నిర్భయ దోషులకు ఇక ఉరి తప్పదని తెలుస్తోంది. ఈ కేసులో దోషులైన వినయ్ కుమార్ శర్మ, ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. దీనితో దోషులను ఉరి తీయడానికి లైన్ క్లియర్ అయింది. మరోవైపు దోషులను ఈ నెల 22న ఉదయం 7గంటలకు ఉరితీయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 7న డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ జారీ అయిన వెంటనే వినయ్, ముఖేశ్‌లిద్దరూ తమకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలంటూ విడివిడిగా క్యూరేటివ్ పిటిషన్లను దాఖలు చేశారు.
ఉరిశిక్షకు ముందు ఉపశమనానికి కోర్టు పరంగా క్యూరేటివ్ పిటిషన్ ఒక్కటే మార్గం. ఇప్పుడు అది కూడా కొట్టివేయడంతో దోషులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఒకవేళ రాష్ట్రపతి వారి క్షమాభిక్షను తిరస్కరిస్తే వారికి ఉరి తప్పదు.

