ కేసుల దర్యాప్తు కోసం ప్రభుత్వం మార్చి 10న ఐదుగురు సభ్యులతో కూడిన సీఐడీ సిట్ వేసింది. పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లు, సూర్యాపేట జిల్లాలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన టాలీవుడ్ నటులు, యాంకర్లు, యూట్యూబర్లు సహా 29 మందిని విచారిస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్ సహా పలువురిని ప్రశ్నించారు.
