నిర్మల్ ఉత్సవాల ఏర్పాట్లను పూర్తి చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

 నిర్మల్ ఉత్సవాల ఏర్పాట్లను పూర్తి చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు : నిర్మల్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్​లో నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 19 నుంచి 23 వరకు నిర్మల్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గతేడాది ఉత్సవాలను విజయవంతంగా నిర్వ హించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందామన్నారు. ఈసారి కూడా అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఎన్టీఆర్ స్టేడియం సుందరీకరణ పనులు, తదితర ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నిర్మల్ ఉత్సవాలకు ప్రొటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానాలు అందించాలని సూచించారు. ఉత్సవాల విజయవంతానికి విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకల్యాణి, డీఈవో భోజన్న, డివైస్ఓ శ్రీకాం త్ రెడ్డి, డిఆర్డివో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, అధికారులు పాల్గొన్నారు.