నిర్భయ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనకు విధించిన మరణ శిక్షపై రివ్యూ చేయాలని దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ గత మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించనున్న త్రిసభ్య ధర్మాసనం.. అక్షయ్ సింగ్ పిటిషన్ పై రివ్యూ చేయనుంది. ఇవాళే సుప్రీం తన ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది. ఒకవేళ రివ్యూ చేసేది లేదని, గత తీర్పే ఫైనల్ అని చెబితే… మరణ శిక్షకు రూట్ క్లియర్ అవుతుంది. సుప్రీం తీర్పుతో నిర్భయ దోషులకు అన్ని ఆప్షన్లు పూర్తవుతాయి. 2017లో దోషులకు మరణ శిక్ష విధించింది కోర్టు.
తిహార్ జైలులోనే దోషులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బక్సర్ జైలు నుంచి ఉరి తాళ్లు కూడా ఆర్డర్ చేశారు. ఈ తాళ్లతో ఇప్పటి వరకు కోల్ కత్తా అలీపూర్ జైలులో రేపిస్టు ధనుంజయ్ ఛటర్జీని ఉరి తీశారు. అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్ నూ ఈ తాళ్లతోనే ఉరి తీశారు. అయితే తిహార్ జైలులో ఒకే సమయంలో ఇద్దరికి మాత్రమే ఉరి వేసేలా చాంబర్ ఉంది. దీన్ని 1950లో నిర్మించారు. అయితే ఇద్దరికి ఒకసారి, మరో ఇద్దరికి ఆ తర్వాత శిక్ష విధించడం సాధ్యం కాదు. ఎందుకంటే మరో ఇద్దరి బిహేవియర్ చేంజెస్ ఉంటాయని, స్పృహ తప్పి పడిపోయినా.. శిక్ష అమలు సాధ్యం కాదని అంటున్నారు. అందుకే నలుగురినీ ఒకేసారి ఉరి తీసేలా ఏర్పాట్లు వేగంగా చేస్తున్నట్లు తెలిసింది.
కొత్త జైలు నిబంధనల ప్రకారం.. క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించిన 14 రోజుల తర్వాతే మరణశిక్ష విధించాల్సి ఉంటుంది. దోషుల కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉరి తీస్తున్నారో సమాచారం ఇవ్వాలి. ఈ గ్యాప్ లో కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. తమ వస్తువులను కుటుంబ సభ్యులకు అందజేసే ఛాన్స్ ఉంది. ఉరి వేసే ఒకరోజు ముందు దోషులు కోరుకున్న ఆహారం అందించాలి. వారు కోరుకుంటే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని కొత్త జైలు నిబంధనలు చెబుతున్నాయి.

