45 రోజుల్లో నిఫ్టీ 11 శాతం అప్‌.. బిలియనీర్ల సంపద పైపైకి

45 రోజుల్లో నిఫ్టీ 11 శాతం అప్‌.. బిలియనీర్ల సంపద పైపైకి
  • తిరిగి 100 బిలియన్ డాలర్ల క్లబ్‌‌‌‌‌‌‌‌లోకి ముకేశ్ అంబానీ
  • రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌, జియో ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ షేర్లు పెరగడంతో 
  • రూ.1.72 లక్షల కోట్లు జూమ్‌.. అదే బాటలో గౌతమ్ అదానీ
  • సంపద పెంచుకున్నవారిలో దిలీప్ షాంఘ్వీ, సునీల్ మిత్తల్‌‌‌‌‌‌‌‌, దమాని కూడా

న్యూఢిల్లీ: గత నెలన్నర రోజులు నుంచి  ఇండియన్ మార్కెట్లు ర్యాలీ చేస్తుండడంతో భారతీయ బిలియనీర్ల సంపద  కూడా పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఇప్పటివరకు నిఫ్టీ సుమారు 11 శాతం లాభపడింది. ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో   రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేశ్‌‌‌‌‌‌‌‌  అంబానీ సంపద 20 బిలియన్ డాలర్లు (రూ.1.72 లక్షల కోట్లు)  పెరగడం విశేషం.  మళ్లీ 100 బిలియన్ డాలర్ల (రూ.8.60 లక్షల కోట్ల) ను అధిగమించింది. 

బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ డేటా ప్రకారం, ఈ ఏడాది మార్చిలో 81 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద, తాజాగా 101 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గ్లోబల్ రిచ్ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ముకేశ్ అంబానీ 16 వ స్థానాన్ని దక్కించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గత నెల రోజుల్లో సుమారు 25 శాతం పెరగగా,  జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు కూడా 29 శాతం లాభపడ్డాయి.  అయితే, ఆయన ప్రస్తుత సంపద కిందటేడాది జులై 8నాటి రికార్డ్  స్థాయి అయిన 120.8 బిలియన్ డాలర్ల కంటే సుమారు 20 శాతం తక్కువగా ఉంది. 

భారతదేశంలో రెండో అతిపెద్ద ధనవంతుడైన గౌతమ్ అదానీ కూడా తన సంపదను గణనీయంగా పెంచుకున్నారు. గత నెలన్నర రోజుల్లో  ఆయన సంపద 13.5 బిలియన్ డాలర్లు (రూ.1.16 లక్షల కోట్లు)  ఎగసి 77.5 బిలియన్ డాలర్ల (రూ.6.66 లక్షల కోట్ల) కు  చేరింది. అయినప్పటికీ  ఆయన సంపద కిందటేడాది జూన్‌‌‌‌‌‌‌‌3న చూసిన గరిష్ట స్థాయి 120.8 బిలియన్ డాలర్ల (రూ.10.39 లక్షల కోట్ల)  కంటే సుమారు  57 శాతం తక్కువ.

వీరి సంపద పైకే

ఇతర సంపన్నుల్లో సన్ ఫార్మాస్యూటికల్స్  దిలీప్ షాంఘ్వీ,  భారతి ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్  సునీల్ మిత్తల్ తమ సంపదను భారీగా పెంచుకున్నారు.  షాంఘ్వీ  సంపద ఈ ఏడాది మార్చి స్థాయిల నుంచి 4.3 బిలియన్ డాలర్ల  (రూ.37 వేల కోట్ల) కు  పైగా పెరిగి 28.8 బిలియన్ డాలర్ల (రూ.2.47 లక్షల కోట్ల) కు చేరుకోగా, కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రికార్డ్ చేసిన గరిష్ట స్థాయి నుంచి ఇంకా 10 శాతం తక్కువలో ఉంది.   మిత్తల్‌‌‌‌‌‌‌‌  సంపద గత నెలన్నరలో సుమారు 5 బిలియన్ డాలర్లు (రూ.43 వేల కోట్లు)  పెరిగి 27.4 బిలియన్ డాలర్ల (రూ.2.35 లక్షల కోట్ల) కు పెరిగింది. గరిష్ట స్థాయి నుంచి ఒక శాతం తక్కువగా ఉంది.  

ఎవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌మార్ట్స్ (డీమార్ట్) నియంత్రించే రాధాకిషన్ దమానీ (మొత్తం సంపద 31.7 బిలియన్ డాలర్లు( రూ.2.72 లక్షల కోట్లు)) , భారతదేశంలోని అత్యంత ధనవంత మహిళ సావిత్రీ జిందాల్(36.4 బిలియన్ డాలర్లు(రూ.3.13 లక్షల కోట్లు)) , హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ నాదార్ ( 22.8 బిలియన్ డాలర్లు (రూ.1.96 లక్షల కోట్లు)) కూడా తమ సంపదలో గణనీయమైన పెరుగుదలను చూశారు. వీరి సంపదలు సుమారు 4.5  బిలియన్ డాలర్ల (రూ.39 వేల కోట్ల)  చొప్పున పెరిగాయి.   దమానీ తన రికార్డు గరిష్ట స్థాయి కంటే 27 శాతం, జిందాల్ 16 శాతం, నాదార్ 18 శాతం తక్కువలో ఉన్నారు. 

ఆర్సెలర్‌‌‌‌‌‌‌‌ మిత్తల్ ఛైర్మన్ లక్ష్మీ మిత్తల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ మునుపటి నష్టాల నుంచి పూర్తిగా కోలుకున్నారు. మిత్తల్‌‌‌‌‌‌‌‌  సంపద రికార్డు గరిష్ట స్థాయి అయిన  22.8 బిలియన్ డాలర్ల (రూ.1.96 లక్షల కోట్ల) కు, కోటక్‌‌‌‌‌‌‌‌ సంపద  16.6 బిలియన్ డాలర్ల (రూ.1.42 లక్షల కోట్ల) కు చేరుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో రికార్డ్ చేసిన కనిష్ట స్థాయిల నుంచి రికవర్ అవ్వడమే కాకుండా, 3 బిలియన్ డాలర్ల (రూ.26 వేల కోట్ల) కు పైగా పెరిగాయి. ఇంటర్‌‌‌‌‌‌‌‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) ఫౌండర్లు  రాకేష్ గంగ్వాల్, రాహుల్ భాటియా, ఐషర్ మోటార్స్ ఫౌండర్‌‌ విక్రమ్ లాల్ సంపదలు జనవరిలో రికార్డ్ అయిన  కనిష్ట స్థాయిల నుంచి కోలుకున్నాయి. 

దివీస్ లాబొరేటరీస్ ఎండీ మురళి దివి  సంపద 10.3 బిలియన్ డాలర్ల (రూ.89 వేల కోట్ల) కు చేరుకుంది.  మరోవైపు, చాలా మంది బిలియనీర్ల సంపద తమ రికార్డ్ గరిష్టాల నుంచి  ఇంకా తక్కువలో ఉంది.  జైడస్ లైఫ్‌‌‌‌‌‌‌‌సైన్సెస్  పంకజ్ పటేల్, డీఎల్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌  కేపీ సింగ్ సంపద  కిందటేడాది ఆగస్టులో గరిష్టాలకు చేరగా,  ప్రస్తుతం ఆ లెవెల్స్ నుంచి ఇంకా 45 శాతం తక్కువలో ఉంది. సీరం ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్  ఛైర్మన్ సైరస్ పూనావాలా తన గరిష్ట స్థాయి కంటే 27 శాతం తక్కువగా,  మాక్రోటెక్ డెవలపర్స్  మంగళ్ ప్రభాత్ లోధా సుమారు 22 శాతం తక్కువలో ఉన్నారు.

గత నెలన్నరలో బిలియనీర్ల సంపద పెరిగింది ఇలా 

(సంపద బిలియన్ డాలర్లలో)..

పేరు    ప్రస్తుత     తాజా    పెరిగిన
    సంపద    కనిష్ట స్థాయి    సంపద

1) ముకేశ్ అంబానీ    101.0    81.5    19.5
2) గౌతమ్ అదానీ    76.5    63.0    13.5
3) దిలీప్ షాంఘ్వీ    28.2    23.9    4.3
4) సునీల్ మిత్తల్‌‌‌‌‌‌‌‌    27.3    22.5    4.8
5) రాధాకిషన్ దమాని    19.8    15.3    4.5
6) సావిత్రి జిందాల్‌‌‌‌‌‌‌‌    31.1    27.1    4.0
7) శివ్‌‌‌‌‌‌‌‌ నాదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌    36.6    31.9    4.7
8) లక్ష్మీ మిత్తల్‌‌‌‌‌‌‌‌    22.8    19.1    3.7
9) ఉదయ్ కోటక్    16.4    13.5    2.9
10) షాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిస్త్రీ    34.7    31.6    3.1