జన్​ధన్​ ఖాతాలతో అందరికీ బ్యాంకింగ్​ సేవలు: నిర్మలా సీతారామన్​

జన్​ధన్​ ఖాతాలతో అందరికీ బ్యాంకింగ్​ సేవలు: నిర్మలా సీతారామన్​
  • 50 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు

న్యూఢిల్లీ: జన్​ధన్ ​యోజన, డిజిటలైజేషన్​తో అన్ని వర్గాల వారికి బ్యాంకింగ్​సేవలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. జన్​ధన్​ యోజన వల్ల 50 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరిచారని, వీటిలోని డిపాజిట్ల విలువ రూ.రెండు లక్షల కోట్లు దాటిందని తెలిపారు. ప్రధాన మంత్రి జన్​ధన్​ యోజన (పీఎంజేడీవై)కి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. జన్​ధన్​ ఖాతాల్లో 55.5 శాతం ఖాతాలు మహిళలవేనని, 67 శాతం అకౌంట్లు గ్రామీణ, చిన్న పట్టణాల నుంచి ఉన్నాయని అన్నారు. ఈ పథకం కింద, బ్యాంక్ ఖాతాల సంఖ్య మార్చి 2015లో 14.72 కోట్ల నుంచి 3.4 రెట్లు పెరిగి 2023 ఆగస్టు 16 నాటికి 50.09 కోట్లకు చేరుకుంది. 

మొత్తం డిపాజిట్లు కూడా మార్చి 2015 నాటికి రూ. 15,670 కోట్ల నుంచి ఆగస్టు 2023 నాటికి రూ. 2.03 లక్షల కోట్లకు పెరిగాయి. జన్ ధన్ ఖాతాల్లోని సగటు డిపాజిట్‌‌‌‌‌‌‌‌ మార్చి 2015 నాటికి రూ. 1,065 నుంచి 3.8 రెట్లు పెరిగి ఆగస్టు 2023 నాటికి రూ. 4,063కి పెరిగింది. ఈ ఖాతాలకు దాదాపు 34 కోట్ల రూపే కార్డులను ఎటువంటి చార్జీలూ లేకుండా జారీ చేశారు. దీంతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పాలసీ కూడా వస్తుంది.

 జన్​ధన్​ పథకం కింద జీరో- బ్యాలెన్స్ ఖాతాలు ఆగస్టు 2023 నాటికి మొత్తం ఖాతాలలో 8 శాతానికి తగ్గాయి. ఈ విషయమై కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్​ ఖరాద్​ మాట్లాడుతూ జన్​ధన్​ ఖాతాల వల్ల ప్రభుత్వ పథకాల డబ్బు నేరుగా లబ్దిదారుల ఖాతాలకే వెళ్తోందని అన్నారు. అన్ని వర్గాలకూ బ్యాంకింగ్​సేవలను అందుబాటులోకి  తేవడంలో జన్​ధన్​ యోజన కీలకపాత్ర పోషించిందని వివరించారు. జన్​ధన్​ యోజనను 2014, ఆగస్టు 28న ప్రారంభించారు.