ఎయిర్ ఫోర్స్ లో ఫస్ట్ మహిళా పైలట్ గా అఫ్గాన్ యువతి

ఎయిర్ ఫోర్స్ లో ఫస్ట్ మహిళా పైలట్ గా అఫ్గాన్ యువతి

అఫ్గానిస్తాన్​లో జరుగుతున్నది చూసి ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. ముఖ్యంగా అక్కడ మహిళల గురించి ఆందోళన. ఇప్పుడే కాదు తాలిబన్లు అక్కడ చొరబడక ముందే బెదిరింపులు ఎదుర్కొంది ఆ దేశ మొదటి ఎయిర్​ఫోర్స్​ పైలట్​ నిలోఫర్​ రెహ్మని. పైలట్​గా తిరుగులేని విజయాలను సాధిస్తూ.. మహిళల చుట్టూ ఉండే కట్టుబాట్లు దాటి యుద్ధ విమానాలు నడిపినందుకు తనకు, తన కుటుంబానికి తాలిబన్ల బెదిరింపులు తప్పలేదు. రహ్మాని అఫ్గానిస్తాన్​లోని లోగర్​లో పుట్టింది. బాల్యం అంతా పాకిస్తాన్​లో గడిచింది. కొద్ది రోజుల తర్వాత కుటుంబంతో కలిసి అఫ్గానిస్తాన్​ వచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు పైలట్​ కావాలని కోరిక. అందుకు చాలా కష్టపడి అఫ్గాన్​ ఎయిర్​ఫోర్స్​ 2010 ఆఫీసర్స్​ ట్రైనింగ్​కు సెలక్ట్​ అయింది. 2012లో సెకండ్​ లెఫ్టినెంట్​గా అర్హత సాధించింది. ఆమె మొట్టమొదటి సోలో విమానం సెస్నా 182 అనే చిన్న ఫ్లయిట్. కానీ పెద్ద విమానాలు నడపాలని అడ్వాన్స్​డ్​ ఫ్లయిట్​ స్కూల్​కు వెళ్లింది. ఆ తర్వాత మిలిటరీ కార్గో ఫ్లయిట్​ను నడిపింది.

చనిపోయిన, గాయపడిన సైనికులను మహిళలు తీసుకురావడం నిషేధం అనే కల్చర్​ను రెహ్మని తుడిచి వేసింది. ఒక మిషన్‌‌లో గాయపడిన సైనికులను ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఎయిర్​ఫోర్స్​లో మహిళా పైలట్​గా ఆమె అఛీవ్​మెంట్స్​ అఫ్గాన్​ మీడియాలో వస్తుండేవి. అప్పుడు రెహ్మని కుటుంబానికి తాలిబాన్ల నుండి బెదిరింపులు వచ్చేవి.ఆమె ఆశయాలను చూసి, కెరీర్ గురించి తాలిబన్లు బెదిరించేవారు. అయినా రెహ్మని భయపడలేదు. పెద్ద విమానాలు నడిపి తన ధైర్యాన్ని నిరూపించింది. అఫ్గాన్​ ఎయిర్​ఫోర్స్​లో సీ-130 అనే పెద్ద విమానాన్ని నడిపి ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఆ తర్వాత ఫ్లయిట్​ ఇన్​స్ట్రక్టర్​ ​గా మారింది. 2016 లో అఫ్గాన్​లో ఆమె మిషన్​ పూర్తయింది. తర్వాత అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్లిపోయింది.