పాఠాలు బోధించి.. కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

పాఠాలు బోధించి.. కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కొరటికల్ గ్రామ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ పరిసరాలను పరిశీలించారు. ప్రైమరీ స్కూల్ స్టూడెంట్లతో అక్షరాలు, పదాలు చదివించారు. అ నంతరం హైస్కూల్ తరగతులను సందర్శించి, టెన్త్​ స్టూడెంట్లకు పాఠాలు బోధించి, ప్రశ్నలు అడిగారు.  

బోర్డు పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రణాళికతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. కిచెన్​ను పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. తర్వాత చిన్నారులతో కలిసి కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు. స్కూల్ ప్రాంగణంలో అధికారులు, టీచర్లు, స్టూడెంట్లతో కలిసి మొక్కలు నాటారు. మండల ప్రత్యేక అధికారి రాజనర్సయ్య, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.