సేవ్ సర్కారీ ల్యాండ్స్.. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై స్పెషల్ ఫోకస్

సేవ్ సర్కారీ ల్యాండ్స్.. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై స్పెషల్ ఫోకస్
  • నిర్మల్​ జిల్లాలో నాలుగు మండలాల్లో 82 ఎకరాల ఆక్రమణల గుర్తింపు
  • ఈ భూముల విలువ రూ.15 కోట్లకు పైనే..
  • మరో 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొనసాగుతున్న సర్వే
  • కబ్జాదారులపై క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం

నిర్మల్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని, వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి భరతం పట్టేందుకు కలెక్టర్ అభిలాష అభినవ్​ స్పెషల్ యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ‘సేవ్ గవర్నమెంట్ ల్యాండ్స్’ పేరిట రూపొందించిన ఈ యాక్షన్ ప్లాన్ జిల్లా లోని 19 మండలాల్లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు నాలుగు మండలాల్లో దాదాపు 85 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

 మిగతా 15 మండలాల్లో దాదాపు 300 ఎకరాలకు పైగా భూములు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం దీని కనుగుణంగానే సర్వే చేపడుతున్నారు. ఈ మండలాల్లో పకడ్బందీ సర్వే చేపట్టి ఆక్రమణలపై స్పష్టత తీసుకురానున్నారు. 

నాలుగు మండలాల్లో ఆక్రమణల గుర్తింపు

నిర్మల్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న రూరల్ మండలంలో రూ.5.77 కోట్ల విలువైన 35.03 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు నిర్ధారించారు. భైంసా మండలంలో రూ.2.07 కోట్ల విలువైన 18.31 ఎకరాలు, నర్సాపూర్ జిలో రూ.2.04 కోట్ల విలువైన 16 ఎకరాలు, లోకేశ్వరం మండలంలో రూ.కోటి 35 లక్షల విలువైన 12.25 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. 

కేవలం ఈ నాలుగు మండలాల్లోనే దాదాపు 82 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు తేల్చారు. రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల ప్రకారం ఈ భూముల విలువ దాదాపు రూ.15 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడిస్తుండగా.. బహిరంగ మార్కెట్ డిమాండ్ ప్రకారం దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని టాక్. ఈ ఆక్రమిత భూములన్నింటినీ స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగంగా సాగుతోంది. మిగతా 15 మండలాల్లో ఆక్రమణలపై నెల రోజుల్లో సర్వే ద్వారా నిర్ధారణ చేసి వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మండలాల్లో ఆక్రమణకు గురైనట్లు భావిస్తున్న 300 ఎకరాల భూముల విలువ బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.200 నుంచి రూ.300 కోట్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.

క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం

నిర్మల్​రూరల్, భైంసా, నర్సాపూర్​జి, లోకేశ్వరం మండలాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడిన వారిని అధికారులు ఇప్పటికే గుర్తించారు. వీరి నుంచి ఆ భూములను స్వాధీనం చేసుకొని, వారందరిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నా రు. ఆక్రమణదారులపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసి వారిపై క్రిమినర్ కేసులు నమోదయ్యేలా చూడనున్నారు. ఈ మేరకు రెవెన్యూ, ఇరిగేషన్, అటవీ శాఖలు సంయుక్తంగా సర్వే నంబర్లతో సహా ఫిర్యాదులు చేసేందుకు రెడీ అవుతున్నారు.

కఠిన చర్యలు తప్పవు

జిల్లాలో ప్రభుత్వ భూములతో పాటు శిఖం, ఫారెస్ట్, ప్రాజెక్టుల కాలువల భూములను ఆక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించి ఆ భూములన్నిటినీ స్వాధీనం చేసుకునే చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. –అభిలాష అభినవ్, జిల్లా కలెక్టర్, నిర్మల్