పంజాబ్‌లో స్కూళ్లు, కాలేజీలు క్లోజ్

పంజాబ్‌లో స్కూళ్లు, కాలేజీలు క్లోజ్

గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని మినహాయింపులతో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం తర్వాత తాజా ఆంక్షలు జారీచేశారు.  ఈ కొత్త ఆంక్షల ప్రకారం పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యాసంస్థలు మూసివేయబడతాయి. అయితే వర్చువల్ గా తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతులిచ్చింది. కాగా.. మెడికల్, నర్సింగ్ కాలేజీలు మాత్రం యథావిధిగా నడుపుకోవచ్చని తెలిపారు. ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. బార్‌లు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్, రెస్టారెంట్‌లు, స్పాలు, మ్యూజియంలు, జంతుప్రదర్శనశాలలు 50% సామర్థ్యంతో పనిచేయవచ్చని ప్రకటించారు. కాగా.. సిబ్బంది పూర్తిగా టీకాలు వేసుకుంటేనే పనిలోకి రానివ్వాలని కొత్త ఆర్డర్ జారీచేసింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్స్ మరియు జిమ్‌లు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. అయితే జాతీయ లేదా అంతర్జాతీయ ఈవెంట్‌ల కోసం శిక్షణ పొందే క్రీడాకారులకు మాత్రమే ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతులిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు రెండు డోసుల టీకాలు తీసుకున్న సిబ్బంది మాత్రమే హాజరుకావాలని కొత్త ఉత్తర్వులలో పేర్కొన్నారు. ర్యాలీలు, సమావేశాలకు కూడా ఆంక్షలు విధించబడ్డాయి. పంజాబ్‌లో డిసెంబర్ 28న 51 కేసులు నమోదుకాగా.. సోమవారం వాటిసంఖ్య 419కి చేరింది. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ ఆంక్షలు జనవరి 15వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.