జార్ఖండ్ లో అవినీతి, అరాచకత్వం : నిర్మలా సీతారామన్

జార్ఖండ్ లో అవినీతి, అరాచకత్వం : నిర్మలా సీతారామన్

రాంచీ:  జార్ఖండ్ లో అవినీతి, అరాచకత్వం రాజ్యమేలుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని తెలిపారు. గురువారం రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో కొనసాగుతున్న సంకీర్ణ కూటమిపై విమర్శలను ఎక్కుపెట్టారు. జార్ఖండ్ పై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తుందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. 2024–25 బడ్జెట్ లో రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి రికార్డు స్థాయిలో రూ.7,200 కోట్ల నిధులను కేటాయించామని తెలిపారు. 

బిర్సా ముండా పుట్టిన ఈ భూమి అవినీతికి కేంద్రంగా మారింది. వలసలు, అరాచకత్వం రాజ్యమేలుతున్నాయి. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం లేదు. పరిశ్రమల పునరుద్ధరణతో ఈశాన్య భారతదేశం కూడా దేశానికి గ్రోత్ ఇంజిన్ గా మారింది”అని చెప్పారు. ఇండియాలోని ఖనిజ సంపదలో 40 శాతం జార్ఖండ్ లోనే ఉందని వివరించారు. ఖనిజాలతో ఆదాయాన్ని ఆర్జించే అంశంపై దృష్టి సారించాలని కోరారు. ‘‘ఈజ్ ఆఫ్​ డూయింగ్ బిజినెస్ లో జార్ఖండ్ మొదటి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేది. 

ప్రస్తుతం ఇక్కడ జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోంది. శాంతి, భద్రతలు మెరుగుపడితే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చు. ప్రస్తుతం జార్ఖండ్ లో ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది” అని నిర్మల పేర్కొన్నారు. రాష్ట్రంలోని  సాహిబ్ గంజ్, సంతాల్ పరగణాలు, గొడ్డా వంటి ప్రాంతాలు చొరబాటుదార్ల కారణంగా జనాభా మార్పులకు లోనవుతున్నాయని ఆమె అన్నారు.