
హైదరాబాద్, వెలుగు: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ యంగ్ జిమ్నాస్ట్ నిషికా అగర్వాల్, వెయిట్ లిఫ్టర్ జె. సాయి వర్ధన్ స్వర్ణ పతకాలతో మెరిశారు. విమెన్స్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆల్-రౌండ్ ఈవెంట్‌లో నిషికా వరుసగా రెండోసారి గోల్డ్ గెలిచి టైటిల్ నిలబెట్టుకుంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్లో 17 ఏండ్ల నిషికా 44.333 స్కోరుతో టాప్ ప్లేస్‌తో బంగారు పతకం ఖాతాలో వేసుకుంది.
మహారాష్ట్రకు చెందిన అనౌష్క పాటిల్- 42.067 స్కోరుతో రజతం, సారా రావుల్ 41.233 స్కోరుతో కాంస్యం గెలిచారు. మరోవైపు వెయిట్ లిఫ్టర్ సాయి వర్ధన్ యూత్ బాయ్స్ 89 కేజీ విభాగంలో 275 కేజీల (స్నాచ్120, క్లీన్ అండ్ జర్క్155) బరువు ఎత్తి బంగారు పతకం సాధించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చెంచు వెంకటేష్ 272 కేజీలతో రజతం, జార్ఖండ్ లిఫ్టర్ రోహన్ కుమార్ మహతో 266 కేజీలతో కాంస్యం గెలిచారు.