అప్పు తీసుకున్న వ్యక్తే చంపిండు

అప్పు తీసుకున్న వ్యక్తే చంపిండు

అలంపూర్, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం కాశాపురం శివారులో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె చెల్లెలు కొడుకే ఆస్తి కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్న మరో వ్యక్తితో చంపించాడని తేల్చారు. కాశాపురం గ్రామానికి చెందిన పింజరి మోదీన్ బీ(60) ఈ నెల 19న పత్తి పొలంలో పని చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు తల పగలగొట్టి.. గొంతు నులిమి హత్య చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలి చెల్లెలి కొడుకు శాలు భాషా, ఆమె వద్ద అప్పుతీసుకున్న వెంకటరాముడును విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు.  మోదీన్‌‌ బీకి పిల్లలు లేరు. భర్త కూడా చాలా ఏండ్ల క్రితమే చనిపోయాడు. ఆమెకు కాశాపురంలో ఉన్న మూడున్నర ఎకరాల పొలాన్ని తన పేరుమీద చేయాలని శాలుభాషా చాలాసార్లు అడిగినా ఆమె నిరాకరించింది.  అంతేకాదు గ్రామంలో చాలామందికి డబ్బులను వడ్డీకి ఇచ్చేది. భాషాకు మాత్రం ఎప్పుడు అడిగినా ఇచ్చేది కాదు.  2019లో  గ్రామానికి చెందిన గొల్ల వెంకటరాముడుకు మోదీన్​బీ రూ. 80 వేలు ఇచ్చింది. కొంతకాలంగా ఆ డబ్బులు ఇవ్వమని అతడిని అడుగుతోంది. తరచూ భాషా, వెంకటరాముడు కలిసి మద్యం తాగేవారు. ఆ సమయంలో అప్పు విషయం చెప్పాడు.  దీంతో తన పెద్దమ్మను చంపేస్తే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదని, తనకు కూడా భూమి వస్తుందని భాషా చెప్పాడు. ఈ నెల 19న  మోదీన్‌‌ బీ ఒక్కతే పొలానికి వెళ్లడం చూసిన బాష వెంటనే వెంకటరాముడుకు ఫోన్‌‌ చేసి చెప్పాడు.  మధ్యాహ్నం సమయంలో పొలానికి వెళ్లిన  వెంకటరాముడు కట్టెతో పలుసార్లు ఆమె తలపై కొట్టాడు. కట్టె విరిగిపోవడంతో చీరను గొంతుకు చుట్టి చంపేశాడు.  అనంతరం ఆమె బొడ్డు సంచిలో ఉన్న తాళాలు తీసుకొని భాషాతో కలిసి మృతురాలి ఇంటికి వెళ్లాడు.  బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న రూ. 80 వేల ప్రామిసరీ నోట్‌‌ను వెంకటరాముడు తీసుకోగా.. భాషా బంగారు కమ్మలు,  ముక్కుపుడక, ఉంగరం, రూ. 1,600 తీసుకొని వెళ్లిపోయారు.  మృతురాలి ఫోన్ కాల్  డేటా ఆధారంగా పోలీసులు  ఇరువురిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు.