‘నియో మోషన్‌‌‌‌’ టు ఇన్‌‌‌‌ వన్‌‌‌‌ వీల్‌‌‌‌ చెయిర్

‘నియో మోషన్‌‌‌‌’ టు ఇన్‌‌‌‌ వన్‌‌‌‌ వీల్‌‌‌‌ చెయిర్

అన్నీ సక్రమంగా ఉన్నా లైఫ్​లో ఏదో మిస్‌‌‌‌ అయిందని బాధ పడుతుంటారు కొందరు. చిన్న కష్టానికే కుంగిపోయి, బతకడం దండగ అనుకుంటారు ఇంకొందరు. అలాంటివాళ్లు ఇతని గురించి చదవాలి. ఈయన స్టోరీ తెలుసుకుంటే కొండంత గుండె ధైర్యం కలుగుతుంది. జీవితంలో ఏం సాధించాలో అర్థం అవుతుంది. 

కష్టాలను గట్టెక్కడం ఎలానో తెలిసొస్తుంది. 

చెన్నైకి చెందిన గణేష్‌‌‌‌ మురుగన్‌‌‌‌కు ముప్పై ఏడేండ్ల వయసులో రోడ్డు యాక్సిడెంట్‌‌‌‌ అయ్యి, స్పైనల్‌‌‌‌ ఇంజ్యూరీ అయింది. దాంతో రెండు కాళ్లు పనిచేయకుండా పోయాయి. కొన్నేండ్లు మంచం మీదే ఉన్నాడు. అలాంటి క్లిష్ట సమయాల్లో కూడా ‘నా జీవితం అయిపోయింది’ అని బాధపడలేదు. ‘ఇలా ఇంకా ఎన్ని రోజులు ఒకరిపై ఆధారపడి ఉండాలి. నా జీవితం అప్పుడే అయిపోలేదు. నాకంటూ ఒక గుర్తింపు రావాలి’ అనుకున్నాడు. దానికోసం జొమాటో ఫుడ్‌‌‌‌ డెలివరీ బాయ్‌‌‌‌గా చేయాలనుకున్నాడు. అందుకు అతని ఆరోగ్య పరిస్థితి అడ్డుకాలేదు. ‘నియో మోషన్‌‌‌‌’ అనే టు ఇన్‌‌‌‌ వన్‌‌‌‌ వీల్‌‌‌‌ చెయిర్ కొనుక్కున్నాడు. సైకిల్‌‌‌‌ కేటగిరీలో డెలివరీ బాయ్‌‌‌‌ జాబ్‌‌‌‌లో చేరి నెలకు ఇరవై వేల రూపాయల వరకు సంపాదిస్తూ, అంగవైకల్యం దేనికీ అడ్డుకాదని నిరూపించాడు. 

నియో మోషన్‌‌‌‌ అంటే...

ఐఐటి మద్రాస్‌‌‌‌కు చెందిన స్టూడెంట్స్‌‌‌‌ దివ్యాంగుల కోసం టు ఇన్ వన్‌‌‌‌ వీల్‌‌‌‌ చెయిర్ తయారుచేశారు. దీనికి నియో మోషన్ అని పేరు పెట్టారు. వీల్‌‌‌‌ చెయిర్‌‌‌‌‌‌‌‌పై ఆధారపడినవాళ్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని వాడటం కూడా చాలా ఈజీ. ఈ వీల్‌‌‌‌ చెయిర్‌‌‌‌‌‌‌‌కు ముందు ఇ–బైక్‌‌‌‌ అటాచ్‌‌‌‌ అయి ఉంటుంది. ఇ– బైక్‌‌‌‌ కావాలంటే వీల్‌‌‌‌ చెయిర్‌‌‌‌‌‌‌‌కు అటాచ్‌‌‌‌ చేసి ఉంచొచ్చు. లేదంటే తీసేసి మామూలు వీల్‌‌‌‌ చేయిర్‌‌‌‌‌‌‌‌లా వాడుకోవచ్చు. ఇ– బైక్‌‌‌‌ సాయంతో బయటకు ఎక్కడికైనా వెళ్లొచ్చు. ‘నాలుగ్గోడల మధ్యనుంచి వాళ్లను బయటికి తీసుకురావాలనే ఆలోచనతో తయారుచేసిందే టు ఇన్ వన్ వీల్‌‌‌‌ చెయిర్‌‌‌‌‌‌‌‌. దీనివల్ల వాళ్లకి సెల్ఫ్‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌ వస్తుందని మా నమ్మకం’ అని దీన్ని తయారుచేసిన వాళ్లలో ఒకరైన ఆశిష్‌‌‌‌ మోహన్‌‌‌‌ శర్మ చెప్పాడు. ఈ వీల్‌‌‌‌ చెయిర్ కావాలంటే నియో మోషన్ వెబ్‌‌‌‌ సైట్‌‌‌‌లో రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ అయి ఆర్డర్ పెట్టుకోవచ్చు.