
స్టాండప్ ఇండియా కింద రూ.40 వేల కోట్ల లోన్లు
న్యూఢిల్లీ : స్టాండప్ ఇండియా స్కీమ్ కింద గత ఏడేళ్లలో బ్యాంకులు రూ.40,700 కోట్ల విలువైన లోన్లు ఇచ్చాయని కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనివల్ల 1.80 లక్షల మంది ప్రయోజనం పొందారని వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో ఎంట్రప్రెనూర్‌షిప్‌ను ఎంకరేజ్ చేయడానికి, బలహీనవర్గాలకు ఆర్థికంగా సాయపడటానికి, ఎకానమీని శక్తిమంతం చేయడానికి ఈ స్కీమును 2016 ఏప్రిల్ ఐదున మొదలుపెట్టారు. దీనిని 2025 వరకు పొడగించారు. కొత్తగా వ్యాపారాలు పెట్టుకోవాలనుకునే ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు లోన్లు ఇచ్చేలా ప్రభుత్వం బ్యాంకులను ఎంకరేజ్ చేస్తుంది.
వీళ్లు తమ కలలను సాధించుకోవడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకుండా చూడాలన్నదే ఈ స్కీమ్ టార్గెట్. వ్యవసాయం, తయారీ, సర్వీసులు, ట్రేడింగ్ సెక్టార్లో వ్యాపారాలు చేయాలనుకునే వారికి లోన్లు ఇస్తారు. ఏకంగా 1.80 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు లోన్లు ఇవ్వడం తనకు గర్వకారణమని, ఈ విజయం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని నిర్మల అన్నారు. ఈ స్కీము వల్ల బిజినెస్‌లు ఏర్పాటు చేయడం సులువుగా మారిందని అన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు స్టాండప్ ఇండియా స్కీము చాలా కీలకం. ఎంతో మంది జీవితాలను బాగు చేసింది. పేదలకు సులువుగా లోన్లు వచ్చాయి. మహిళా ఎంట్రప్రెనూర్లు తమలోని సత్తాను చూపెట్టేందుకు స్టాండప్ ఇండియా సాయపడింది. చాలా మందికి ఉపాధి దొరికింది”అని ఆమె వివరించారు.
స్టాండప్ ఇండియా.. చాలా ముఖ్యం...
బలహీనవర్గాలకు స్టాండప్ స్కీమ్వరంలా మారిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ అన్నారు. ‘నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్’కు ఇది వెన్నెముక వంటిదని కామెంట్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు, మహిళల బిజినెస్‌లకు అవసరమైనప్పుడల్లా లోన్లు ఇవ్వాల్సిందిగా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్‌కు సూచించామని వెల్లడించారు. ఎంట్రప్రెనూర్లు, వారి ఉద్యోగులు, కుటుంబాల జీవితాలను మెరుగుపడేలా చేయడంలో ఈ స్కీమ్ కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ స్కీమ్ కింద ఎంట్రప్రెనూర్లకు లోన్లు ఇప్పించడంతోపాటు వ్యాపారాల్లో తగిన సాయం అందించడానికి స్మాల్ ఇండస్ట్రీస్ డెవెలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) standupmitra.in పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేసింది.
వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి సాయం ఎలా పొందాలో కూడా ఇది గైడ్ చేస్తుంది. స్టాండప్ఇండియా కింద ఒక ఎంట్రప్రెనూర్కు రూ.పది లక్షల నుంచి రూ.కోటి వరకు లోన్ ఇస్తారు. ప్రతి బ్యాంకులో కనీసం ఒక్కరికైనా ఈ స్కీమ్ కింద లోన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా స్కీముకు అర్హులే కానీ వాళ్ల వ్యాపారంలో ఎస్సీ,ఎస్టీ, మహిళలకు కనీసం 51 శాతం షేర్‌హోల్డింగ్ ఉండాలి. ఇది వరకు డిఫాల్ట్ అయి ఉండకూడదు. బ్యాంకు ద్వారా, సిడ్బీ పోర్టల్ ద్వారా లేదా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా లోన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.