ఐదేళ్లలో దేశ ఎకానమీని రెండింతలు బలోపేతం చేశాం : నిర్మల

ఐదేళ్లలో దేశ ఎకానమీని రెండింతలు బలోపేతం చేశాం : నిర్మల

ఐదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ మా టార్గెట్ : నిర్మల

ప్రపంచంలో ఆరో శక్తిమంతమైన దేశంగా ఎదిగాం

లోక్ సభలో నిర్మల సీతారామన్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో.. భారత్  బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని లోక్ సభలో చెప్పారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. బడ్జెట్ 2019 ను ఆమె లోక్ సభలో ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక శక్తి ఎలా పెరిగిందో ఆమె వివరించారు.

గడిచిన 55ఏళ్లలో భారత్ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్లు అంటే.. సుమారు రూ.70 లక్షల కోట్లుగా మాత్రమే ఉండేదన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల జాబితాలో భారతదేశం 11వ స్థానంలో ఉండేదన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చేనాటికి భారత ఎకానమీ 1.85లక్షల కోట్లుగా ఉందన్నారు. ఐతే.. మోడీ హయాంలో గడిచిన ఐదేళ్లలో ఈ నంబర్ ను డబుల్ చేశామన్నారు నిర్మల. భారత ఆర్థిక వ్యవస్థ 2.5 ట్రిలియన్ యూఎస్ డాలర్స్ పైకి చేరిందనీ.. ఈ ఏడాది చివరకు అది 3 ట్రిలియన్ డాలర్స్ కు చేరబోతోందని ఆమె చెప్పారు. అంటే.. ఐదేళ్లలోనే భారత ఆర్థిక వ్యవస్థను రెండింతలు బలోపేతం చేశామన్నారు.

భారత్ ఇపుడు ప్రపంచ శక్తిమంతమైన దేశాల జాబితాలో 6వ స్థానానికి చేరిందన్నారు.

రాబోయే ఐదేళల్లో భారత ఎకానమీని 5 ట్రిలియన్ యూఎస్ డాలర్స్( 5లక్షల కోట్ల డాలర్లు).. అంటే రూ.350 లక్షల కోట్లకు చేర్చడమే మోడీప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఐదేళ్లలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతిని మార్చేయబోతున్నాయని ఆమె వివరించారు.