జీవో 142 రద్దు చేసేదాకా పోరాటం : జేఏసీ నేతలు

జీవో 142 రద్దు చేసేదాకా పోరాటం : జేఏసీ నేతలు

 కార్యాలయం ఎదుట వైద్యారోగ్య ఉద్యోగుల ధర్నా

నిర్మల్, వెలుగు: ప్రజారోగ్య వైద్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వం తీసుకువస్తున్న జీవో 142ను రద్దు చేసేదాకా పోరాటం చేస్తామని వైద్యారోగ్య శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఐక్య ఉద్యోగ సంఘాలు ధర్నా నిర్వహించాయి. జేఏసీ నేతలు మాట్లాడుతూ జీవో 142 ఆరోగ్య శాఖ ఉద్యోగుల హక్కులను కాలరాసేలా ఉందన్నారు. 

నిర్మల్ జిల్లాలో పది మంది కొత్త హెల్త్ అసిస్టెంట్లు, హెల్త్ ఎడ్యుకేటర్లు, మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, లెప్రసీ విభాగంలో పనిచేసే ఏపీఎంఓలు, డీపీఎంవోలు, మలేరియా విభాగంలో పనిచేసే సబ్ యూనిట్ అధికారుల పోస్టులు మొత్తం రద్దవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టులన్నింటిన్నీ పక్క జిల్లాలకు తరలించారని విమర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విభజన సరిగా జరగలేదని, కొన్ని మండలాల్లో పీహెచ్​సీల జాడ లేకుండా పోయిందన్నారు. 

ప్రభుత్వం జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాటాలు చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో జేఏసీ నేతలు డాక్టర్ రాజేందర్, డాక్టర్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కన్నయ్య, కోశాధికారి వేణుగోపాలరావు, నేతలు రమణారెడ్డి, సురేశ్, సరస్వతి, మాధురి, విమల, ఉమారాణి, శాంత, ప్రేమలత, అన్ని కేడర్ల ఉద్యోగులు పాల్గొన్నారు.  అనంతరం కలెక్టర్, డీఎంఅండ్ హెచ్ఓకు వినతి పత్రాలు అందజేశారు.